Polavaram: పోలవరం.. ‘రివర్స్‌’ గేర్‌

జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతో వెనక్కి వెళ్లిపోయింది. అంతకు ముందు ఐదేళ్లు జరిగిన అభివృద్ధి అంతా వైకాపా పాలన సాగిన గత ఐదేళ్లలో సర్వనాశనమైపోయిన పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించలేని దుస్థితి.

Published : 19 Jun 2024 06:07 IST

ఐదేళ్ల కిందటి స్థాయి కన్నా చాలాచాలా వెనక్కి..
జగన్‌ ప్రభుత్వ వల్లమాలిన నిర్లక్ష్యం ఫలితం
ఐదేళ్లలో 4.57% పురోగతి అంటూ నివేదిక
డయాఫ్రం వాల్, ఇతర ఉపయోగపడని కట్టడాల మాటేంటి?
వాటిని లెక్కల్లోంచి మినహాయిస్తే కొత్తగా సాధించకపోగా.. ధ్వంసం చేసిందే ఎక్కువ కదా?
జగన్‌.. ఈ పాపాలకు ఎవరు బాధ్యులు?
ఈనాడు - అమరావతి

జగన్‌ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఎంతో వెనక్కి వెళ్లిపోయింది. అంతకు ముందు ఐదేళ్లు జరిగిన అభివృద్ధి అంతా వైకాపా పాలన సాగిన గత ఐదేళ్లలో సర్వనాశనమైపోయిన పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించలేని దుస్థితి. ఒక్క అడుగూ ముందుకేయలేని పరిస్థితి. ప్రతి అంశంలోనూ అనిశ్చితి.. ప్రతి నిర్మాణమూ సవాల్‌ విసిరే స్థితి. ప్రాజెక్టు వాస్తవ ముఖచిత్రాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే 2019లో ఏ స్థాయిలో ఉందో.. అంతకన్నా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పట్టాలెక్కించాలంటే సవాళ్లన్నింటికీ సమాధానాలు అన్వేషించాలి. ప్రతి కట్టడం భవితవ్యం, దాని సామర్థ్యం తేల్చుకోవాలి. 2016లో డయాఫ్రం వాల్‌ నిర్మాణం ప్రారంభించినప్పటి స్థితి నుంచి మళ్లీ మొదలుపెట్టాలి. రూ.వేల కోట్ల సొమ్ము, ఏళ్ల కొద్దీ సమయం వృథా అయిపోయాయి. ఆ నిధులు మళ్లీ వెచ్చించాలి. మళ్లీ వీటిని సరిదిద్దడానికి ఎన్నేళ్లు పడుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. 2022 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఇప్పటికే రెండేళ్లుగా రూ.వేల కోట్ల ప్రయోజనం రాష్ట్రానికి దక్కి ఉండేది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రయోజనాలు రాష్ట్రానికి అందాలంటే ఇంకెన్నేళ్లు వేచి చూడాలో తెలియనంత దారుణ పరిస్థితిలోకి పోలవరాన్ని నెట్టేసిన ఘనత మాత్రం నిస్సందేహంగా జగన్‌ ప్రభుత్వానిదే!  

ఇది పురోగతా? అధోగతా?

అధికారుల లెక్కల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో సాధించిన పురోగతి కేవలం 4.5 శాతం. ఐదేళ్లలో ఒక ప్రాజెక్టులో సాధించాల్సిన పురోగతి కన్నా ఇది చాలా చాలా తక్కువ. 

  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 75.77% పురోగతి జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అందులో డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయినట్లు లెక్కిస్తున్నారు. డయాఫ్రం వాల్‌ 2019, 2020 వరదల్లో ధ్వంసమైందనీ అధికారులే చెబుతున్నారు. అదీ జగన్‌ ప్రభుత్వ హయాంలోనే. ఆ డయాఫ్రం వాల్‌ స్థానంలో మళ్లీ కొత్తగా నిర్మాణం చేపట్టాలని ఇప్పటికే జలవనరులశాఖ అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చవుతుందని, 457 రోజుల సమయం పడుతుందని లెక్కించారు. గతంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి ఖర్చు చేసిన మొత్తం కన్నా ఇది రెట్టింపు. డయాఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలన్నా రూ.447.96 కోట్లు వ్యయమవుతుంది. 288 రోజుల సమయం పడుతుంది. ఈ లెక్కన అధికారులు లెక్కిస్తున్న పురోగతి నుంచి ఆ డయాఫ్రం వాల్‌ను మినహాయించాలా? అక్కర్లేదా? అలా మినహాయిస్తే అడుగు ముందుకు పడిందా? వెనక్కి పడిందా?
  • దాదాపు రూ.500 కోట్లతో నిర్మించిన ఎగువ కాఫర్‌ డ్యాం, దిగువ కాఫర్‌ డ్యాంలు లీకేజీలతో సతమతమవుతున్నాయి. సీపేజీ అంచనాలకు మించి వస్తోంది. నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు జరగలేదు. కేంద్ర నిపుణులు ముందే హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టిందని కేంద్ర జల్‌శక్తిశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి ‘ఈనాడు’కు చెప్పారు. ఆ రెండు కట్టడాలూ మళ్లీ బాగు చేసుకోవాల్సిందే. అందుకు రూ.వందల కోట్లు ఖర్చవుతుంది. అవి అసలు ఎలా మరమ్మతు చేయాలో కూడా ఇంతవరకు తేల్చలేదు. అధికారులు లెక్కించిన 75.77 శాతం పురోగతి నుంచి ఈ కట్టడాలను మినహాయిస్తే ఈ ప్రాజెక్టు ముందుకెళ్లినట్లా? వెనక్కి మళ్లినట్లా?
  • 2020 వరదలకు ముందు ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రాంతం భేషుగ్గా ఉంది. ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌లను సకాలంలో జగన్‌ ప్రభుత్వం పూడ్చలేకపోయింది. దీంతో 2020 భారీ వరదలకు ఆ ప్రాంతం అంతా ఉద్ధృతమైన నీటి ప్రవాహంలో కోసుకుపోయింది. పెద్ద పెద్ద అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన డ్యాం గ్యాప్‌ 1 ప్రాంతంలో 35 మీటర్ల లోతున, గ్యాప్‌ 2 వద్ద 26 మీటర్ల లోతున ఇసుక కొట్టుకుపోయింది. ప్రధాన డ్యాం ఛానల్‌ 90 మీటర్ల నుంచి 390 మీటర్ల వరకు అంటే దాదాపు 300 మీటర్ల మేర, మరోచోట 42 మీటర్ల మేర ఇసుక కోతకు గురయింది. దాంతో భారీ అగాథాలు ఏర్పడ్డాయి. కాఫర్‌ డ్యాం వద్ద 280 మీటర్ల మేర 36.50 మీటర్ల లోతున అగాథాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఇసుక నింపేందుకు ఇప్పటికే రూ.2,200 కోట్లు ఖర్చు చేశారు. ఇంకెంత ఖర్చు చేయాలో కూడా తెలియదు. మరి ప్రాజెక్టు ముందుకు వెళ్లిందా? వెనక్కి వెళ్లిందా?
  • స్పిల్‌వే రక్షణకు దాదాపు రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్‌బండ్‌ ధ్వంసమయింది. మొత్తం పురోగతి నుంచి దీన్ని కూడా మినహాయించాలి కదా!
  • ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ప్రాజెక్టు పురోగతి 75.77 శాతం వద్ద ఉంటుందా? 50 శాతానికి పడిపోతుందా? అదే జరిగితే 72 శాతం పూర్తి చేసిన చంద్రబాబు హయాం కన్నా వైకాపా పాలన ఐదేళ్లలో ప్రాజెక్టు వెనక్కి వెళ్లినట్లా కాదా? అభివృద్ధి చేయకపోగా మరింత విధ్వంసం చేయడమంటే ఇది కాదా?

ఐదేళ్ల జగన్‌ పాలనలో పోలవరంలో జరిగిన వైఫల్యాలివీ..

  • వస్తూనే రివర్స్‌ టెండర్లు అంటూ గుత్తేదారును మార్చివేశారు. గుత్తేదారును ఇలా మధ్యలో మార్చేస్తే ప్రాజెక్టు అనిశ్చితిలో పడుతుందని కేంద్ర జల్‌శక్తి శాఖ హెచ్చరించినా జగన్‌ ప్రభుత్వం వినలేదు. చివరకు కేంద్రం హెచ్చరించినట్లే అనిశ్చితిలోకి వెళ్లింది.
  • 2019 జూన్‌లో జగన్‌ వచ్చిన వెంటనే గుత్తేదారును పంపేశారు. అధికారులను మార్చేశారు. వరదల నుంచి రక్షణకు ఏం చర్యలు తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్దేశించిందో ఆ పనులేవీ చేయలేదు. బాధ్యత తీసుకునే గుత్తేదారు.. పట్టించుకునే అధికారులూ లేక అంతా అస్తవ్యస్తంగా తయారయింది. 
  • 2019 నవంబరులో కొత్త గుత్తేదారుకు పనులు అప్పగిస్తే ఏడాదిపాటు కనీస పనులు కూడా చేయలేదు. కేంద్ర జల్‌శక్తి శాఖకు రాష్ట్ర అధికారులు అప్పట్లో సమర్పించిన పురోగతి లెక్కలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. 
  • 2019 వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని జగన్‌ ప్రభుత్వం వాదన. 2020 వరదలకే డయాఫ్రం వాల్‌ విధ్వంసమయిందనేది అధికారుల మాట. ఏడాదిన్నర కాలంలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించి, గ్యాప్‌లు పూడ్చి ఉంటే డయాఫ్రం వాల్‌ ధ్వంసమయ్యేది కాదని హైదరాబాద్‌ ఐఐటీ నిపుణులు కేంద్రానికి ఇచ్చిన నివేదిక తేల్చింది. 
  • 2019లోనే డయాఫ్రం వాల్‌ ధ్వంసమైతే ఇంతవరకు దాన్ని ఏం చేయాలో ఎందుకు తేల్చలేదు? 2021 వరకు ఈ అంశంపై ఎందుకు దృష్టి సారించలేదు? జగన్‌ ప్రభుత్వం దీనిపై 2024 వరకు కనీసం నిర్ణయం కూడా ఎందుకు తీసుకోలేకపోయింది? ఒక ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంతకాలం అవసరమా? 
  • ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల సీపేజీలు, గైడ్‌బండ్, డయాఫ్రం వాల్‌...ఒక్క విషయంలోనూ ఎందుకు నిర్ణయాలు తీసుకోలేదు? పరిష్కారాలు ఎందుకు వెతకలేదు? ఎందుకు అలాగే పెండింగ్‌లో పెట్టేశారు? అన్నింటి కన్నా ఇది అతిపెద్ద వైఫల్యం కాదా?

జలవనరులశాఖ అధికారులు 2019 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌మోహన్‌రెడ్డికి పోలవరంపై నివేదించారు. తాజాగా సోమవారం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని