వాహనాల్లో ఇథనాల్‌ ఫ్లెక్స్‌ ఇంజిన్‌లు

వాహనాల్లో ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజిన్‌ల వాడకాన్ని భారత్‌ అనుమతించనుంది. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌తో కాకుండా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఇంధనాలతో ఈ వాహనాలు నడుస్తాయి.

Updated : 29 Jun 2021 02:11 IST

3 నెలల్లో పథకాన్ని తీసుకొస్తాం

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

ముంబయి: వాహనాల్లో ఇథనాల్‌ ఆధారిత ఫ్లెక్స్‌ ఇంజిన్‌ల వాడకాన్ని భారత్‌ అనుమతించనుంది. సంప్రదాయ పెట్రోల్‌, డీజిల్‌తో కాకుండా స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత ఇంధనాలతో ఈ వాహనాలు నడుస్తాయి. వచ్చే మూడు నెలల్లో దీనికి సంబంధించి ఒక పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. బ్రెజిల్‌, అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఫ్లెక్స్‌ ఇంజిన్లు ఉన్నాయని, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌, టయోటా వంటి సంస్థలు ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయని వెల్లడించారు. ముడిచమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌ వంటి దేశాలు ఇథనాల్‌తో నడిచే వాహనాలకు మారితే ప్రయోజనకరమని గడ్కరీ అభిప్రాయపడ్డారు. వీటి వల్ల కాలుష్యం, ఖర్చులు తగ్గుతాయని అన్నారు. లీటర్‌ పెట్రోల్‌ రూ.100తో పోలిస్తే లీటర్‌ ఇథనాల్‌ రూ.60-62కే లభిస్తుందని, ఇథనాల్‌ కెలోరిఫిక్‌ విలువ కూడా తక్కువ అని పేర్కొన్నారు. ఇండియన్‌ బ్యాంక్‌ నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. 100 శాతం ఇథనాల్‌ పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇవ్వడం ప్రారంభించిందని, మహారాష్ట్రలోని పుణెలో ఇప్పటికే రెండు బంకులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని వెల్లడించారు. ‘చెరుకురసం మొలాసిస్‌ నుంచి ఇథనాల్‌ తయారు చేయొచ్చు. ఇప్పుడు బియ్యం, మొక్కజొన్న, ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్‌ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు ముందుండి నడిపించాల్సి ఉంటుంద’ని గడ్కరీ తెలిపారు. ఇథనాల్‌తో నడిచే ద్విచక్రవాహనాలను టీవీఎస్‌, బజాజ్‌ వంటి భారతీయ వాహన సంస్థలు అభివృద్ధి చేశాయని, మిగతా సంస్థలు కూడా సొంత మోడళ్లను తీసుకురావాలని పిలుపునిచ్చారు.


ప్రపంచంలోనే అత్యంత లాభదాయక విలాస కార్ల సంస్థ కావడమే లక్ష్యం

జేఎల్‌ఆర్‌ సీఈఓ థియర్రీ బొల్లొరే

దిల్లీ: టాటా మోటార్స్‌ యాజమాన్యంలోని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను (జేఎల్‌ఆర్‌) ప్రపంచంలోనే అత్యంత లాభదాయక విలాస కార్ల తయారీదారుగా మార్చడమే తమ లక్ష్యమని జేఎల్‌ఆర్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) థియర్రీ బొల్లొరే వెల్లడించారు. టాటా మోటార్స్‌ వాటాదార్లను ఉద్దేశించి 2020-21 వార్షిక నివేదికలో ఆయన పలు వివరాలు తెలిపారు. ‘ప్రాఫిట్‌-ఓవర్‌-వాల్యూమ్‌’ విధానం ద్వారా విలువ సృష్టిపై దృష్టి పెట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రెండంకెల ఎబిటా మార్జిన్‌ సాధించడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత లాభదాయక విలాస కార్ల తయారీ సంస్థగా జేఎల్‌ఆర్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సెమీ కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోందని, దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2039 నాటికి నికరంగా కర్బన రహితంగా మారేందుకు వ్యూహం సిద్ధం చేసినట్లు తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 6 కొత్త ఎలక్ట్రిక్‌ ల్యాండ్‌ రోవర్‌ మోడళ్లను తీసుకొస్తామని, 2025 నాటికి జాగ్వార్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్‌ బ్రాండ్‌గా మారుస్తామని థియర్రీ వివరించారు.


సంక్షిప్తంగా

* ఇన్‌స్టామోజోలో ఈక్విటీ వాటాను అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం మాస్టర్‌కార్డ్‌ వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి కార్మికులకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌గా ఇన్‌స్టామోజో సేవలందిస్తోంది. 

* ఒక గని నిర్వహణ, అభివృద్ధి నిమిత్తం కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ నుంచి రూ.9,294 కోట్ల ఆర్డరును పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ దక్కించుకుంది.

* భారత్‌లో కొవిడ్‌ ఉపశమన చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకు 800కు పైగా వెంటిలేటర్లను అందించేందుకు ప్రోసస్‌, జాన్సన్‌ ఫౌండేషన్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఫ్యామిలీ ఆఫ్‌ కంపెనీలతో కూటమి కట్టినట్లు ఫిలిప్స్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. అన్ని సంస్థలు ఇందుకు ఆర్థిక సహకారం అందించనున్నాయి.

* పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ఔషధ పరికరాల తయారీ సంస్థ స్కన్‌రే టెక్నాలజీస్‌ ప్రాథమిక పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ.400 కోట్ల వరకు తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ పద్ధతిలో 14,106,347 ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు విక్రయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని