YSRCP: ‘రాక్షస పాలనలో’ రాలిపోయినవారెందరో!

దొంగతనం కేసులో ఇరికించి, హింసించి అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణమయ్యారు. దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని అంతమొందించి.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారు.

Updated : 12 Jun 2024 08:44 IST

వైకాపా మూకల దాష్టీకాలకు బలైన అమాయకులు
ప్రశ్నిస్తే చాలు పగబట్టి.. చెరబట్టి చంపేశారు
పోలీసు వేధింపులకు ఓ మైనారిటీ కుటుంబం బలి
కొత్త ప్రభుత్వంలో న్యాయం కోరుతున్న బాధితులు
ఈనాడు-అమరావతి, యంత్రాంగం

  • తన అక్కను వేధిస్తున్న వైకాపా మూకల్ని ప్రశ్నించిన పాపానికి పద్నాలుగేళ్ల బాలుడు అమర్‌నాథ్‌గౌడ్‌ను పెట్రోల్‌ పోసి తగలబెట్టేశారు. 
  • వైకాపా నాయకుడి కుమార్తె కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న చదువుల తల్లి మిస్బాపై కక్ష కట్టి మరీ పొట్టన పెట్టుకున్నారు
  • కరోనా వేళ మాస్క్‌ అడిగినందుకు దళిత డాక్టర్‌ సుధాకర్‌ ప్రాణాలను బలి తీసుకున్నారు. 
  • మాస్క్‌ పెట్టుకోలేదంటూ దళిత యువకుడు కిరణ్‌కుమార్‌ చావుకు కారణమయ్యారు. 

దొంగతనం కేసులో ఇరికించి, హింసించి అబ్దుల్‌ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణమయ్యారు. దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని అంతమొందించి.. మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారు.  ఇలా ఒకరా.. ఇద్దరా.. ఇలా   చెప్పుకొంటూపోతే అయిదేళ్ల జగన్‌ అరాచక, దాష్టీక, దుర్మార్గ, దౌర్జన్య, నియంత పాలనకు బలైపోయిన బాధితులు ఊరూరా ఉన్నారు. అరాచక ప్రభుత్వం పోయి చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రమ్మని ‘వైకాపా బాధితులకు’ ప్రత్యేక ఆహ్వానం పంపించారు. వారి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని వారంతా ఆశిస్తున్నారు. 


కేసును సీబీఐకి అప్పగించాలి.. అనంతబాబును కఠినంగా శిక్షించాలి
- సత్యనారాయణ, నూకరత్నం, దళిత డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యం తల్లిదండ్రులు

మాకు పెద్ద దిక్కైన మా కుమారుడు వీధి సుబ్రమణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దారుణంగా చంపేసి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతల్ని సీబీఐకి అప్పగించాలి. అనంతబాబును కఠినంగా శిక్షించాలి. కష్టకాలంలో ఉన్నప్పుడు తెదేపా అధినేత చంద్రబాబే మాకు అండగా నిలిచారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చే పింఛను కూడా గతేడాది నుంచి నిలిపేసింది. అనంతబాబే ఆపించేశారనే అనుమానం ఉంది. మాకు జీవనాధారం లేకుండా పోయింది. వీధినపడ్డ మమ్మల్ని కొత్త ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశిస్తున్నాం. 


మార్కులు ఎక్కువ వచ్చాయని మా బిడ్డను బలితీసుకున్నారు 
- వజ్మీర్‌ అహ్మద్, నసీమా, మిస్బా తల్లిదండ్రులు, పలమనేరు

వైకాపా కార్యకర్త సునీల్‌కుమార్‌ దాష్టీకానికి మా కుమార్తె బలైపోయింది. పదో తరగతిలో తన కూమార్తే స్కూల్‌ టాపర్‌గా నిలవాలని, ఆమెకు పోటీగా ఎవరూ ఉండకూడదంటూ.. ఆమె కంటే బాగా చదివే, ఎక్కువ మార్కులు తెచ్చుకునే మా కుమార్తె మిస్బాపై సునీల్‌కుమార్‌ వేధింపులకు తెగబడ్డారు. మా చిన్నారిని పాఠశాల నుంచి తొలగించేలా చేశారు. తీవ్ర మనో వేదనకు గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితుణ్ని శిక్షించి మాకు న్యాయం చేయాలని విజయవాడకు వెళ్లి అప్పటి సీఎం జగన్‌కు విన్నవించేందుకు యత్నించగా.. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. గృహనిర్బంధం చేశారు. ‘కేసులు పెట్టి జైల్లో పడేస్తాం’ అంటూ బెదిరించారు. దీంతో సోడాలు అమ్మి బతికే నేను పుంగునూరు వెళ్లి తలదాచుకోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్లాక కూడా మున్సిపల్‌ ఛైర్మన్‌ అలీమ్‌ బాష మమ్మల్ని బెదిరించారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌ను కలిసేందుకు మేం ప్రయత్నించగా.. అక్కడికి వెళ్లొద్దంటూ వైకాపా నాయకులు మమ్మల్ని హెచ్చరించారు. మా కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సునీల్‌కుమార్, ప్రిన్సిపల్‌ రమేష్‌ను కఠినంగా శిక్షించాలి. కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుందని భావిస్తున్నా. 


కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న పోలీసులు, వైకాపా నాయకులు 
 శంషావలి, అబ్దుల్‌సలాం బావమరిది, నంద్యాల 

ఎలాంటి సంబంధమూ లేని చోరీ కేసులో మా బావ అబ్దుల్‌ సలాంను ఇరికించి పోలీసులు హింసించారు. దొంగతనానికి అసలు కారకులను తప్పించటానికి సలాంను బలి చేశారు. ఆయనపై అక్రమంగా దొంగతనం కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు. రికవరీ పేరుతో కుటుంబ సభ్యుల్ని వేధించారు. వారి వద్దనున్న సొంత బంగారాన్ని లాగేసుకున్నారు. విచారణ పేరుతో తీవ్రంగా వేధించారు. అవి తాళలేకే అబ్దుల్‌ సలాం, ఆయన భార్య నూర్జహాన్, కుమార్తె షేక్‌ సల్మా, కుమారుడు దాదా కలంధర్‌తో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారిది ఆత్మహత్య కాదు.. పోలీసులు, వైకాపా నాయకులు చేసిన హత్య. అందుకు కారకులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయాలి. అబ్దుల్‌ సలాంపై మోపిన దొంగతనం నేరంలో అసలు నేరగాళ్ల ఎవరో నిగ్గుతేల్చాలి. పెద్ద మనుషులుగా చలామణీ అవుతున్న ఆ వ్యక్తుల్ని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలి. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలి. అప్పటి సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌లు ప్రస్తుతం పోస్టింగుల్లోనే ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి.  


మా తమ్ముణ్ని తగలబెట్టిన వారు దర్జాగా తిరుగుతున్నారు..
ఉప్పాల అమర్‌నాథ్‌ గౌడ్‌ సోదరి, ఉప్పాలవారి పాలెం, చెరుకుపల్లి మండలం, బాపట్ల జిల్లా

నా తమ్ముణ్ని పెట్రోలు పోసి తగలబెట్టిన పాము వెంకటేశ్వరరెడ్డి కొన్ని రోజులకే జైలు నుంచి బయటికొచ్చేసి దర్జాగా ఊళ్లో తిరుగుతున్నాడు. మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నాడు. దీంతో బాధితులమైన మేం మాత్రం సొంతూరు వదిలిపెట్టి మరో ఊళ్లో తలదాచుకుని బతుకుతున్నాం. నిందితుడు ఇక్కడికీ వచ్చి మాపై రెక్కీ నిర్వహించాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. వెంకటేశ్వరరెడ్డికి వైకాపా ప్రభుత్వం అడుగడుగునా కొమ్ముకాసింది. ఇలాంటి పరిస్థితి ఉంటే నేరగాళ్లు మరింతగా పెట్రేగిపోతుంటారు. ఈ కేసు విచారణ కోసం కోర్టుకు హాజరైనప్పుడు కూడా భయం భయంగానే వెళ్తున్నాం. అందుకే ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి. వెంకటేశ్వరరెడ్డికి కఠిన శిక్ష పడేలా చేయాలి. అప్పుడే నాలాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. నా తమ్ముడి హత్య అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు నన్ను ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఇంటర్‌ చదివించారు. 


పోస్టు పెట్టినందుకు రాష్ట్రం వదిలి పోయేలా చేశారు
పూందోట రంగనాయకి, బాధితురాలు, గుంటూరు 

ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ఫేస్‌బుక్‌లో వచ్చిన పోస్టు ఫార్వర్డ్‌ చేసినందుకు నాపై రాజద్రోహం కేసు పెట్టి వేధించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోస్టు పెట్టానని చెప్పాలంటూ సీఐడీ అధికారులు నాపైనా తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా గుంటూరులో మేము నడుపుతున్న శంకర్‌విలాస్‌ హోటల్‌ నుంచి మమ్మల్ని బలవంతంగా బయటకు వెళ్లగొట్టారు. దాన్ని వేరే వాళ్ల పేరిట రాయించుకున్నారు. మరోచోట హోటల్‌ పెట్టుకునే క్రమంలో రూ.20 లక్షల వరకూ ఖర్చు చేశాక.. భవన యజమానిపై ఒత్తిడి తీసుకొచ్చి అదీ కూడా ఇవ్వనీయకుండా చేశారు. పట్టాభిపురంలో చిన్న హోటల్‌ పెట్టుకుంటే.. దానికీ ట్రేడ్‌ లైసెన్సు ఇవ్వకుండా హింసించారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌ విడిచిపెట్టేసి హైదరాబాద్‌కు వెళ్లిపోవాల్సిన పరిస్థితి కల్పించారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపినందుకు ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. కొత్త ప్రభుత్వం నాకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది. నా నుంచి బలవంతంగా లాగేసుకున్న శంకర్‌ విలాస్‌ హోటల్‌ను నాకు తిరిగి ఇప్పించాలి. నా మనవరాళ్ల చదువుల ఫీజులు చెల్లించేందుకూ ఇబ్బందులు పడుతున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారంటే నాకు ఎంతో ధైర్యం వచ్చింది. 


పోస్టు ఫార్వర్డ్‌ చేసినందుకు అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు
కొల్లు అంకబాబు, సీనియర్‌ పాత్రికేయుడు, విజయవాడ 

గన్నవరం విమానాశ్రయంలో స్మగ్లింగ్‌కు సంబంధించి వాట్సప్‌ గ్రూపులో వచ్చిన పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు 74 ఏళ్ల వృద్ధుడినైనా నాపై అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. లుంగీ మార్చుకుని వస్తానని చెప్పినా వినిపించుకోలేదు. రాత్రంతా సీఐడీ కార్యాలయంలో నిర్బంధించి వేధించారు. చివరికి కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రిమాండును తిరస్కరించి సీఐడీ తీరును ఆక్షేపించారు. హైకోర్టు నాపై కేసును కొట్టేసింది. వైకాపా హయాంలో ప్రశ్నించే గొంతుకల్ని ఎంతలా హింసించారనేందుకు నేనే ఉదాహరణ. ఆ దుర్మార్గపు చర్యలే జగన్‌ ప్రభుత్వ పతనానికి కారణమయ్యాయి. కొత్త ప్రభుత్వం పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతుందని నమ్ముతున్నా. 


పెళ్లి పీటలు ఎక్కాల్సినవాణ్ని ఆత్మహత్య చేసుకునేలా వేధించారు..
శ్రీనివాసులు, ఆదెమ్మ, ఓం ప్రతాప్‌ తల్లిదండ్రులు, బండకాడ ఎస్సీ కాలనీ, చిత్తూరు జిల్లా  

మరో పది రోజుల్లో పెళ్లి కావాల్సిన మా కుమారుడు ఓం ప్రతాప్‌ను ఆత్మహత్య చేసుకునేలా వైకాపా నాయకులు వేధించారు. జగన్‌ ప్రభుత్వంలో జే బ్రాండ్ల అమ్మకం, మద్యం ధరల పెంపుపై మా కుమారుడు ఓ వీడియోలో మాట్లాడాడు. అది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావటంతో వైకాపా నాయకులు అతన్ని తీవ్రంగా బెదిరించారు. వేధించారు. అవి తాళలేక అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. వైకాపా నాయకుల బెదిరింపులకు సంబంధించిన ఆడియో రికార్డులన్నీ నా కుమారుడి ఫోన్లో ఉన్నాయి. ఆ ఫోన్‌ అప్పటి సీఐ తీసుకెళ్లిపోయారు. మా అబ్బాయి మృతికి కారణమైన వైకాపా నేతల్ని చట్టపరంగా శిక్షించాలి. మా చిన్నబ్బాయికి ఏదైనా ఉద్యోగమివ్వాలి. కొత్త ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. 


నడిరోడ్డుపై నరికేశారు
వీరాంజనేయులు, తోట చంద్రయ్య కుమారుడు, గుండ్లపాడు గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లా  

తెదేపాలో క్రియాశీలకంగా పనిచేస్తున్నందుకు కక్ష కట్టి మరీ మా నాన్న తోట చంద్రయ్యను వైకాపా నాయకులు శివరామయ్య, చింతా ఆదినారాయణ, శ్రీను, తోట ఆంజనేయులు, రఘురామయ్య, తోట శివనారాయణ, చింత యలమంద కోటయ్య, కోటేశ్వరరావు గ్రామం నడిబొడ్డున పట్టపగలే కత్తులతో నరికి చంపేశారు. మాచర్ల తెదేపా ఇన్‌ఛార్జ్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని ప్రకటించాక ఏర్పాటు చేసిన సభకు 500 మందిని మా నాన్న తీసుకెళ్లారు. దీంతో వైకాపా నాయకులు కక్ష కట్టి మాపై అనేక అక్రమ కేసుల్ని పెట్టారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఏకంగా ఆయనను చంపేశారు. అప్పట్లో తెదేపా అధినేత చంద్రబాబు వచ్చి.. మా నాన్న పాడె మోసి మా కుటుంబానికి అండగా నిలిచారు. హంతకులకు శిక్ష పడేలా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నా.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని