Union Budget 2022: నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో!

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొవిడ్‌ మూడో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన నాలుగో బడ్జెట్‌ను రేపు పార్లమెంట్‌లో

Updated : 31 Jan 2022 06:34 IST

ఏయే రంగాలు ఏం కోరుతున్నాయంటే..

బడ్జెట్‌ 2022 - 23 రేపే

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొవిడ్‌ మూడో దశ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన నాలుగో బడ్జెట్‌ను రేపు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అందరి కళ్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్‌లో కేటాయింపులపై వివిధ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే..

* కొవిడ్‌ ప్రభావానికి అధికంగా గురైన    ఆతిథ్య రంగం రుణ మారటోరియం ఆశిస్తోంది. మంగళవారం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మారటోరియంతో పాటు ఈసీఎల్‌జీఎస్‌ పొడిగింపు, రుణ పునర్నిర్మాణానికి కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆతిథ్య రంగ పరిశ్రమ సమాఖ్య ఎఫ్‌హెచ్‌ఆర్‌ఏఐ కోరుతోంది.

* పన్ను రహిత ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను మూడేళ్ల కాలానికి తగ్గిస్తే బాగుంటుందని బ్యాంకింగ్‌ రంగం కోరుతోంది. దీంతో పన్ను ప్రయోజనం పొందేందుకు ఈ డిపాజిట్లు చేసేందుకు ప్రజలు ముందుకొస్తారని బ్యాంకులు చెబుతున్నాయి.

* ద్విచక్ర వాహనాలపై వస్తు సేవల పన్నును (జీఎస్‌టీ) 18 శాతానికి తగ్గించడం ద్వారా ఈ విభాగానికి గిరాకీ పెంచాలని వాహన డీలర్ల అసోసియేషన్‌ ఫాడా కోరుతోంది.

* ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కింద భారత్‌లో తయారైన ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా ఎగుమతుల విషయంలో అంతర్జాతీయంగా పోటీ లేకుండా చేయొచ్చని ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసియా) చెబుతోంది.

* క్రిప్టో కరెన్సీల కొనుగోలు/విక్రయాలపై టీడీఎస్‌/టీసీఎస్‌ అమలయ్యేలా బడ్జెట్‌లో ప్రతిపాదించాలని, ఒక పరిమితికి మించి జరిగే లావాదేవీలపై పన్ను విధించడానికి ఆ వివరాలు ఆదాయ పన్ను విభాగానికి చేరేలా చూడాలని పన్ను నిపుణులు సూచిస్తున్నారు. క్రిప్టో కరెన్సీల ఆదాయంపై 30 శాతం పన్ను శ్లాబు ఉండాలని కోరారు.

* ఆర్థిక రంగ అంకురాల కోసం పన్ను విధానాన్ని మరింత సరళీకరించాలని ఫిన్‌టెక్‌ పరిశ్రమ కోరుతోంది. గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని చెబుతోంది.

* పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహం కల్పించే విధానాలపై దృష్టి పెట్టడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధుల కేటాయింపు భారీగా పెంచాలని ఫార్మా పరిశ్రమ విన్నవిస్తోంది. అలాగే కొన్ని ఎంపిక చేసిన ఔషధాలపై పన్ను రాయితీలను కొనసాగించాలని కోరుతోంది.

* 80సి సెక్షన్‌లో పెట్టుబడుల పరిమితిని పెంచాలని, బీమా ప్రీమియం పరిమితిని రూ.1 లక్ష వరకు మినహాయించుకునేందుకు అవకాశం కల్పించాలని బీమా సంస్థలు కోరుతున్నాయి. అలాగే ఆరోగ్య పాలసీలపై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరాయి.

* ట్రేడింగ్‌ ప్రారంభించబోయే కొత్త మదుపర్లకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) పూర్తిగా తొలగించాలని మార్కెట్‌ నిపుణులు కోరుతున్నారు.

* గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు సహజ వాయువును జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని సంబంధింత పరిశ్రమ వర్గాలు అభ్యర్థిస్తున్నాయి.

* స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) కనీసం 3 శాతం నిధుల్ని ఆర్యోగ సంరక్షణ రంగానికి కేటాయించేలా చూడాలని పరిశ్రమ కోరుతోంది. అలాగే ప్రాధాన్య హోదా కల్పించాలని అభ్యర్థిస్తోంది.


బ్లాక్‌ బడ్జెట్‌ తెలుసా మీకు?

స్వతంత్ర భారతావనిలో నవంబరు 26, 1947న అప్పటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె. షణ్ముఖం శెట్టి ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ నుంచి రేపు నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ వరకు ఎన్నో కీలక బడ్జెట్లను ఈ దేశం చూసింది. దేశగతిని మార్చి పెనుమార్పులకు కారణమైన కొన్ని మాత్రం ప్రజల మనసులో నిలిచిపోయాయి. అవేంటంటే..

* బ్లాక్‌ బడ్జెట్‌: 1973-74లో ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో యశ్వంత్‌రావు బి చవాన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్‌ బడ్జెట్‌’గా పిలుస్తారు. ఎందుకంటే ఆ ఏడాది ద్రవ్యలోటు రూ.550 కోట్లకు చేరుకుని దేశం ఆర్థిక ఒత్తిడిలో చిక్కుకున్న తరుణంలో వచ్చిందది.

* క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని వీపి సింగ్‌ ఫిబ్రవరి 28, 1986లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అటు ప్రోత్సాహకాలు.. ఇటు శిక్షలు ఉండడంతో ‘క్యారెట్‌ అండ్‌ స్టిక్‌ బడ్జెట్‌’గా మారింది. వినియోగదార్లపై కరుణ చూపగా.. స్మగ్లర్లు, బ్లాక్‌ మార్కెటర్లు, పన్ను ఎగవేతదార్లపై కొరడా ఝుళిపించారు.

* చారిత్రాత్మక బడ్జెట్‌: పీవీ నరసింహరావు హయాంలో మన్మోహన్‌ సింగ్‌ 1991లో తీసుకొచ్చిన బడ్జెట్‌ను ఎవరూ మరచిపోలేరేమో. ఆర్థిక సరళీకరణలకు ఆహ్వానం పలుకుతూ.. లైసెన్స్‌రాజ్‌కు ముగింపు చెప్పిన ఈ బడ్జెట్‌ యుగానికొకసారి వచ్చే బడ్జెట్‌గా నిలిచి పోయింది.

* కలల బడ్జెట్‌: పన్ను రేట్లను తగ్గిస్తూ.. వసూళ్లను పెంచేందు కోసం ‘లాఫర్‌ కర్వ్‌’ సూత్రాన్ని వినియోగిస్తూ 1997-98లో పి చిదంబరం ‘కలల బడ్జెట్‌’ను తీసుకొచ్చారు. గరిష్ఠ ఆదాయ పన్ను రేట్లను భారీగా తగ్గించారు. కస్టమ్స్‌ సుంకాన్ని కూడా తగ్గించడంతో పాటు సరళీకృతం చేశారు.

* మిలేనియమ్‌ బడ్జెట్‌: యశ్వంత్‌ సిన్హా 2000లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌ భారత ఐటీ రంగ పరిశ్రమ వృద్ధికి ఒక కార్యాచరణను రూపొందించింది. ప్రస్తుత ఐటీ ప్రభకు ఒక విధంగా ఇక్కడి నుంచే పునాదులు ఏర్పడ్డాయని చెప్పాలి.

* రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌: అటల్‌ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో యశ్వంత్‌ సిన్హా 2002-03లో ప్రకటించిన బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవడం లేదా రోల్‌బ్యాక్‌ చేయడం జరిగింది. అందుకే ఇది రోల్‌బ్యాక్‌ బడ్జెట్‌గా నిలిచిపోయింది.

* వందేళ్లకోసారి వచ్చే బడ్జెట్‌: ఫిబ్రవరి 1, 2021న అంటే గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను నిర్మలాసీతారామన్‌ ‘వన్స్‌ ఇన్‌ ఎ సెంచురీ బడ్జెట్‌’గా అభివర్ణించారు. ఆసియాలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయడం కోసం మౌలిక, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు; ప్రైవేటైజేషన్‌ వ్యూహానికి పదును పెట్టి; పన్ను వసూళ్లను పెంచడానికి పలు ప్రతిపాదనలు చేశారు.


మార్కెట్‌కు బడ్జెట్‌ ‘బూస్టర్‌’!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం కూడా హెచ్చుతగ్గులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మంగళవారం వెలువడనున్న కేంద్ర బడ్జెట్‌ కీలకం కానుంది. ఆర్థిక రికవరీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకోవచ్చని మదుపర్లు ఆశిస్తున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి, వృద్ధి ఆధారిత పెట్టుబడులు బడ్జెట్‌లో ప్రకటించొచ్చని భావిస్తున్నారు. నిఫ్టీకి 16,800 పాయింట్ల స్థాయి కీలకమని, ఇది కోల్పోతే 16,400- 16,500 వరకు దిద్దుబాటు జరగొచ్చని సాంకేతిక విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు 17,500 దగ్గర నిరోధం ఎదురుకావొచ్చని అంటున్నారు. తయారీ పీఎంఐ, జీఎస్‌టీ వసూళ్లు, నెలవారీ వాహన విక్రయాలపై కూడా దృష్టిపెట్టొచ్చు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి దిగ్గజ సంస్థల ఫలితాలతో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. గత వారం మార్కెట్‌ దిద్దుబాటులోనూ బ్యాంకులు రాణించడంతో నిపుణులు సానుకూల వైఖరి కనబరుస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని