Union budget 2022: మరోసారి కరోనా పీడకల రాకుండా..!

కరోనా డెల్టా వేరియంట్‌ భారత్‌లో విజృంభించిన సమయంలో ఆసుపత్రుల్లో ఐసీయూలు సరిపోక.. పడకలు దొరక్క.. ఆక్సిజన్‌ అందక ప్రజలు పడిన కష్టాలు ఓ పీడకలే. ఈ పీడకల కొన్ని తరాలపాటు గుర్తిండిపోతుంది

Updated : 30 Jan 2022 15:05 IST

 వైద్య సౌకర్యాలకు బడ్జెట్‌లో పెద్దపీట

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనా డెల్టా వేరియంట్‌ భారత్‌లో విజృంభించిన సమయంలో ఆసుపత్రుల్లో ఐసీయూలు సరిపోక.. పడకలు దొరక్క.. ఆక్సిజన్‌ అందక ప్రజలు పడిన కష్టాలు ఓ పీడకలే. ఇది కొన్ని తరాలపాటు గుర్తుండిపోతుంది. పాలకులకు ఇదో గుణపాఠం. అప్పటికే కరోనా కారణంగా 2021-22 బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 137శాతం కేటాయింపులను పెంచారు. కానీ, ప్రజలకు సరైన సౌకర్యాలు అందలేదు. ఈ సారి థర్డ్‌వేవ్‌ కొనసాగుతున్న సమయంలో కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్యరంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

వాస్తవిక పెంపు అవసరం..

2021-22 బడ్జెట్‌ను మొత్తంగా చూస్తే అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 137శాతం పెంపు కాగితాలపై కనిపిస్తుంది. కానీ, నీటి సరఫరా, శానిటైజేషన్‌, న్యూట్రిషన్‌, కొవిడ్‌ టీకాలకు కేటాయింపులను తొలగించి చూస్తే కేవలం 12శాతం పెంపు మాత్రమే జరిగిందని అర్థమవుతుంది. ఇది జీడీపీలో 1.1శాతానికి సమానం. హెల్త్‌పాలసీ 2017లో సూచించిన ‘జీడీపీ 2.5శాతం కేటాయింపు’లకు వాస్తవిక కేటాయింపులకు చాలా దూరం ఉంది. ప్రభుత్వ బడ్జెట్‌లో ఆరోగ్యరంగానికి ప్రాధాన్యం ఇచ్చే 189దేశాల జాబితాలో భారత్‌ స్థానం 179 అంటే మన కేటాయింపులను అర్థం చేసుకోవచ్చు. 

భారత్‌ కంటే చిన్న దేశాలు నయం..

భారత్‌తో పోలిస్తే బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపుల్లో శ్రీలంక, ఇండోనేషియా వంటి దేశాలు మెరుగ్గా ఉన్నాయి. శ్రీలంక మూడు రెట్లు, ఇండోనేషియా రెండు రెట్లు కేటాయింపులు చేసింది. బ్రిక్స్‌, ఓఈసీడీ కూటమి దేశాల్లో ఆరోగ్యంపై అతితక్కువ వెచ్చించే దేశం భారత్‌ కావడం గమనార్హం. ప్రపంచలోనే మూడో అతి పేద దేశమైన బురుండీ తన జీడీపీ వాటాలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు భారత్‌ కంటే మెరుగ్గా ఉన్నాయి. మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా చెప్పుకొనే మనం జీడీపీలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచుకోవాల్సిందే. 

ఆరోగ్య రంగంపై మొదటి నుంచి చిన్నచూపు కారణంగా భారత్‌ పలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పీహెచ్‌సీలు, సెకండరీ, టెరిటరీ ఆరోగ్య కేంద్రాలను అవసరమైన దాని కంటే తక్కువగా ఉన్నాయి. గత రెండేళ్ల నుంచి వీటి కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యయాలు లేకపోవడంతో ప్రజలే తమ జేబు నుంచి వైద్య ఖర్చులు పెట్టుకొంటున్నారు. భారత్‌ ప్రజల వైద్య ఖర్చుల్లో 65శాతం సొంతంగా పెట్టుకొంటున్నారు. అదే చైనాలో 32శాతం, శ్రీలంకలో 38శాతం, థాయిలాండ్‌లో 11శాతం, నేపాల్లో 60శాతంగా ఉన్నట్లు 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 

మెరుగైన సౌకర్యాలతో సిద్ధం కావాలి..

* భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టైర్‌-2,3  పట్టణాల్లో ఆసుపత్రుల్లో అత్యాధునిక చికిత్స పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి. దీంతోపాటు పరీక్ష కేంద్రాలు, వెంటిలేటర్లు, ఐసీయూలు, క్రిటికల్‌ కేర్‌ సౌకర్యాలు వంటివి మెరుగుపర్చాల్సి ఉంది. ముఖ్యంగా దేశంలో వ్యాధులను అదుపులోకి తీసుకురావాలంటే పరీక్షా కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలి. వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే.. అంత వేగంగా వ్యాప్తిని అరికట్టవచ్చని కొవిడ్‌ నిర్వహణలో  తేలిన అంశం.

* కొవిడ్‌ కొత్త వేరియంట్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జన్యు క్రమ విశ్లేషణ, జన్యు పరిశోధనలపై భారత్‌ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఇప్పటి వరకు సేకరించిన కొవిడ్‌ నమూనాల్లో కేవలం 0.2శాతం మాత్రమే జన్యువిశ్లేషణలకు నోచుకొన్నాయి. ఇది కనీసం 5శాతంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అప్పుడే కొత్త వేరియంట్లను, వేవ్‌లను సమర్థంగా అడ్డుకోగలం.  

* ఆసుపత్రుల్లో కీలక పరికరాల కొనుగోళ్లలో జీఎస్‌టీ, ఇతర సుంకాలు, పన్నులను తగ్గించాలి. వైద్య పరికరాలు అత్యంత ఖరీదైనవి కావడంతో వీటి కొనుగోళ్లకు ప్రభుత్వం తక్కువ వడ్డీరేట్లకే రుణాలు ఇవ్వాలి. ఈ చర్యల వల్ల రోగులకు కూడా తక్కువ ధరలకే మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు నిర్మించే వారికి పన్ను రాయితీలు వంటి లబ్ధిలను ఇవ్వాలి. ప్రభుత్వ సౌకర్యాలు మెరుగ్గా లేని చోట్ల ఇటువంటి నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తాయి. 

* 2024 నాటికి ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఇది భారత్‌లో వాస్తవ రూపం ధరించాలనంటే వైద్య సిబ్బంది స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అయ్యే ఖర్చుల్లో రాయితీలను ప్రభుత్వం కల్పించాలని కోరారు. 

* ప్రాణ రక్షక ఔషధాలపై జీఎస్టీ రేటును గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. 

* కొవిడ్‌ వ్యాప్తి పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేయాలి. అంతేకాదు.. అవసరమైన రెండు బూస్టర్‌ డోసులకు బడ్జెట్‌లో ఏర్పాట్లు చేయాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని