YSRCP: బెదిరించి రాజీనామా చేయించారు.. వైకాపా నాయకులపై మాజీ వాలంటీర్ల ఫిర్యాదులు

వైకాపా ప్రభుత్వంలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే కాదు వాలంటీర్లూ బాధితులే. వాలంటీర్లంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకే పనిచేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సుద్దులు చెప్పినా.. ఎన్నికల ముందు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడం దగ్గర నుంచి కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగం చేయాలని వైకాపా పథకం వేసింది.

Updated : 20 Jun 2024 08:50 IST

నెల్లూరులో పలువురు నేతలపై కేసుల నమోదు

నెల్లూరు బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేస్తున్న మాజీ వాలంటీర్లు

ఈనాడు, నెల్లూరు: వైకాపా ప్రభుత్వంలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలే కాదు వాలంటీర్లూ బాధితులే. వాలంటీర్లంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుకే పనిచేస్తున్నారని అప్పటి ప్రభుత్వం సుద్దులు చెప్పినా.. ఎన్నికల ముందు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించడం దగ్గర నుంచి కులాలవారీగా ఓటర్ల వివరాలు సేకరించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగం చేయాలని వైకాపా పథకం వేసింది. ఎన్నికల సంఘం వాటికి అడ్డుకట్ట వేయడంతో.. వారందరితో రాజీనామా చేయించి ప్రచారం చేయించాలని భావించింది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు బెదిరించడంతో గత్యంతరం లేక చాలామంది రాజీనామాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో వారంతా బయటకు వచ్చి వైకాపా నాయకుల బెదిరింపులపై ప్రస్తుతం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

వైకాపా నేతలపై కేసులు

నెల్లూరు జిల్లాలో 13,609 మంది వాలంటీర్లు ఉండగా- సుమారు 200 మందిని ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించడంతో విధుల నుంచి తొలగించారు. మరో 4,539 మంది వరకు రాజీనామాలు చేశారు. వారిలో కొందరు తమను వైకాపా నాయకులు బెదిరించి రాజీనామా చేయించారంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. 41వ డివిజన్‌ వైకాపా కార్పొరేటర్‌ కె.విజయలక్ష్మితో పాటు మరికొందరు నాయకులపై ఈ నెల 15న చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆదివారం 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మొయిళ్ల గౌరి, నాయకులు సురేష్‌రెడ్డిలపై వేదాయపాళెం పోలీసులకు, మంగళవారం 37వ డివిజన్‌ కార్పొరేటర్‌ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులపైనా ఫిర్యాదు చేశారు. తాజాగా బుధవారం నెల్లూరు బాలాజీనగర్, దర్గామిట్ట పోలీసు స్టేషన్లలో పలువురు వాలంటీర్లు వైకాపా కార్పొరేటర్లు ఫామిదా, వాసంతి తదితరులపై పోలీసులకు విన్నవించారు. న్యాయసలహా తీసుకున్న చిన్నబజారు పోలీసులు కోర్టు ఆదేశాలతో కార్పొరేటర్‌ విజయలక్ష్మి, వైకాపా నాయకులు మధుసూదన్‌రావు, బాబ్జీలపై కేసు నమోదు చేశారు. 


‘ఎన్నికల సమయంలో వైకాపా కోసం ప్రచారం చేయాలంటూ కొందరు కార్పొరేటర్లు, నాయకులు మాపై ఒత్తిడి తెచ్చారు. వారిని ఎదుర్కొనే శక్తి లేక, భయంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. మాతో బలవంతంగా రాజీనామాలు చేయించినవారిపై చర్యలు తీసుకోండి’

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వారం రోజులుగా పోలీసు స్టేషన్లలో మాజీ వాలంటీర్లు చేస్తున్న ఫిర్యాదుల సారాంశమిది..


విధుల్లోకి తీసుకోవాలి

ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న రాజీనామా చేసిన వాలంటీర్లు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు వైకాపా నాయకులు తమచేత బలవంతంగా రాజీనామా చేయించారని పలువురు మాజీ వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బుధవారం వారు నిరసన చేపట్టారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ శివ్‌నారాయణ శర్మకు వారు వినతి పత్రం అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని