CBI: సాక్షిగా దస్తగిరి మార్పుపై అభ్యంతరం లేదు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరిని సాక్షిగా పరిగణించడంలో అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు సీబీఐ శుక్రవారం నివేదించింది. వివేకా హత్య కేసు విచారణను శుక్రవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం విచారించారు.

Updated : 22 Jun 2024 05:54 IST

సీబీఐ కోర్టుకు ఆమోదం తెలిపిన సీబీఐ
వివేకా హత్య కేసుపై విచారణ 5కు వాయిదా

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 4వ నిందితుడిగా ఉన్న షేక్‌ దస్తగిరిని సాక్షిగా పరిగణించడంలో అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు సీబీఐ శుక్రవారం నివేదించింది. వివేకా హత్య కేసు విచారణను శుక్రవారం సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్‌ టి.రఘురాం విచారించారు. నిందితులు టి.గంగిరెడ్డి అలియాస్‌ ఎర్రగంగిరెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను జైలు నుంచి తీసుకువచ్చి హాజరుపరచగా రిమాండ్‌ను జులై 5 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. వీరితోపాటు బెయిలుపై ఉన్న దస్తగిరి, డి.శివశంకర్‌రెడ్డి, వై.ఎస్‌.భాస్కరరెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిలు హాజరయ్యారు. తనను నిందితుల జాబితా నుంచి తొలగించి సాక్షిగా పరిగణనలోకి తీసుకోవాలంటూ షేక్‌ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. దస్తగిరి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 4వ నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షుల జాబితాలో 110వ సాక్షిగా పేర్కొన్నారని అన్నారు. సాక్షిగా ఉన్న వ్యక్తిని నిందితుల జాబితాలో చేర్చడం సరికాదని అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో కోర్టు క్షమాభిక్ష ప్రసాదించిందని అన్నారు. దీన్ని సవాలు చేస్తూ ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేశాయని వివరించారు. అందువల్ల నిందితుల జాబితా నుంచి తొలగించాలని కోరారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దస్తగిరిని నిందితుల జాబితా నుంచి తొలగించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. నిందితుల తరఫు న్యాయవాదులు ఇ.ఉమామహేశ్వరరావు, రవీందర్‌రెడ్డి, సాయి వంశీకృష్ణ, నయన్‌కుమార్‌రెడ్డిలు దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. వివేకా హత్య కేసులో స్వయంగా పాల్గొన్నట్లు దస్తగిరి దిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లగా వాంగ్మూలం నమోదు చేసుకుని వదిలిపెట్టారని, మళ్లీ మరోసారి వెళ్లగా అప్పుడూ అదే పనిచేసిందని అన్నారు. ఎవరైనా హత్య చేసి వచ్చామంటే ముందు అరెస్టు చేస్తారని, ఇక్కడ సీబీఐ మాత్రం నిందితుడికి  రెడ్‌కార్పెట్‌ వేస్తోందని పేర్కొన్నారు. కడప జేఎఫ్‌ఎస్‌ఎం కోర్టు, ఇక్కడి కోర్టు నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేయగా పలు సెక్షన్ల కింద విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకుందని అన్నారు. ఒకసారి కాగ్నిజెన్స్‌ తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఇదే కోర్టు పునఃసమీక్షించజాలదని అన్నారు. అంతేగాకుండా నిందితుడికి ఇచ్చిన క్షమాభిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయని, అవి పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. దస్తగిరిని వీఐపీగా పేర్కొనడాన్ని ఆయన తరఫు న్యాయవాది, సీబీఐ న్యాయవాది అభ్యంతరం చెప్పడంతో తీవ్ర వాగ్వాదం ఏర్పడగా న్యాయమూర్తి విచారణను జులై 5వ తేదీకి వాయిదా వేశారు.


జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ 24కు వాయిదా

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాఖలు చేసిన 20 కేసుల్లో 5 కేసులను సీబీఐ కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. మిగిలిన 15 కేసులనూ జులై 5వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి టి.రఘురాం ఉత్తర్వులిచ్చారు. హెటిరో, అరబిందోకు భూకేటాయింపు, రాంకీ ఫార్మా, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, వాన్‌పిక్‌కు సంబంధించిన కేసులను ఈనెల 24కు వాయిదా వేశారు. ఈ అయిదు కేసుల్లో ఉన్న నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. మిగిలిన కేసులన్నింటినీ జులైకి వాయిదా వేశారు. శుక్రవారం హెటిరో, అరబిందో కేసులో ప్రధాన నిందితుడైన వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని