YS Vijayamma: కంటతడి పెట్టిన వైఎస్‌ విజయమ్మ

వైఎస్‌ విజయమ్మ కంటతడి పెట్టారు... కుమారుడు జగన్‌ను ముద్దాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. ఆమెను సోదరుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఓదార్చారు.

Published : 09 Jul 2024 05:45 IST

వైఎస్సార్‌ జయంతి కార్యక్రమంలో జగన్‌ను హత్తుకుని భావోద్వేగం
ఇడుపులపాయలో వేర్వేరుగా జగన్, షర్మిల కుటుంబసభ్యుల నివాళి

వైఎస్సార్‌ సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పిస్తున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల 

ఈనాడు, కడప-న్యూస్‌టుడే, వేంపల్లె: వైఎస్‌ విజయమ్మ కంటతడి పెట్టారు... కుమారుడు జగన్‌ను ముద్దాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. ఆమెను సోదరుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఓదార్చారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో సోమవారం జగన్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వేర్వేరుగా సమాధి వద్ద నివాళులర్పించారు. మొదట పులివెందుల నుంచి జగన్‌ దంపతులు వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకున్నారు. అంతకుముందే అక్కడికి చేరుకున్న విజయమ్మతో కలిసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా జగన్‌ను దగ్గరకు తీసుకుని విజయమ్మ  కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నికలకు ముందు అమెరికా వెళ్లిన ఆమె ఇటీవల తిరిగొచ్చారు. వైకాపా ఓటమి తర్వాత జగన్‌ను తొలిసారి చూశారు. పార్టీ ఓటమి, కుటుంబపరంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె భావోద్వేగానికి లోనైనట్లు అందరూ భావించారు. తర్వాత జగన్‌ దంపతులు కడపకు చేరుకుని, ప్రత్యేక విమానంలో తాడేపల్లి వెళ్లారు. అనంతరం షర్మిల తన భర్త అనిల్‌కుమార్, కుమార్తె, కుమారుడు, కోడలితో కలిసి ఘాట్‌కు చేరుకున్నారు. విజయమ్మతో కలిసి వైఎస్సార్‌ సమాధికి నివాళులర్పించారు.  విజయమ్మ తన కుమార్తె షర్మిలను దగ్గరకు తీసుకుని ముద్దాడారు. ప్రార్థనల అనంతరం షర్మిల తన కుటుంబసభ్యులతో కడప చేరుకుని, విమానంలో విజయవాడ వెళ్లారు. కార్యక్రమంలో వైఎస్‌ సుధీకర్‌రెడ్డి, ఎంపీలు అవినాష్‌రెడ్డి, గురుమూర్తి, తనూజారాణి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సుధ, చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

ఇడుపులపాయలో వైఎస్సార్‌ సమాధి వద్ద జగన్‌ను హత్తుకుని కంటతడి పెడుతున్న విజయమ్మ. చిత్రంలో ఎంపీ అవినాష్‌రెడ్డి తదితరులు 


కోట్లాది కుటుంబాలు గుర్తు చేసుకుంటున్నాయి: మాజీ సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘నాన్నా మీ 75వ పుట్టినరోజు మా అందరికీ పండగ రోజు. కోట్లాది కుటుంబాలు, ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైకాపా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టిన రోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం, జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గాలు. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా చివరి వరకూ మా కృషి సాగుతుంది’ అని మాజీ సీఎం జగన్‌ సోమవారం ‘ఎక్స్‌’ వేదికగా సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని