YSRCP: వైకాపా హవా

రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, 4 పురపాలక సంఘాలు, 8 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. నెల్లూరుతో పాటు, 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత సాధించింది. నెల్లూరులో పోలింగ్‌కు ముందే 8 డివిజన్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న వైకాపా.. మొత్తం 54 డివిజన్లనూ తన ఖాతాలో వేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీనీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లాలోని దర్శిలో 20 వార్డులకు తెదేపా 13, వైకాపా ఏడు చోట్ల గెలుపొందాయి. కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఫలితాలు చివరివరకు ఉత్కంఠ రేపాయి.

Updated : 18 Nov 2021 05:12 IST

మున్సిపల్‌ ఎన్నికల్లో ఆధిక్యం

నెల్లూరు కార్పొరేషన్‌ ఏకపక్షం

కుప్పంలోనూ గెలుపు

దర్శిలో తెదేపా విజయం

రెబల్‌ చేరికతో కొండపల్లిలో ఆధిక్యం

ఈనాడు - అమరావతి

తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం ముందు డప్పు వాయిస్తున్న మంత్రులు
కన్నబాబు, వెలంపల్లి, వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు

రాష్ట్రంలో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు, 4 పురపాలక సంఘాలు, 8 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో వైకాపా హవా కొనసాగింది. నెల్లూరుతో పాటు, 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా స్పష్టమైన ఆధిక్యత సాధించింది. నెల్లూరులో పోలింగ్‌కు ముందే 8 డివిజన్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న వైకాపా.. మొత్తం 54 డివిజన్లనూ తన ఖాతాలో వేసుకుంది. తెదేపా అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీనీ గెలుచుకుంది. ప్రకాశం జిల్లాలోని దర్శిలో 20 వార్డులకు తెదేపా 13, వైకాపా ఏడు చోట్ల గెలుపొందాయి. కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో ఫలితాలు చివరివరకు ఉత్కంఠ రేపాయి. 29 వార్డులకు వైకాపా, తెదేపా చెరో 14 గెలుచుకున్నాయి. తెదేపా టిక్కెట్‌ దక్కక, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, గెలిచిన శ్రీలక్ష్మి.. ఫలితాలు వెలువడిన వెంటనే సొంత గూటికి చేరారు. చంద్రబాబును కలిసి తెదేపాకు మద్దతు ప్రకటించారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే కొండపల్లి పీఠాన్ని తెదేపా గెలుచుకునే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోనూ తెదేపా గట్టి పోటీనిచ్చింది. అక్కడ 31 వార్డులకు వైకాపా 17, తెదేపా 14 చోట్ల గెలుపొందాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని బేతంచర్లలో తెదేపా హోరాహోరీగా పోరాడింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌లో నాలుగు డివిజన్లలోనూ వైకాపా విజయం సాధించింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 328 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ రాగా, 28 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 320 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి వైకాపా 239 స్థానాల్ని, తెదేపా 80 స్థానాల్ని గెలుచుకున్నాయి. జనసేన ఐదు చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చోట్ల విజయం సాధించారు.

ఉప ఎన్నికల్లోనూ ఫ్యాన్‌ జోరు

రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 12 పట్టణాల్లోని 25 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైకాపా ఆధిక్యత కొనసాగింది. ఆ పార్టీ 22 స్థానాల్ని గెలుచుకోగా, తెదేపా రెండు చోట్ల గెలిచింది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ 23వ వార్డు తెదేపా వశమైంది.

* గుంటూరు, విశాఖ నగరాల్లో కార్పొరేటర్లు చనిపోవడం వల్ల జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు గెలిచాయి. గుంటూరు ఆరో డివిజన్‌ నుంచి ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన వైకాపా కార్పొరేటర్‌ పాదర్తి రమేష్‌గాంధీ మరణించడం వల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ వైకాపా అభ్యర్థి ఆత్మకూరి నాగేశ్వరరావుపై తెదేపా అభ్యర్థి పి.సమత 537 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
* విశాఖలో 31వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి బిపిన్‌కుమార్‌ జైన్‌ గెలుపొందారు. అక్కడ తెదేపా కార్పొరేటర్‌ వానపల్లి రవికుమార్‌ మరణించడంతో, ఆయన భార్య గాయత్రీ ఫణికుమారి తెదేపా తరఫున పోటీచేశారు. జైన్‌ మొదట కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ఆయనకు బి-ఫారం ఇచ్చింది. వైకాపా కూడా తమ అభ్యర్థుల్ని పోటీకి నిలబెట్టింది. ఆ తర్వాత మానవతా దృక్పథంతో పోటీ నుంచి వైదొలగుతున్నట్లు కాంగ్రెస్‌, వైకాపా ప్రకటించాయి. బిపిన్‌కుమార్‌కు కాంగ్రెస్‌ ఎ-ఫారం ఇవ్వలేదు. రిటర్నింగ్‌ అధికారి ఆయనను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించి, బీరువా గుర్తు కేటాయించారు. వైకాపా అప్పటికప్పుడు రంగంలోకి దిగి జైన్‌ని తమ అభ్యర్థిగా ప్రకటించి, బి-ఫారం ఇచ్చింది. జైన్‌ను వైకాపా అభ్యర్థిగా గుర్తిస్తూ ఆర్వో కొత్త జాబితా విడుదల చేయడంపై వివాదం నెలకొంది.

తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయం ముందు మహిళా కార్యకర్తల సంబరాలు

వైకాపా ఎమ్మెల్యే సొంత వార్డులో తెదేపా

* కడప జిల్లా కమలాపురంలో వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత వార్డైన.. ఆరో వార్డులో తెదేపా అభ్యర్థి షేక్‌ రెహానా గెలుపొందారు. ఇక్కడ 20 వార్డులకు వైకాపా 15, తెదేపా 5 గెలుచుకున్నాయి. తెదేపా అభ్యర్థులు ఒకటో వార్డులో 6, ఆరో వార్డులో 20, పన్నెండో వార్డులో 2, పదమూడో వార్డులో 7, 19వ వార్డులో 3 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. వైకాపా విజ్ఞప్తి మేరకు 1, 12, 19 వార్డుల్లో మూడేసి సార్లు రీకౌంటింగ్‌ చేసినా అదే ఫలితం వచ్చింది. తెదేపా తరపున గెలిచిన ఐదుగురిలో నలుగురూ ముస్లింలే.
* కుప్పం ఎన్నికల్లో ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ కూడా రాలేదు. రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌ తమ్ముడు, 22వ వార్డు అభ్యర్థి అరుళ్‌పై తెదేపా అభ్యర్థి సురేష్‌ 233 ఓట్ల తేడాతో గెలుపొందారు. 11 వార్డులో తెదేపా అభ్యర్థి కస్తూరికి ఆరు ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. రీకౌంటింగ్‌ చేసినా ఫలితం మారలేదు. 21వ వార్డులో వైకాపా అభ్యర్థి లావణ్య ఏడు ఓట్ల తేడాతో గెలిచారు.
* ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని బేతంచర్ల నగర పంచాయతీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో తెదేపా గట్టి పోటీనిచ్చింది. వైకాపా 14 స్థానాలు గెలవగా, తెదేపా ఆరు చోట్ల గెలుపొందింది. 5, 7, 8, 19 వార్డుల్ని 100లోపు ఓట్ల తేడాతో తెదేపా కోల్పోయింది.
* గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలో తెదేపా గట్టి పోటీనిచ్చింది. 20 వార్డులకు తెదేపా 7, జనసేన ఒకచోట గెలిచాయి. 11 వార్డుల్లో వైకాపా, ఒకచోట ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి గెలిచారు.


రీకౌంటింగ్‌లో కొన్ని ఫలితాలు తారుమారు

* కొండపల్లిలో ఒకటో వార్డులో వైకాపా గెలవగా.. ఫలితాన్ని మార్చారని మాజీమంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపాయి.  రీకౌంటింగ్‌కు పట్టుబట్టినా అధికారులు తిరస్కరించారు.
* జగ్గయ్యపేటలో ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి ఎమ్మెల్యే ఉదయభాను ప్రవేశించడంపై తెదేపా అభ్యంతరం తెలిపింది.
* జగ్గయ్యపేటలో 3 వార్డుల్లో పదిలోపు ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థులు గెలుపొందారు. 13వ వార్డులో 6 ఓట్లతో తెదేపా గెలవగా, వైకాపా రీకౌంటింగ్‌ కోరింది. రెండు దఫాల లెక్కింపు తర్వాత.. వైకాపా 5 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.
* నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం 8వ వార్డులో తెదేపా ఒక్క ఓటుతో గెలిచిందనిచెప్పి తర్వాత వైకాపా విజయాన్ని ప్రకటించారు. రీకౌంటింగ్‌ తర్వాతా ఆ ఫలితాన్నే ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని