Krishna Teja: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఓఎస్‌డీగా యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణతేజ

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు.

Updated : 21 Jun 2024 07:53 IST

ప్రత్యేక అనుమతి ఇచ్చిన చంద్రబాబు
కేరళ నుంచి డిప్యుటేషన్‌పై పంపాలని కేంద్రానికి లేఖ

ఈనాడు, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ(ఓఎస్‌డీ)గా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఐఏఎస్‌ అధికారి మైలవరపు వీఆర్‌ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్‌డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్‌డీలుగా నియమిస్తారు. అయితే పవన్‌కల్యాణ్‌ కోసం.. ఐఏఎస్‌ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనను డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా సేవలందించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్‌కల్యాణ్‌ను కలిశారు.

త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన ఆయన.. 2023 మార్చిలో కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతోపాటు 150మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని