Vizag: విశాఖ భూములు, ప్రాజెక్టులపై వైకాపా గద్దలు

ఐదేళ్ల పాలనలో వైకాపా నాయకులు విశాఖను పీల్చిపిప్పి చేశారు. రూ.కోట్ల విలువైన భూముల్ని, ప్రాజెక్టుల్ని కొట్టేశారు. పేదల ఎసైన్డ్‌ భూములూ కాజేశారు.

Updated : 11 Jul 2024 08:56 IST

ఐదేళ్లలో రూ.వేల కోట్ల విలువైన భూముల స్వాహా
పేదల ఎసైన్డ్‌ భూముల్నీ వదలని అక్రమార్కులు

ఈనాడు, విశాఖపట్నం: ఐదేళ్ల పాలనలో వైకాపా నాయకులు విశాఖను పీల్చిపిప్పి చేశారు. రూ.కోట్ల విలువైన భూముల్ని, ప్రాజెక్టుల్ని కొట్టేశారు. పేదల ఎసైన్డ్‌ భూములూ కాజేశారు. దసపల్లా, రామానాయుడు స్టూడియోస్, ఎన్‌సీసీ, హయగ్రీవ, సీబీసీఎన్‌సీ, బేపార్క్, రాడిసన్‌ బ్లూ... ఇలా నగరంలోని అత్యంత విలువైన భూములు, ప్రాజెక్టుల్ని కుదిరితే పూర్తిగా మింగేశారు. కొన్నింట్లో అధిక వాటాలు వైకాపా నాయకులు, వారి అస్మదీయుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ప్రతి ప్రాజెక్టులోనూ ‘మిస్టర్‌ ట్వంటీ పర్సెంట్‌’గా పేరుపొందిన పార్టీ ‘ముఖ్య నేత’కు వాటా ముట్టజెప్పేలా దందాలు సాగినట్టు ఆరోపణలున్నాయి. అక్రమ లేఅవుట్లు వేయడం, కొండలు, గుట్టల్ని మింగేయడం, మట్టి మాఫియా వంటి అరాచకాలకు లెక్కేలేదు..! గురువారం విశాఖలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైకాపా భూ అక్రమాలపై సమీక్షించే అవకాశం ఉంది. విశాఖలో భూ దందాలపై గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో వేసిన సిట్‌ విచారణలో బాధ్యులుగా తేలినవారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన భూ అక్రమాలపై సిట్‌ నివేదికలో పేర్కొన్నా... చర్యలు చేపట్టలేదు. పలువురు ఐఏఎస్‌ అధికారులూ అక్రమాలకు పాల్పడ్డట్టు తేలినా చర్యల్లేవు. వైకాపా వేసిన సిట్‌ నివేదికలో ఏముందో బయటకే రానివ్వలేదు. ఈ ప్రభుత్వం సమర్థులైన అధికారులతో సిట్‌ వేసి, దోషులుగా తేలినవారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

విలువైన వాటిని నొక్కేశారు

 • వైకాపా అధికారంలోకి వచ్చాక కొన్నేళ్లపాటు ఉత్తరాంధ్రకు పార్టీ ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన వైకాపా ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమ భూదందాలు యథేచ్ఛగా సాగాయి. ఆయన కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిని ఆనుకుని 87,714 చదరపు గజాల స్థలాలు కొనుగోలు చేసింది. కొందర్ని భయపెట్టి, బెదిరించి తక్కువ ధరకు ఆ భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయి. ఆ నేతకు బినామీగా ఉన్న వస్త్రవ్యాపారి పేరుమీద భోగాపురం చుట్టుపక్కల భారీగా భూములు కొన్నట్టు ఆరోపణలున్నాయి. 
 • మధురవాడలోని ఒక గృహనిర్మాణ ప్రాజెక్టులో ఒక విలువైన విల్లా స్థలాన్ని ఆ నేత కుమార్తెకు నజరానాగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ 5,067 చదరపు గజాల్లో వాణిజ్య భవన నిర్మాణపనులు తుదిదశకు చేరుకున్నాయి.  
 • విశాఖ నడిబొడ్డున రూ.2వేల కోట్ల విలువైన దసపల్లా భూములు వైకాపా నాయకుల పరమయ్యాయి. ఆ భూమిలోంచి వెళుతున్న 40 అడుగుల రహదారిని వంద అడుగులుగా విస్తరించి, రూ.120 కోట్ల టీడీఆర్‌ బాండ్లు కొట్టేయాలని చూశారు.

మాజీ ఎంపీ భూ దందా

 • వృద్ధులకు సేవ పేరుతో వైఎస్‌ హయాంలో హయగ్రీవ సంస్థ ఎండాడలో తీసుకున్న 12.51 ఎకరాల భూముల్ని... విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన మిత్రుడు, ఆడిటర్‌ జీవీ కలిసి కొట్టేశారు. వారిద్దరూ ఎంఓయూ పేరుతో ఖాళీ పత్రాలపై సంతకాలు చేయించారని హయగ్రీవ సంస్థ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు తాజాగా పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ భూముల విలువ రూ.500 కోట్లకుపైనే.
 • వివాదంలో ఉన్న సీబీసీఎన్‌సీ స్థలంలో ఎంవీవీ భారీ గృహనిర్మాణ ప్రాజెక్టు చేపట్టారు. న్యాయస్థానంలో వివాదం ఉండగానే నిర్మాణాలు కొనసాగించి, రోడ్డు విస్తరణలో స్థలం పోతుందంటూ రూ.63 కోట్లకు టీడీఆర్‌ బాండ్లు దక్కించుకున్నారు. వాస్తు పేరుతో టైకూన్‌ కూడలిని మూసేశారు. ఈ వ్యవహారాలకు అప్పటి జీవీఎంసీ కమిషనర్‌ పూర్తిగా సహకరించినట్టు ఆరోపణలున్నాయి.
 • ఎంవీవీ అండ్‌ ఎంకే హౌసింగ్‌ సంస్థ కూర్మన్నపాలెంలో 10.57 ఎకరాల్లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. భూయజమానులకు కామన్‌ ఏరియాతో కలిపి కేవలం 14,400 చదరపు అడుగుల ఫ్లాట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. రూ.500 కోట్ల ప్రాజెక్టులో యజమానులకు ఇచ్చిన వాటా 0.96% మాత్రమే.

పేదలను బెదిరించి మింగేశారు

కేటాయింపు జరిగి 20 ఏళ్లు దాటిన ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు జీఓ వస్తుందని తెలిసి... వైకాపా ముఖ్యనేతలు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు విశాఖలో భూ అక్రమాలకు తెరతీశారు. పేదల్ని వంచించి, బెదిరించి... కారుచౌకగా వారి ఎసైన్డ్‌ భూములు కొట్టేశారు. ఇలా వందల ఎకరాలు గుప్పిట్లోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లా పరిధిలోని భోగాపురంతో పాటు, విశాఖలోని పద్మనాభం, భీమునిపట్నం, ఆనందపురం మండలాల్లో భారీగా ఎసైన్డ్‌ భూములకు అగ్రిమెంట్లు జరిగాయి. ఎకరా రూ.5-10కోట్లు పలికే భూములను కేవలం రూ.40లక్షలు ఇచ్చి ఒప్పందపత్రాలు రాసుకున్నారు. గత ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేసిన ఉన్నతాధికారి... బినామీల పేరుతో ఎసైన్డ్‌ భూములు కొన్నట్టు ఆరోపణలు వచ్చాయి.


భారీ ప్రాజెక్టులపై వాలిపోయారు

 • రుషికొండలోని రూ.1000 కోట్ల విలువైన రేడియంట్‌ సంస్థ స్థలాన్ని వైకాపా ‘ముఖ్యనేత’కు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి కొట్టేశారు. ఆ ప్రాజెక్టులో ‘ముఖ్యనేతకు’ బీచ్‌ ఫ్రంట్‌లో పదెకరాలు సమర్పించినట్టు సమాచారం. రేడియంట్‌ సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.40 కోట్ల స్టాంప్‌డ్యూటీకి, వీఎల్టీకి మినహాయింపు ఇచ్చేశారు.
 • మధురవాడలో ఎన్‌సీసీకి చెందిన రూ.1,500 కోట్ల విలువైన భూముల్ని ఓ మాజీమంత్రి సోదరుడి సంస్థకు కట్టబెట్టేశారు. ఎన్‌సీసీని బయటకు పంపేశారు. మాజీమంత్రి సోదరుడు వైకాపా ముఖ్యనేతలకు బినామీ అని, ఆ భూములన్నీ వారి పరమయ్యాయని ఆరోపణలున్నాయి.
 • రామానాయుడు స్టూడియో భూముల్ని రెసిడెన్షియల్‌ కేటగిరీలోకి మార్చేశారు. దానికి ప్రతిఫలంగా అందులో కొంత వైకాపా ముఖ్యనేతలు కొట్టేశారు. 
 • విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో రుషికొండ వద్ద ఉన్న బేపార్క్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ని వైకాపా పెద్దల అస్మదీయ కంపెనీకి కట్టబెట్టేశారు. ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకుని, ఆ భూమిని లీజుకు తీసుకుని ప్రాజెక్టు చేపట్టిన వ్యక్తిని బయటకు పంపేసి ప్రాజెక్టు స్వాధీనం చేసుకున్నారు. 
 • కార్తికవనం ప్రాజెక్టు కూడా వైకాపా పెద్దల అస్మదీయ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడక్కడ రాడిసన్‌ బ్లూ పేరుతో ఐదు నక్షత్రాల హోటల్‌ నడుస్తోంది. 
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నర్సింగ్‌ శిక్షణ, పేదలకు వైద్యం అందించేందుకు ఆస్పత్రి నిర్మిస్తారన్న పేరుతో రుషికొండలో ‘సెయింట్‌ లూక్స్‌ మైనారిటీ ఎడ్యుకేషనల్‌ సొసైటీ’ అనే సంస్థకు అప్పటి వైఎస్‌ ప్రభుత్వం 7.35 ఎకరాలను కేటాయించింది. ఇప్పటివరకు ఆసుపత్రి నిర్మించలేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని