Stock Market: మార్కెట్లలో బడ్జెట్‌ జోరు.. ఉత్సాహంగా మొదలైన బుల్‌

దలాల్‌స్ట్రీట్‌లో వరుసగా రెండో రోజు బుల్‌ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, బడ్జెట్‌పై ఆశలు, ఆర్థిక సర్వే నివేదిక మదుపర్ల

Published : 01 Feb 2022 09:40 IST

ముంబయి: దలాల్‌స్ట్రీట్‌లో వరుసగా రెండో రోజు బుల్‌ జోరు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు, బడ్జెట్‌పై ఆశలు, ఆర్థిక సర్వే నివేదిక మదుపర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగా మొదలుపెట్టాయి. సెన్సెక్స్‌ ఏకంగా 600 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించగా.. నిఫ్టీ 17,500 మార్క్‌ పైనే ట్రేడ్‌ అవుతోంది. 

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 735 పాయింట్లు ఎగబాకి 58,749 వద్ద, నిఫ్టీ 193 పాయింట్ల లాభంతో 17,533 వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ దాదాపు 2శాతం పెరిగింది.  చమురు రంగ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మారుతి సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా.. బజాజ్‌ ఆటో, భారత్‌ పెట్రోలియం, టాటా మోటార్స్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కరోనాతో అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మదుపర్లు ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని