Land grabbing: ‘భూ’చోళ్ల పని పట్టాలి

వైకాపా పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కడప జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు.

Updated : 24 Jun 2024 07:00 IST

వైకాపా ముఠాల భూదాహానికి బలైపోయిన పేదలు
రికార్డులు మార్చి, తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమణలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సర్వే చేసి భూములు స్వాధీనం చేసుకోవాలి
సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
ఈనాడు - అమరావతి 

వైకాపా పాలనలో మద్యం, ఇసుక కుంభకోణాలతో సమాంతరంగా ఆ పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూమి, ప్రైవేట్‌ భూమి అన్న తేడా లేకుండా ఆక్రమించేశారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కడప జిల్లాల్లో వేల కోట్ల విలువైన భూములు కొట్టేశారు. రికార్డుల్లో వివరాలు మార్చడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించారు. కొన్నిచోట్ల వీరికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకరించారు. మా భూములు లాక్కుంటున్నారు.. న్యాయం చేయండంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా బాధితులను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి భూములు వదులుకోవాలంటూ వైకాపా ముఠాల బెదిరింపులకు భయపడి కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ దందాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఎన్డీయే ప్రభుత్వం ముందున్న సవాళ్లలో ప్రధానమైంది. ఇందుకోసం ప్రత్యేక సర్వే చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

విశాఖలోనూ దందా..

విశాఖ నగరం, చుట్టుపక్కల కలిపి 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, మధురవాడలో చెరువులు, వాగులను ఆక్రమించారు. రాణి వాద్వాన్‌కు చెందిన దసపల్లా భూములు, సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ, సెయింట్‌లూక్స్‌ భూములు వైకాపా నేతల గుప్పెట్లోకి వెళ్లాయి. అంతటితో ఆగకుండా తమకు కావాల్సిన వారికి విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికి రూ.200 కోట్ల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు. పేద రైతులకు చెందిన 2 వేల ఎకరాల ఎసైన్డ్‌ భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి. 

అమర్‌నాథ్‌ అండదండలతో..

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌ అనుచరులు 600 ఎకరాల్లో భారీ లేఅవుట్ వేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములకు తోడు ప్రభుత్వ భూములు, కొండ గెడ్డలు, వాగులను అందులో కలిపేశారు. లేఅవుట్లోకి వెళ్లడానికి రోడ్డు కోసం రూ.5 కోట్ల విలువైన 10 ఎకరాల భూమి ఆక్రమించారు. ఈ వ్యవహారంపై అప్పటి ఆర్డీఓ సీతారాం విచారణ జరిపినా చర్యలు మాత్రం లేవు. 

  • శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంటలో జలవనరులశాఖకు చెందిన 208 ఎకరాలు కబ్జాకు గురైనట్లు విజిలెన్స్‌ నివేదికల్లో పేర్కొన్నా చర్యలు తీసుకోలేదు.
  • నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలో జలవనరులశాఖకు చెందిన కాలువలను ఆక్రమించి భారీ లేఅవుట్‌ వేశారు. 
  • ఎక్కడైనా వివాదాలు లేని ఖరీదైన భూములు కనిపిస్తే వాటికి నకిలీ పత్రాలు సృష్టించారు. అనుచరులను పంపి యజమానులను బెదిరించారు. వినకపోతే యజమానులకు తెలియకుండానే రెవెన్యూ రికార్డులు, ఆన్‌లైన్‌లో పేర్లు మార్చేశారు. తరతరాలుగా వస్తున్న ఆస్తులను కాపాడుకోవడానికి బాధితులు ఎంతగానో పోరాడారు. చివరికి వారు ఆత్మహత్యలు చేసుకునేలా వైకాపా నేతలే ప్రేరేపించారు. 
  • వైఎస్సార్‌ జిల్లా ఒంటిమిట్ట మండలంలో వైకాపా నేతలు భూ రికార్డులు తారుమారు చేశారని చేనేత కార్మికుడు సుబ్బారావు రైలు కిందపడి ఆత్మహత్యకు 
  • పాల్పడగా, ఆయన భార్య, కుమార్తె ఇంట్లో ప్రాణాలు విడిచారు.
  • మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేటలో తన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఓ రైతు.. రెవెన్యూ సిబ్బందికి మామూళ్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. 
  • కాళ్లరిగేలా తిరిగినప్పటికీ రెవెన్యూ సిబ్బంది తన 8 ఎకరాల పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వైఎస్సార్‌ జిల్లా ఖాజీపేట మండలం తుడుములదిన్నెలో రైతు సుబ్బారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. 
  • వైకాపా నేతల మద్దతుదారుల ఆగడాలకు 2022 సెప్టెంబరులో ఓ వృద్ధుడు గుండెపోటుతో మరణించారు. భూ సమస్య పరిష్కారం కోసం చిత్తూరు జిల్లా పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి వెళ్లి అధికారులతో మాట్లాడుతున్నప్పుడే ప్రాణాలు విడిచారు. 
  • స్థానిక ప్రజాప్రతినిధి ఇప్పించిన ఇంటి స్థలాన్ని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ పోలీసు ఆక్రమించాడని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన దళిత యువకుడు ఉయ్యాల శివకృష్ణ నరసరావుపేట కలెక్టరేట్‌ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం

ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల పరిధిలోని వేల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. బద్వేలులో సుమారు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అంచనా. కడప నగరంలో జిల్లా పరిషత్తుకు చెందిన రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్పొరేటర్‌ భర్త ఆక్రమించి హోటల్‌ ఏర్పాటు చేశారు. మామిళ్లపల్లెలో తెలుగుగంగ కార్యాలయానికి చెందిన 22 ఎకరాల భూమి ఆక్రమణలపాలైంది. సిద్దవటం మండలం భాకరాపేట శివారులోని కడప-చెన్నై జాతీయ రహదారి పక్కన ఎస్సీ లబ్ధిదారులకు చెందిన ఆరు ఎకరాల డీకేటీ భూమిని వైకాపా నేతలు 2020లో ఆన్‌లైన్‌లో తమ పేరుపైకి మార్చుకున్నారు.


ఒంగోలులో నకిలీ పత్రాలు సృష్టించి..

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల అండదండలతో ఒంగోలులో జరిగిన భూ దందా రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. రూ.వందల కోట్ల విలువైన ప్రైవేట్‌ భూములకు నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ల పేరుతో కాజేశారు. బాధితుల ఆందోళనలతో అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో 20 మంది సీఐలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించగా.. కేవలం 70 మందినే అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని