ysrcp: అక్రమాల భవనం నేలమట్టం

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ, అన్ని చట్టాలనూ కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు.

Updated : 23 Jun 2024 06:48 IST

వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత
ఆ నిర్మాణానికి ఏ అనుమతులూ లేవు
నోటీసులిచ్చినా స్పందించని వైకాపా
చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు
మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌ అధికారుల చర్యలు

ఈనాడు - అమరావతి

తాడేపల్లిలో వైకాపా కార్యాలయాన్ని కూలుస్తున్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌ సిబ్బంది

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ, అన్ని చట్టాలనూ కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని... ఏ అధీకృత సంస్థ అనుమతులూ తీసుకోకుండా నిర్మాణం ప్రారంభించి ఒక అంతస్తు కట్టేశారు. ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదు. అధికారంలో ఆ పార్టీయే ఉండటంతో యంత్రాంగమంతా అచేతనంగా ఉండిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది. జలవనరుల శాఖకు చెందిన బోట్‌యార్డు స్థలంలో కృష్ణా బకింగ్‌హాం కాలువను ఆనుకుని దీన్ని నిర్మిస్తున్నారు. స్థల యజమాని అయిన జలవనరులశాఖ నుంచీ అనుమతులు తీసుకోలేదు. ఆ స్థలం తీసుకునేందుకు ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు. పైగా అమరావతి బృహత్‌ ప్రణాళికకు విరుద్ధంగా వైకాపా ఈ భవనాన్ని నిర్మిస్తోంది. తాజాగా దీనిపై మే నెలలో ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నిబంధనల ప్రకారం నోటీసులిచ్చింది. వాటికి వైకాపా నాయకులు ఎవరూ సమాధానాలు ఇవ్వలేదు. చివరకు హైకోర్టు సైతం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పచ్చజెండా ఊపింది. దీంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు శనివారం ఉదయమే రంగంలోకి దిగారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి పొక్లెయిన్లతో ఈ అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఏ అనుమతులూ లేకపోయినా, ఎన్నికలు జరుగుతున్నా వైకాపా యుద్ధప్రాతిపదికన భవన నిర్మాణం చేసింది. ఇప్పటికే మొదటి అంతస్తు పూర్తిచేసి రెండో అంతస్తుకు పిల్లర్లు నిర్మించింది. ఈ భవనాన్ని పునాదులతో సహా పెకిలించేశారు. సెక్షన్‌ 115 కింద అక్రమ నిర్మాణాలను కూల్చివేసే అధికారం తమకు ఉందని ఉత్తర్వుల్లో సీఆర్‌డీఏ పేర్కొంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ నాడు ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రికి ఒక రూల్‌.. సామాన్యుడికి మరో రూల్‌ ఉంటే ఎలాగని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారులు సైతం అవే నిబంధనలు ప్రస్తావిస్తూ ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు.

అడుగడుగునా ఉల్లంఘనలే..

1. ఈ స్థలాన్ని వైకాపా కేంద్ర కార్యాలయానికి కేటాయించేందుకు జలవనరులశాఖ అనుమతులేవీ ఇవ్వలేదు.

2. అయినా నాటి మంత్రిమండలి స్థలాన్ని వైకాపా కేంద్ర కార్యాలయ భవనానికి కేటాయిస్తూ తీర్మానం చేసింది. జలవనరుల శాఖతో లీజు ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు విధించింది. లీజు ఒప్పందం లేకుండానే నిర్మాణం ప్రారంభించేశారు. ఇది పెద్ద ఉల్లంఘన.

3. ఒక భవనం నిర్మించాలంటే సంబంధిత సంస్థ నుంచి అనుమతులు తీసుకోవాలి. సీఆర్‌డీఏ నుంచి ఈ భవన నిర్మాణానికి అనుమతులు పొందలేదు.

4. భవన నిర్మాణానికి అవసరమైన ప్లాన్‌ సమర్పించాలి. ఆ ప్లాన్‌ ఆమోదం పొందాలి. ఆమోదం పొందిన మేరకు ఎలాంటి ఉల్లంఘనలూ లేకుండా నిర్మాణాలు జరపాలి. అసలు ప్లాన్‌ అనుమతులు తీసుకోకుండానే మొదటి అంతస్తు నిర్మించేశారు. రెండో అంతస్తు కోసం పిల్లర్లు నిర్మించారు. రాంకీ సంస్థ ఈ భవన నిర్మాణ పనులు చేపట్టింది.

జలవనరులశాఖ కాదు.. కూడదన్నా...

జలవనరుల శాఖకు చెందిన బోట్‌యార్డు 17.03 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. బకింగ్‌హామ్‌ కెనాల్‌ పక్కనే ఈ స్థలం ఉంటుంది. సీతానగరంలోని సర్వేనంబరు 202-ఏ1లో ఉన్న ఈ స్థలంలో వైకాపా కార్యాలయ భవనం కోసం రెండెకరాలు కేటాయించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 2023 జనవరి 5న ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తెనాలి సబ్‌కలెక్టర్‌ ఈ స్థలం కోసం జలవనరులశాఖ అనుమతి అవసరమని 2023 ఫిబ్రవరి 1న తెలిపారు.

  • జలవనరులశాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి 2023 ఫిబ్రవరి 2న ప్రభుత్వానికి లేఖ రాస్తూ ఈ స్థలం వైకాపా కార్యాలయానికి కేటాయించడం సాధ్యం కాదని తేల్చిచెప్పేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు ఇది విరుద్ధమన్నారు. మొత్తం 19 ఎకరాల బోట్‌యార్డు స్థలంలో 9 ఎకరాల్లో కాలువ ప్రవహిస్తోందని, మరో 5 ఎకరాలు అమరావతి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కోసం రెవెన్యూశాఖ కోరిందని, మరో మూడు ఎకరాలే ఉందని, అది కూడా తీరప్రాంతమని సుస్పష్టంగా పేర్కొన్నారు. జలవనరులశాఖ అధికారుల శిక్షణ కేంద్రం నిర్మించుకోవాల్సి ఉందని కూడా వివరించారు.
  • జలవనరులశాఖ అనుమతి ఇవ్వకపోయినా రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ప్రతిపాదన పెట్టి, ఆమోదం తీసుకున్నారు. 2023 ఫిబ్రవరి 23న ప్రభుత్వం స్థలాన్ని వైకాపా భవన నిర్మాణానికి కేటాయిస్తూ జీఓ ఇచ్చేసింది.

ఎలాంటి అనుమతులూ లేవు

జలవనరులశాఖ అనుమతులు లేకపోయినా ఆ స్థలాన్ని వైకాపా వారికి అప్పగించాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. రూ.కోట్ల విలువైన భూమిని ఏడాదికి కేవలం రూ.1000 చొప్పున 33 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ భూమి కేటాయించింది. ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా గుంటూరు జిల్లా యంత్రాంగం భూమిని వైకాపాకు అప్పగించింది. జలవనరులశాఖ అనుమతి లేనందున భూమి తీసుకున్న వైకాపా లీజు ఒప్పందం కుదుర్చుకోకుండానే పనులు ప్రారంభించింది. సీఆర్‌డీఏ నుంచి అనుమతి, ఎంటీఎంసీ నుంచి ప్లాన్‌ ఆమోదం లేకుండా నిర్మాణాలు చేపట్టింది. లీజు ఒప్పందమే జరగనందున మిగిలిన అనుమతులు తీసుకునే పరిస్థితులూ లేవు. వైకాపాకు భూమిని కేటాయించిన ఉత్తర్వులను కూడా గోప్యంగా ఉంచారు.

చట్టపరంగా అడుగులు ముందుకు

ఈ అక్రమ నిర్మాణంపై గుంటూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సీఆర్‌డీఏ, ఎంటీఎంసీ (మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్‌) కమిషనర్లకు ఫిర్యాదుచేశారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులు 2024 మే 20న వైకాపాకు ఈ అక్రమ నిర్మాణంపై నోటీసులు ఇచ్చారు. జలవనరులశాఖ అనుమతులు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసుకు వైకాపా ప్రతిస్పందించలేదు. దీంతో జూన్‌ 1న మరో నోటీసు ఇచ్చారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు రాకముందే ఇదంతా జరిగింది. అప్పటికీ వైకాపా ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. దీంతో ఇది అక్రమ నిర్మాణం అయినందున కూల్చేస్తామని భవనం నిర్మిస్తున్న రాంకీ ఇన్‌ఫ్రా సంస్థతో పాటు వైకాపాకు మళ్లీ నోటీసులు ఇచ్చారు. జూన్‌ 20 వరకు వైకాపా స్పందించలేదు. జూన్‌ 21న వైకాపా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అప్పటికే పలుసార్లు నోటీసులు ఇచ్చినా వైకాపా నుంచి సమాధానం లేకపోవడంతో శనివారం ఉదయం అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు.


అనుమతులు లేనందునే కూల్చేశాం

సీతానగరంలోని బోట్‌యార్డులో వైకాపా కార్యాలయ నిర్మాణానికి అనుమతులు లేవు. భవన నిర్మాణానికి కనీసం దరఖాస్తు చేసుకోలేదు. నెలన్నర నుంచి పనులు జరుగుతున్నాయి. ఇటీవల గుర్తించి అక్కడకు వెళ్లి పరిశీలించాం. వైకాపా కార్యాలయ ప్రతినిధులను వివరాలు అడిగినా వారెవరూ స్పందించలేదు. రాతపూర్వకంగా నోటీసులు పంపితే తీసుకోలేదు. అవే నోటీసులను నిర్మాణ ప్రాంతంలో గోడలకు అతికించాం. కృష్ణానది పరీవాహక ప్రదేశాలు, నీటివనరులు, చెరువుల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఆ నిర్మాణాలకు ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు ఇవ్వం. ఆ నిర్మాణం సీఆర్‌డీఏ పరిధిలో ఉంది. వారి ఆదేశాల మేరకు సంబంధిత అధికారులతో కలిసి శనివారం ఉదయం కూల్చేశాం.

అశోక్‌కుమార్, నగర ఉప ప్రణాళికాధికారి, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్‌


అక్రమ కట్టడం ఏదైనా కూల్చేయాలి

రూల్స్‌ అనేవి ఎవరికైనా ఒకటే. ముఖ్యమంత్రికైనా, సామాన్యుడికైనా అదే రూల్‌ ఉండాలి. ఒక సామాన్యుడు అక్రమంగా రేకులషెడ్డు వేసుకుంటే అధికారులు ఊరుకుంటారా? వెంటనే వెళ్లి తొలగిస్తారు. ఎందుకంటే అతను సామాన్యుడు కాబట్టి. సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి మరో న్యాయమా? నది పక్కనే నేరుగా ఇలా ఇల్లు కట్టుకుని నదీప్రవాహాన్ని అడ్డుకునే పనిచేస్తుంటే ఎలా? రాజకీయ చరిత్ర ఉన్నవారు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆ చరిత్ర చూసి ఇలాంటివాడు మా నాయకుడు అని ఘనంగా చెప్పే పరిస్థితిలో ఉండాలి. అధికారంలో ఉన్నవారే నిబంధనలు పాటించబోమంటే ఎలా? అందుకే మొట్టమొదటిగా అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చేయాలని ఉత్తర్వులు ఇచ్చాం. ఎక్కడ కలెక్టర్ల సమావేశం జరిగిందో, వ్యవస్థ అంతా పోయి ఎక్కడ కూర్చుందో ఆ అక్రమ భవనాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చాం.

ప్రజావేదిక కూల్చివేతపై నాడు ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో జగన్‌


అమరావతి బృహత్‌ ప్రణాళికకు విఘాతం కలిగించేలా...

వైకాపా కార్యాలయ అక్రమ నిర్మాణం రాజధాని అమరావతి బృహత్‌ ప్రణాళికకు విఘాతం కలిగించేలా ఉంది. సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం కోల్‌కతా-చెన్నై జాతీయరహదారి నుంచి రాజధానికి వెళ్లేందుకు సీడ్‌ యాక్సెస్‌ రహదారి నిర్మించాలి. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు ఇప్పటికే రోడ్డు నిర్మాణం పూర్తయింది. వెంకటపాలెం నుంచి జాతీయరహదారి అనుసంధానం చేయాల్సిన మార్గంలో ఈ అక్రమ భవనం నిర్మిస్తున్నారు. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి అధికారులు ఈ విషయాన్ని తమ నివేదికల్లోనూ తెలియజేశారు. 


కోర్టు ఆదేశాలతోనే కూల్చేస్తున్నాం: హోం మంత్రి అనిత

రేణిగుంట, న్యూస్‌టుడే: వైకాపా కార్యాలయాలను కోర్టు ఆదేశాలతో కూల్చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి ఆమె చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా కార్యాలయాలు అక్రమమా, సక్రమమా అని కాదని.. రికార్డుల్లో ఏమి ఉందో అదే చూస్తున్నట్లు తెలిపారు. అక్రమ కట్టడాలైతే చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందని, అలా చేయకుంటే కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు మహిళలే కూటమిని గెలిపించారని చెప్పారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ ఉమ్మడి విజయంతో ప్రస్తుతం రాష్ట్రం ఊపిరి పీల్చుకుందన్నారు. గత ముఖ్యమంత్రి, హోంమంత్రి గంజాయి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. పాఠశాల పిల్లలు సైతం గంజాయి బారిన పడ్డారని, దీని మూలాలను బయటకు తీసి పూర్తిగా అరికడతామని మంత్రి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని