Budget 2022: అన్నదాతకు బడ్జెట్‌ పంటపండేనా..?

బడ్జెట్‌ రైతన్నలకు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు...

Updated : 26 Jan 2022 14:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కేంద్ర బడ్జెట్‌ ప్రధాన సాధనంగా పనిచేస్తుంది. ఇతర రంగాలతో పోలిస్తే దేశ జనాభాలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయమే. ముఖ్యంగా మహమ్మారి సంక్షోభ సమయంలో ఇతర రంగాలన్నీ కుదేలైనా.. వ్యవసాయం మాత్రం నిలదొక్కుకుంది. రికార్డు స్థాయిలో ఆహారధాన్యాల సేకరణ జరిగింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకానికి దన్నుగా నిలిచింది.

మరోవైపు సాగు చట్టాలు ఈ ఏడాది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సమూల వ్యవసాయ సంస్కరణల కోసం తెచ్చిన చట్టాలుగా ప్రభుత్వం వీటిని అభివర్ణించింది. కానీ, అన్నదాతలు వీటి రద్దుకు భీష్మించడంతో సర్కార్‌ వెనక్కి తగ్గక తప్పలేదు. అలాగే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా గతకొన్నేళ్లలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతూ వస్తోంది. వీటిన్నింటినీ సమర్థంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం ముందున్న ఓ సదావకాశం బడ్జెట్‌. పైగా సాగు చట్టాల ఆందోళనలో పాల్గొన్న వారిలో పంజాబ్‌, యూపీ రైతులదే ప్రధాన పాత్ర. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న వేళ రైతన్నలకు కేంద్రం ఎలాంటి ప్యాకేజీ ప్రకటించనున్నదో చూడాల్సి ఉంది!

మండీల అభివృద్ధి...

సాగు చట్టాలు అమల్లోకి వస్తే మండీల (ఏపీఎంసీ) వ్యవస్థ నిర్వీర్వమవుతుందన్న వాదనను రైతులు బలంగా వినిపించారు. ధరల నిర్ణయం, విక్రేతల ఎంపిక విషయంలో రైతులకు మండీల వ్యవస్థ వల్ల సౌలభ్యం ఉందన్న విషయాన్ని సర్కార్‌ చివరకు అంగీకరించక తప్పలేదు! ఈ నేపథ్యంలో ఏపీఎంసీల అభివృద్ధి సహా ఇతర అగ్రిమార్కెటింగ్‌ పథకాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయిస్తోంది. అయితే, వీటిలో 40 శాతం రాష్ట్రాల వాటా ఉండాలన్న నిబంధన ఉంది. దీన్ని కుదించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. మరోవైపు మండీల్లో డ్రయింగ్‌, గ్రేడింగ్‌ వంటి వసతుల్ని పెంచి వాటిని గిడ్డంగులకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా రైతులు తమ ఉత్పత్తిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకొని మంచి రేటు వచ్చిన సమయంలో విక్రయించుకొనే వెసులుబాటు కలుగుతుంది.

అంతర్రాష్ట్ర వాణిజ్యానికి చట్టం..

రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంట ఉత్పత్తుల్ని విక్రయించేందుకు సాగు చట్టాలు వెసులుబాటు కల్పిస్తాయని ప్రభుత్వం వాదించింది. తీరా అవి రద్దు కావడంతో ఈ సంస్కరణల్ని కొనసాగించే దిశగా కేంద్రం ఓ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో పంట ఉత్పత్తుల విక్రయానికి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీన్ని రైతులు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వాగతించే అవకాశం ఉంది!

పథకాల కొనసాగింపు..

పీఎం-కిసాన్‌, పీఎం ఫసల్‌ బీమా యోజన వంటి పథకాలు రైతులకు నేరుగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలంలో రైతాంగ సమస్యల్ని తీర్చకపోయినప్పటికీ.. సాగు సంస్కరణలు పూర్తిగా అమల్లోకి వచ్చి.. వాటి ఫలాలు అందే వరకు వీటికి సమంజస కేటాయింపులు కొనసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ హార్టికల్చర్‌ వంటి అనుబంధ పథకాలకు కూడా సరైన కేటాయింపులు ఉండాలని ఆశిస్తున్నారు.

యాంత్రీకరణకు రాయితీ..

భారత్‌లో వ్యవసాయం ఇప్పటికీ శ్రామిక శక్తిపైనే ఆధారపడి ఉంది. రైతుల ఆదాయానికి ఇది గండికొడుతోంది. ముందుగా ఈ విధానాన్ని మార్చడం వల్ల ప్రభుత్వం అనుకున్న సంస్కరణలు వేగవంతం అవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే తక్కువ ధరలో సాగు యంత్రాలు, పరికరాలు రైతులకు అందుబాటులోకి వస్తే వ్యయ నియంత్రణలో ఉపయోగపడే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో సాగుకు సంబంధించిన యంత్రాల కొనుగోలుపై రాయితీలు కల్పించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీని వల్ల వృథాకు కట్టడిపడి ఉత్పాదకత కూడా పెరిగే అవకాశం ఉంది. యంత్రాల వాడకంతో ఉపాధి కోల్పోయే వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది.

సూక్ష్మ నీటిపారుదల విస్తరణ...

కొత్తతరం వ్యవసాయ పద్ధతుల్ని మరింత ప్రోత్సహించడానికి కూడా ఇదే సరైన సమయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థ ఇంకా దేశంలో చాలా ప్రాంతాలకు విస్తరించాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా దీన్ని ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టినప్పటికీ.. దేశంలో ఇప్పటికీ 17 శాతం సాగు భూమికి మాత్రమే మైక్రో ఇరిగేషన్‌ వసతులు అందాయి. అదే ఇజ్రాయెల్‌లో 90 శాతం, రష్యా 78 శాతం, స్పెయిన్‌ 75 శాతం, అమెరికాలో 55 శాతం సాగు భూమికి స్ప్రింక్లర్లు, డ్రిప్ వంటి సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. మన దేశం ఆ స్థాయికి చేరాలంటే 25 ఏళ్ల కాలపరిమితితో పటిష్ఠ ప్రణాళికను రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏటా నిర్దిష్ట కేటాయింపులతో లక్ష్యాన్ని చేరుకోవాలని చెబుతున్నారు.

పునరుత్పాదక ఇంధన వసతులు...

సౌరవిద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన వనరులను రైతులకు చేరువ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వారిలో ఇంధన భరోసా ఉంటుందని పేర్కొంటున్నారు. పైగా ప్రభుత్వంపై విద్యుత్తు రాయితీల భారం భారీగా తగ్గుతుందని చెబుతున్నారు. తత్ఫలితంగా వ్యయం తగ్గి ఆయా పంటల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఒనగూరే విలువ పెరుగుతుందని వివరిస్తున్నారు. ఇది స్థూలంగా దేశ ఆర్థికవృద్ధికి దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం..

దేశ జీడీపీలో వ్యవసాయ రంగ పరిశోధనలకు కేటాయిస్తున్న మొత్తం 1 శాతం కంటే తక్కువ. ఈ నేపథ్యంలో కొత్తతరం సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు పరిశోధనలు విస్తృత స్థాయిలో జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డిజిటలైజేషన్‌, ఇన్నోవేషన్‌, అగ్రిటెక్‌ రంగాల్లో వస్తున్న స్టార్టప్‌లకు అండగా నిలిస్తే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికోసం ప్రత్యేకంగా ‘అగ్రి ఇన్నోవేషన్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేయాలని పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్‌. 

దీర్ఘకాల రుణాలు..

రుణమాఫీ భారత్‌లో చాలా పాపులర్‌ పదం. కానీ, దీని ఫలాలు అంతంత మాత్రమే. రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణాల వల్ల అందే ప్రయోజనం తక్కువే. పైగా దేశంలో ఎక్కువగా చిన్న, సన్నకారు రైతులే ఉండడంతో వారికి అందే రుణమొత్తం కూడా స్వల్పమే. దీంతో భారీ ఎత్తున మౌలిక వసతులు సమకూర్చుకునేందుకు వారికి ఇది ఏమాత్రం ఉపయోగపడదు. కేవలం పంట పెట్టుబడులకు మాత్రమే సరిపోతున్నాయి. అదే తక్కువ వడ్డీతో దీర్ఘకాల రుణాలను అందించగలిగితే.. యాంత్రీకరణ, గిడ్డంగులు, షెడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేందుకు అన్నదాతకు వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23కి గానూ రుణ వితరణ లక్ష్యాన్ని రూ.18 లక్షల కోట్లుగా నిర్దేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్థిర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ముప్పు నేపథ్యంలో వైద్యారోగ్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం అనివార్యం. మరోవైపు సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగానికీ భారీ కేటాయింపులు తప్పవు. ఈ పరిమితుల మధ్య భారీ సంస్కరణలకు కేంద్రం వద్ద ఉన్న అవకాశాలు తక్కువనే చెప్పాలి. అయినప్పటికీ.. ఉన్నంతలో రైతన్నలకు కేంద్రం ఎలా అండగా నిలవనుందో చూడాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని