Union Budget 2022: అంతా బాగుంది

ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు  9.2 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8-8.5 శాతంగా నమోదు కావచ్చు. పన్ను వసూళ్లలో వృద్ధి బడ్జెట్‌ అంచనాలకు మించి, గణనీయంగా రెండంకెల్లో పుంజుకుంటోంది.

Updated : 01 Feb 2022 05:04 IST

ఆర్థిక సర్వే

ఆర్థిక సర్వే ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు  9.2 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8-8.5 శాతంగా నమోదు కావచ్చు. పన్ను వసూళ్లలో వృద్ధి బడ్జెట్‌ అంచనాలకు మించి, గణనీయంగా రెండంకెల్లో పుంజుకుంటోంది. జీఎస్‌టీ వసూళ్లు గత జులై నుంచి రూ.లక్ష కోట్లు తగ్గలేదు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ  7.3% క్షీణించిందని గతంలో అంచనా వేయగా, దానిని 6.6 శాతానికి పరిమితం చేస్తూ తాజాగా జాతీయ గణాంక కార్యాలయం ప్రకటించడం మరింత ఉత్సాహం కలిగించే అంశమే. మౌలిక రంగ వృద్ధిగా పిలిచే 8 కీలక రంగాల ఉత్పత్తి 2021 డిసెంబరులో 3.8% పెరిగింది. టీకాల కార్యక్రమం జోరుగా సాగుతున్నందున, కొవిడ్‌ పరిణామాలు ఆర్థిక వ్యవస్థను ఆటంకపరచవనే విశ్వాసాన్ని ఆర్థిక సర్వే వ్యక్తం చేసింది. 2022- 23 బడ్జెట్‌ రూపకల్పనకు ఆధారమయ్యే ఈ సర్వే ఏం చెప్పిందంటే..


నేడు బడ్జెట్‌ ప్రసంగం

11 గంటల నుంచి 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ను పార్లమెంటులో మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రవేశ పెడతారని ఆర్థిక శాఖ ట్వీట్‌ చేసింది.


 

‘మౌలికానికి’ 1.4 లక్షల కోట్ల డాలర్లు వెచ్చిస్తేనే..

2024-25 కల్లా భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్ల) స్థాయికి  చేరాలంటే.. మౌలిక వసతుల రంగంలో 1.4 లక్షల కోట్ల డాలర్ల (రూ.105 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2008-17 ఆర్థిక సంవత్సరాల్లో మౌలిక వసతుల కోసం 1.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల)ను భారత్‌ వెచ్చించింది. ‘2020-25 మధ్య రూ.111 లక్షల కోట్ల (1.5 ట్రిలియన్లు) మౌలిక పెట్టుబడుల అంచనాలతో 6835 ప్రాజెక్టులున్న నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌(ఎన్‌ఐపీ)ను ఇప్పటికే ప్రకటించారు.   34 మౌలిక ఉప రంగాలకూ వర్తించేలా 9000కు పైగా ప్రాజెక్టులకు విస్తరించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద 2014-15 నుంచి 2020-21 వరకు రూ.1,37,218 కోట్ల వ్యయంతో మొత్తం 66 ప్రాజెక్టులు చేపట్టారు.


ఇంధన సుంకాలు తగ్గితే ద్రవ్యోల్బణం అదుపులోకి

ఈ సారి రిటైల్‌ ద్రవ్యోల్బణ అంచనాలను ప్రకటించలేదు. అయితే సరఫరా వ్యవస్థ మెరుగు పడి, ఇంధనంపై సుంకాలను తగ్గిస్తే ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. 2021-22 ఏప్రిల్‌-డిసెంబరులో 6 శాతం లోపే రిటైల్‌ ద్రవ్యోల్బణం ఉంది. కానీ ఆర్థిక కార్యకలాపాలు పెరగడం; అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ప్రియం కావడం, రవాణా వ్యయాలూ పెరగడం వల్ల టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం 12 శాతం పైకి చేరింది. పప్పు ధాన్యాలు, వంట నూనెల ధరలు తగ్గించడం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. కేంద్రం ఎక్సైజ్‌ సుంకంలో, పలు రాష్ట్రాలు వ్యాట్‌లో కోత వేయడంతో డీజిల్‌, పెట్రోలు ధరలు కొంత తగ్గాయి. కూరగాయల వంటి త్వరగా పాడయ్యే పంట ఉత్పత్తులకు శీతల గిడ్డంగుల వ్యవస్థ బలంగా ఉండాలి.


2021లో 14వేల కొత్త అంకురాలు

దేశీయ అంకుర వ్యవస్థ సత్తా చాటుతోంది. గత ఆరేళ్లలో అంకురాలు పెద్ద ఎత్తున ఏర్పాటయ్యాయి. 2016-17లో 733 అంకురాలు ప్రారంభంకాగా.. 2021లో కొత్తగా 14,000 సంస్థలు వెలిశాయి. ఇందులో అత్యధికంగా సేవారంగానికి చెందినవే. ఈ ఏడాది జనవరి 10 నాటికి దేశంలో 61,400 అంకురాలున్నాయి. దేశంలో 555 జిల్లాల్లో కనీసం ఒక అంకుర సంస్థ ఉంది. 2016-17లో 121 జిల్లాల్లో మాత్రమే కనీసం ఒక అంకురం ఉంది.

* అత్యధిక యూనోకార్న్‌ (సుమారు రూ.7500 కోట్ల అంకురం)ల సంఖ్యలో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారత్‌ నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి 14 నాటికి దేశంలో 44 అంకురాలు కొత్తగా యూనికార్న్‌ హోదా సాధించాయి. వీటితో కలిపి భారత్‌ యూనికార్న్‌ల సంఖ్య 83కి చేరింది. వీటి విలువ దాదాపు రూ.20.77 లక్షల కోట్లు (277.77 బిలియన్‌ డాలర్లు).


2020-21లో క్షీణత 6.6 శాతమే

2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం క్షీణించింది. అప్పుడు జీడీపీ   7.3 శాతం క్షీణించిందని 2021 మేలో వేసిన అంచనా కంటే ఇది మెరుగే. కొవిడ్‌ పరిణామాల వల్ల ముందుగా అనుకున్నంత అధ్వానంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినలేదని జాతీయ గణాంక కార్యాలయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2019-20లో వాస్తవ జీడీపీ వృద్ధి రేటును 3.7 శాతానికి సవరించారు. అంతక్రితం అంచనా 4 శాతంగా ఉంది.

* వాస్తవ జీడీపీ లేదా 2011-12 స్థిర ధరల వద్ద జీడీపీ 2020-21; 2019-20 ఏడాదులకు వరుసగా రూ.135.58 లక్షల కోట్లు; రూ.145.16 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే 2020-21లో 6.6 శాతం తగ్గింది.

* 2021 జనవరి సవరణలో 2019-20 వాస్తవ జీడీపీలో 4 శాతం వృద్ధి(రూ.145.69 లక్షల కోట్లు) నమోదవుతుందని అంచనా వేశారు.

* 2019-20; 2020-21లలో తలసరి ఆదాయం వరుసగా రూ.1,32,115; రూ.1,26,855గా నమోదైంది.


‘విమానం’ పుంజుకుంటోంది

భారత విమానయాన రంగం పుంజుకోవడం ప్రారంభించింది. కరోనా టీకా కార్యక్రమం వేగవంతం కావడం; అంతర్జాతీయంగా ప్రయాణ షరతులు సడలిస్తుండడం ఇందుకు నేపథ్యం. 2013-14లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 6.1 కోట్లు కాగా, 2019-20 కల్లా 13.7 కోట్లకు చేరింది. ఏటా 14% పైగా వృద్ధి నమోదైంది. విమానాశ్రయాల ఆధునికీకరణతో పాటు విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవరాల్‌(ఎమ్‌ఆర్‌ఓ)కు ప్రోత్సాహకాలను ప్రభుత్వం చేపట్టింది. మెట్రోల నుంచి చిన్న నగరాలకు ఉడాన్‌ పేరిట విమాన సర్వీసులు నిర్వహిస్తున్న కార్యక్రమంతో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 153కు చేరింది.


50% పెరిగిన పన్ను రాబడి

2021 ఏప్రిల్‌-నవంబరులో ఆదాయం 67.2 శాతం (వార్షిక ప్రాతిపదికన) పెరిగింది. వాస్తవానికి 2021-22 బడ్జెట్‌ అంచనాల్లో 9.6 శాతం వృద్ధి మాత్రమే అంచనా వేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు రెండూ బలంగా పుంజుకున్నాయి. ఆర్‌బీఐ మిగులు నిధులు రూ.99,000 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయడంతో పన్నేతర రాబడి బాగా పెరిగింది. స్థూలంగా పన్ను రాబడి 2021 ఏప్రిల్‌-నవంబరులో50 శాతం మేర పెరిగింది. కొవిడ్‌ ముందు (2019-20) పరిస్థితుల కంటే కూడా పన్ను రాబడి మెరుగ్గా ఉంది. 2021 ఏప్రిల్‌-నవంబరులో స్థూల జీఎస్‌టీ వసూళ్లు   రూ.10.74 లక్షల కోట్లకు చేరాయి. 2020 ఏప్రిల్‌-డిసెంబరుతో పోలిస్తే ఇది 61.5 శాతం అధికం.


కొవిడ్‌ను బ్యాంకులు తట్టుకున్నాయ్‌

కొవిడ్‌ పరిణామాల వల్ల తలెత్తిన ఆర్థిక షాక్‌ను దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ ఇప్పటివరకు సమర్థంగా తట్టుకుంది కానీ.. ఇప్పటికీ కొంత ప్రతికూలత ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) మొత్తం నికర లాభం 2020-21 ప్రథమార్థంలో రూ.14,688 కోట్లు కాగా, 2021-22 ప్రథమార్థంలో రూ.31,144 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకుల నికర లాభం రూ.32,762 కోట్ల నుంచి రూ.38,234 కోట్లకు చేరింది. మొత్తంగా షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నికర లాభం 2020 సెప్టెంబరు చివరకు 59,426 కోట్లు కాగా.. 2021 సెప్టెంబరుకు రూ.78,729 కోట్లకు వృద్ధి చెందింది.


‘సాఫ్ట్‌వేర్‌’లోకి భారీ విదేశీ పెట్టుబడులు

2021 ఏప్రిల్‌-నవంబరులో స్థూలంగా 54.1 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దేశంలోకి వచ్చాయని.. నికరంగా మాత్రం 24.7 బి. డాలర్లకు తగ్గాయని ఆర్థిక సర్వే తెలిపింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఐటీ-బీపీఎం) రంగ ఆదాయాలు 2020-21లో (ఇ-కామర్స్‌ మినహా) 2.26 శాతం వృద్ధితో రూ. 14.55 లక్షల కోట్లకు (194 బిలియన్‌ డాలర్లు) చేరుకున్నాయని సర్వే పేర్కొంది. కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు వచ్చాయి


ఔషధ రంగంలోకీ ఎఫ్‌డీఐలు

కొవిడ్‌ సంబంధిత ఔషధాలు, టీకాలకు గిరాకీ పెరగడంతో 2020-21లో ఫార్మా రంగంలోకి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయి. 2021 ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.4,413 కోట్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చాయి. 2020 ఇదే సమయంతో పోలిస్తే ఇవి 53 శాతం అధికం. ప్రపంచంలో ఉత్పత్తి పరంగా భారత ఔషధ పరిశ్రమ మూడో స్థానంలో ఉంది. 2020-21లో మొత్తం ఫార్మా ఎగుమతులు 24.2 బి. డాలర్ల మేర జరిగితే, దిగుమతులు 7 బి. డాలర్లు మాత్రమే. మొత్తం ప్రపంచంలోనే జనరిక్‌ ఔషధాల సరఫరాలో భారత్‌ వాటా 20 శాతంగా ఉంది.


ఐపీఓల ద్వారా రూ.89,066 కోట్లు

2021 ఏప్రిల్‌- నవంబరులో పబ్లిక్‌ ఇష్యూల ద్వారా 75 కంపెనీలు రూ.89,066 కోట్లు సమీకరించాయి. 2020 ఇదే కాలంలో 29 కంపెనీలు రూ.14,733 కోట్లే సమీకరించాయి. అంటే నిధుల సమీకరణ  504.50 శాతం పెరిగింది. దశాబ్దకాలంలోనే ఒక ఏడాదిలో అత్యధిక నిధుల సమీకరణ ఇదే.  షేర్లు ఆకర్షణీయ ప్రతిఫలాలను అందివ్వడంతో,   2021 ఏప్రిల్‌- నవంబరులో కొత్తగా 2.21 కోట్ల మంది డీ-మ్యాట్‌ ఖాతాలు తెరిచారు. 2019-20లో ఎన్‌ఎస్‌ఈ  టర్నోవరులో చిన్న మదుపర్ల పెట్టుబడి వాటా 38.8 శాతం కాగా.. 2021 ఏప్రిల్‌- అక్టోబరులో 44.7 శాతానికి చేరింది.


టెలికాం సంస్కరణలు భేష్‌

టెలికాం సంస్కరణల వల్ల 4జీకి మద్దతు లభించడంతో పాటు 5జీ నెట్‌వర్క్‌లకు పెట్టుబడులను సిద్ధం చేసుకునే వాతావరణం ఏర్పడిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ‘కరోనాతో డేటా వినియోగం భారీగా పెరిగినా, బ్రాడ్‌బ్యాండ్‌, టెలికాం అనుసంధానతలో అంతరాయాలు ఏర్పడలేదు. సగటు వినియోగదారు నెలవారీ డేటా వినియోగం 2017-18 తొలి త్రైమాసికంలో 1.24 జీబీ కాగా.. 2021-22లో అది 14.1 జీబీకి పెరిగింది. డిసెంబరు 2021 కల్లా మొబైల్‌ టవర్ల సంఖ్య 6.93 లక్షలకు చేరింది.


ఎయిరిండియా విక్రయంతో ప్రైవేటీకరణకు జోష్‌

భారీ నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను విక్రయించగలగడంతో, దేశంలో ప్రైవేటీకరణ ప్రక్రియకు జోష్‌ వచ్చినట్లయ్యింది. అన్ని రంగాల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా, వ్యాపార కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగ పాత్రను ఇది పునర్నిర్వచించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌, స్వయంసమృద్ధి లక్ష్యాల సాకారానికీ ఇది దోహదం చేస్తుంది. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని సాధించేందుకే కాదు.. 20 ఏళ్ల తరవాత జరిగిన తొలి ప్రైవేటీకరణ ప్రక్రియగా ఇది ఎంతో కీలకం. బీపీసీఎల్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, పవన్‌హాన్స్‌, ఐడీబీఐ బ్యాంక్‌, కాంకర్‌, బీఈఎం, విశాఖ స్టీల్‌ వంటివీ ప్రైవేటీకరణ బాటలో ఉన్నాయి.


సీపీఎస్‌ఈల ఆస్తుల అమ్మకంపై రూ.6 లక్షల కోట్లు!

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈలు) స్థలాలు, ప్రధానేతర ఆస్తుల విక్రయ ప్రక్రియను వేగవంతం చేసేందుకు నేషనల్‌ ల్యాండ్‌ మానిటైజేషన్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.విక్రయ నిమిత్తం ఎంటీఎన్‌ఎల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌, బీపీసీఎల్‌, బీఅండ్‌ఆర్‌, బీఈఎంఎల్‌, హెచ్‌ఎంటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ లిమిటెడ్‌ లాంటి సీపీఎస్‌ఈల నుంచి 3,400 ఎకరాల స్థలం, ఇతర ప్రధానేతర ఆస్తులను ఇప్పటివరకు గుర్తించారు. 2021-22 నుంచి 2024-25 వరకు నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ కీలక ఆస్తుల విక్రయం ద్వారా రూ.6 లక్షల కోట్లు సమకూరొచ్చు.


సెమీ కండక్టర్ల కొరత.. ఉత్పత్తి కోత

సెమీ కండక్టర్ల కొరత వల్ల వివిధ రంగాలకు చెందిన చాలా సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించడం లేదా నిలిపివేయాల్సి వచ్చింది. అందుకే సెమీ కండక్టర్లు, డిస్‌ప్లేల తయారీ విభాగం కోసం ప్రభుత్వం రూ.76,000 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఇందువల్ల దేశంలో వాటి ఉత్పత్తి ప్రారంభమవుతుందని, అంతర్జాతీయ సరఫరా ఆటంకాల నుంచి ఊరట లభిస్తుందని పేర్కొంది. ఇది దేశీయ ఎలక్ట్రానిక్‌ కంపెనీలకు ఉపయుక్తమే కాక, అంతర్జాతీయంగానూ పోటీ పడొచ్చని పేర్కొంది. చిప్‌సెట్ల కొరత వల్ల గత డిసెంబరు ఆఖరుకు వాహన కంపెనీల వద్ద 7 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి.


అమెరికా ఫెడ్‌ నిర్ణయాలనూ  భారత్‌ తట్టుకుంటోంది

అమెరికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల కేంద్ర బ్యాంకులు పరపతి విధానాన్ని ‘సాధారణీకరణ’ చేసినా కూడా భారత్‌ తట్టుకోగలదని ఆర్థిక సర్వే పేర్కొంది.అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపునకు సంకేతాలు ఇవ్వడంతో పాటు ద్రవ్యోల్బణ అదుపునకు ద్రవ్యలభ్యతను తగ్గించే చర్యలు చేపట్టనుంది. దీనిని పరపతి విధాన ‘సాధారణీకరణ’ ప్రణాళిక ప్రారంభంగా భావిస్తున్నారు. భారత్‌ వద్ద 630 బిలియన్‌ డాలర్లకు పైగా ఉన్న విదేశీ మారకపు నిల్వలకు తోడు ఎటువంటి పరిస్థితులతోనైనా పోరాడేంత ‘విధానపరమైన అవకాశాలు’ ఉన్నాయని తెలిపింది. ఇప్పటిదాకా అమెరికా ఎటువంటి ‘టాపర్‌ టాంట్రమ్‌’ చర్యలు చేపట్టినా.. భారత్‌ తొణకలేదని.. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లినా.. ఆ తర్వాత బలంగా పుంజుకుందని సర్వే గుర్తు చేసింది.


నౌకాశ్రయాల పనితీరు కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థకు నౌకాశ్రయాల పనితీరు కీలకం. పోర్టుల పాలన, సామర్థ్య వినియోగ పెంపు, అనుసంధాన విస్తరణ కోసం పలు చర్యలు చేపడుతోంది. 2014 మార్చి నాటికి 13 ప్రధాన పోర్టుల సామర్థ్యం 871.52 మిలియన్‌ టన్నులు కాగా.. 2021 మార్చి చివరకు 79% వృద్ధితో 1560.61 మిలియన్‌ టన్నులకు చేరింది. కరోనా పరిణామాల వల్ల పోర్టుల వద్ద రద్దీ 2020-21లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 4.6% తగ్గింది.


విదేశాల్లో ఆస్తుల రికవరీ అవసరం

దివాలా కంపెనీలపై సర్వే అభిప్రాయం

కంపెనీలకు విదేశాల్లో ఉన్న ఆస్తుల నుంచీ బకాయిలు రికవరీ చేసేందుకు సహాయం చేసే ఒక ‘ప్రామాణీకరించిన విదేశీ దివాలా ప్రణాళిక’ అవసరమని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ప్రస్తుతం విదేశీ రుణదాతలు భారత్‌లోని దేశీయ కంపెనీపై క్లెయిమ్‌ చేసుకునే వీలుంది. కానీ ఇతర దేశాల్లో దివాలా ప్రక్రియకు అనుమతి లేదు. ఈ నిబంధనలను సవరించాలని సర్వే అంటోంది. మరో వైపు, దివాలా స్మృతి(ఐబీసీ) వల్ల కార్పొరేట్‌ రుణస్వీకర్తల ప్రవర్తనలో మార్పులు వచ్చాయని చెబుతోంది. వేలకొద్దీ కంపెనీలు ముందస్తు దశల్లోనే రుణ ఒత్తిడిని పరిష్కరించుకోడానికి ముందుకు వస్తున్నాయని పేర్కొంది. 2021 సెప్టెంబరు వరకు దివాలా ప్రక్రియకు 18,629 దరఖాస్తులు వచ్చాయి. వీటి విలువ రూ.5,89,516 కోట్లు.


7 లక్షలకు పైగా వాహన ఆర్డర్లు పెండింగ్‌

2021 డిసెంబరు నాటికి వాహన తయారీ సంస్థల వద్ద 7 లక్షలకు పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సెమీ కండక్టర్ల కొరతే. ఇవి లేనందున, ఎలక్ట్రానిక్‌ పరికరాలు సమయానికి సరఫరా కావడం లేదు. ఫలితంగా ఒక వాహనానికి ఆర్డర్‌ తీసుకున్నప్పటి నుంచి డెలివరీ ఇచ్చేందుకు అంతర్జాతీయంగా 14 వారాల సమయం పడుతోంది. భారత్‌లోనూ ఇదే ధోరణి ఉంది. భారత వాహన తయారీదార్ల సంఘం సియామ్‌ గణాంకాల ప్రకారం, 2020 డిసెంబరుతో పోలిస్తే 2021 డిసెంబరులో కార్ల విక్రయాలు 13 శాతం క్షీణించి 2,19,421కు పరిమితమయ్యాయి.  సరఫరా ఇబ్బందులతోనే ఇది చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు