Union Budget 2022: భారత్‌ బడ్జెట్‌ విశేషాలు ఇవి..!

భారత్‌ దాదాపు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితా తొలి పది స్థానాల్లో నిలిచింది. దాదాపు 130 కోట్ల మంది భవిష్యత్తును ఇది నిర్దేశిస్తుంది. భారత్‌లో బడ్జెట్‌కు దాదాపు

Updated : 31 Jan 2022 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ దాదాపు మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జాబితా తొలి పది స్థానాల్లో నిలిచింది. దాదాపు 130 కోట్ల మంది భవిష్యత్తును ఇది నిర్దేశిస్తుంది. భారత్‌లో బడ్జెట్‌కు దాదాపు 162 సంవత్సరాల చరిత్ర ఉంది. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా నాలుగో బడ్జెట్‌ను రేపు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బడ్జెట్ విశేషాలు ఇవి. 

తొలి బడ్జెట్లు..

* భారత్‌లో తొలిసారి 1860 ఏప్రిల్‌ 7వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈస్ట్‌ఇండియా కంపెనీకి చెందిన స్కాటిష్‌ ఆర్థిక వేత్త జేమ్స్‌ విల్సన్‌ దీనిని ప్రవేశపెట్టారు. జేమ్స్‌ విల్సన్‌ ‘ది ఎకానమిస్ట్‌’ పత్రిక వ్యవస్థాపకుడు కూడా.

* స్వాతంత్ర్య భారత్‌లో తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్‌ 26వ తేదీన  నాటి ఆర్థిక మంత్రి షణ్ముగం చెట్టి ప్రవేశపెట్టారు. 

సుదీర్ఘ బడ్జెట్‌ ప్రసంగాలు..

* ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగం సుదీర్ఘమైనది. ఈ ప్రసంగం రెండుగంటల 42 నిమిషాలపాటు కొనసాగింది. అప్పటికీ ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నాయి. అప్పట్లో ఆమెకు ఒంట్లో నలతగా ఉండటంతో ప్రసంగాన్ని కుదించుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె 2019లో నెలకొల్పిన 2 గంటల 17 నిమిషాల రికార్డును బద్దలు కొట్టారు. 

అత్యధిక పదాలున్న బడ్జెట్‌..

* 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ 18,650 పదాలనున్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 

* 2018లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ 18,605 పదాలున్న బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన దీనిని కేవలం ఒక గంటా 49 నిమిషాల్లో చదివేశారు. 

అతితక్కువ పదాలున్న బడ్జెట్‌..

* 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్‌ ముల్జీ భాయ్‌ పటేల్‌ సమర్పించిన బడ్జెట్‌ అతిచిన్నది. దీనిలో కేవలం 800 పదాలు మాత్రమే ఉన్నాయి. 

అత్యధిక సార్లు బడ్జెట్‌ సమర్పించిన వారు..

* మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించారు. 1962-69 మధ్య 10సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆయన తర్వాతి స్థానంలో పి.చిదంబరం (9), ప్రణబ్‌ ముఖర్జీ (8), యశ్వంత్‌ సిన్హా (8), మన్మోహన్‌ సింగ్‌ (6) బడ్జెట్లను ప్రవేశపెట్టారు. 

బడ్జెట్‌ సమయాలు, తేదీల్లో మార్పులు..

* 1999 వరకూ కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి పనిదినం సాయంత్రం 5గంటలకు ప్రవేశపెట్టేవారు. ఇది బ్రిటిష్‌ కాలం నుంచి వస్తున్న సంప్రదాయం.  కానీ, 1999లో నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఈ సంప్రదాయాన్ని మార్చారు. ఉదయం 11 గంటలకే ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. 

* 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. 

ప్రచురణలో మార్పు..

* 1995 వరకు బడ్జెట్‌ను ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే ప్రచురించేవారు. కానీ, ఆ ఏడాది కాంగ్రెస్‌  ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రతులను హిందీ, ఇంగ్లిష్‌ రెండు భాషల్లో సిద్ధం చేయించింది. 

* 1950 నుంచి బడ్జెట్‌ను రాష్ట్రపతి భవన్‌లో ముద్రించే వారు. కానీ, అక్కడి నుంచి బడ్జెట్‌ ప్రతిపాదనలు లీక్‌ కావడంతో ప్రింటింగ్‌ను న్యూదిల్లీలోని మింట్‌రోడ్‌కు తరలించారు. 1980లో నార్త్‌బ్లాక్‌లో ఒక ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముద్రించడం మొదలుపెట్టారు. 2021-22 నుంచి కరోనా వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రారంభించారు. 

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళలు..

1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిలిచారు. 2019లో నిర్మలా సీతారామన్‌ రెండో మహిళగా నిలిచారు. బడ్జెట్‌ బ్రీఫ్‌కేస్‌ను త్యజించి.. సంప్రదాయ బహి-ఖాతాలో బడ్జెట్‌ను తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం ఉంది. 

రైల్వే బడ్జెట్‌ అదృశ్యం..

92 ఏళ్లపాటు బడ్జెట్, రైల్వే బడ్జెట్లను వేర్వేరుగా ప్రవేశపెట్టారు. కానీ, 2017లో రెండింటినీ విలీనం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని