HRA In Budget 2022: పెరిగిన అద్దెల భారం.. మెట్రో నగరాల జాబితా మారేనా..?

కొన్నేళ్లుగా సవరించని ‘మెట్రో’ జాబితాలోకి మరికొన్ని నగరాలనూ చేర్చాలని పలువురు నిపుణులు బడ్జెట్‌ సూచనల్లో పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందే వెసులుబాటు ఉద్యోగులకు లభిస్తుంది.

Published : 27 Jan 2022 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగర జీవితం ఖరీదైపోయింది. ఇతర వ్యయాలు ఒకెత్తయితే, ఇంటి అద్దెల భారం భరించడం ఉద్యోగికి భారంగా మారింది. ఇంటి అద్దెలు ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమనుకునే వాళ్లు.. ఇప్పుడు మిగిలిన నగరాల్లోనూ అదే స్థాయిలో ఉంటున్నాయి.. ప్రస్తుతం దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలను మాత్రమే మెట్రో నగరాలుగా కేంద్రం గుర్తించింది. ఈ జాబితాలోకి మరికొన్ని నగరాలనూ తీసుకురావాలని కేంద్రానికి బడ్జెట్‌ ముందు వినతులు అందాయి. ఒకవేళ కేంద్రం ఆ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని జాబితాను మారిస్తే హెచ్‌ఆర్‌ఏ పన్ను మినహాయింపు పొందే ఉద్యోగులకు కొంతమేర ఊరట లభిస్తుంది.

వేతన జీవులకు ఆ సంస్థలు హౌస్‌ రెంట్‌ అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ) ఇస్తుంటాయి. ఒకవేళ ఉద్యోగి అద్దె ఇంట్లో ఉంటే.. ఆ మేరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అయితే, మెట్రో నగరాల్లో బేసిక్‌+ డీఏలో 50 శాతం వరకు ఈ మినహాయింపు పొందే అవకాశం ఉండగా.. మెట్రోయేతర నగరాల్లో అది 40 శాతంగా ఉంది. కేంద్ర ఇచ్చే 50శాతం మినహాయింపు వర్తించే మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, నొయిడా, గురుగ్రామ్‌ వంటివి లేవు. కానీ, అద్దెల్లో మాత్రం ఆ నగరాలతో పోటీపడుతున్నాయి. ఇతర వ్యయాలు కూడా ఆయా నగరాల్లో విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా సవరించని ‘మెట్రో’ జాబితాలోకి ఈ నగరాలనూ చేర్చాలని పలువురు ఆర్థికరంగ నిపుణులు బడ్జెట్‌ సూచనల్లో పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే 50 శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు పొందే వెసులుబాటు ఉద్యోగులకు లభిస్తుంది. ఇది కొంతమేర ఊరట కలిగించే అంశమే.

వేతన జీవి కోరుకుంటున్న మరికొన్ని ఊరటలు..

పన్ను భారం నుంచి కావాలి ఊరట..

బడ్జెట్‌ 2022 నుంచి ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు ఈ ఉపశమనాన్ని కోరుకుంటున్నారు. పన్ను శ్లాబులను విస్తరిస్తూ ప్రభుత్వం గతంలో తక్కువ పన్ను రేటును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, కొత్త పన్ను శ్లాబులను ఎంచుకున్న వారికి ఎల్‌టీఏ, హెచ్‌ఆర్‌ఏ, సెక్షన్‌ 80సి, 80డి వంటి అనేక మినహాయింపులను దూరం చేసింది. పాత విధానంతో పాటు కొత్త దాంట్లో గరిష్ఠ పన్ను రేటు 30 శాతంగా ఉండడం గమనార్హం. దీంతో చాలా మంది పాత పన్ను విధానాన్నే ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లకు దీన్ని రూ.10 లక్షల వరకు పెంచాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సెక్షన్‌ 80సి పైనా..

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, హోంలోన్‌ అసలు, జీవిత బీమా ప్రీమియం వంటి చెల్లింపుల ద్వారా అనేక మంది సెక్షన్‌ 80సి ప్రయోజనాన్ని వేతన జీవులు పొందుతున్నారు. అన్నింటికీ కలిపి ప్రస్తుతం రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే వీలుంది. అయితే, ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలన్న డిమాండ్‌ సామాన్యుల నుంచి బలంగా వినిపిస్తోంది. తద్వారా పెట్టుబడులను పెంచుకోవడంతో పాటు అధిక హామీ మొత్తంతో కూడిన బీమాను పొందే సదుపాయం ఉంటుందని ఆశిస్తున్నారు.

ఇంటి నుంచే పనికి వెసులుబాటులు..

కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అనేక కంపెనీలు ఇంటి నుంచి పనిచేసే సదుపాయాలు కల్పిస్తున్నాయి. అయితే, ఇది చిరుద్యోగులకు రానురానూ భారంగా మారుతోంది. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు కంపెనీలు కల్పించే వసతుల్ని.. ఇప్పుడు సొంతడబ్బుతో సమకూర్చుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా నాణ్యమైన ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఫర్నీచర్‌, ఇంటర్నెట్‌ ఛార్జీల కోసం అధిక మొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం రూ.50,000 వరకు అలవెన్సు ప్రకటించాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది.

కొవిడ్‌ వైద్య ఖర్చుల భారం తగ్గేలా..

ప్రస్తుతం సెక్షన్‌ 80డి కింద సొంత బీమాతో పాటు భాగస్వామి, పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులకు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపు లభిస్తోంది. దీంట్లో కొవిడ్‌ సంబంధిత వైద్య ఖర్చులను కూడా చేర్చాలని సామాన్యుల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. ఇప్పటికే మహమ్మారి వ్యాప్తితో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రజలను భయపెడుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఖర్చులను కూడా 80డి పరిధిలోకి తీసుకొస్తే కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ సెక్షన్‌ కింద గరిష్ఠంగా రూ.1,00,000 వరకు చెల్లించే ప్రీమియంలపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని మరింత పెంచాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని