Updated : 01 Apr 2022 10:00 IST

New tax rules: ఎన్‌పీఎస్‌, ఐటీఆర్‌, ఈపీఎఫ్‌.. నేటి నుంచి వస్తోన్న మార్పులివే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఎన్‌పీఎస్‌, ఈపీఎఫ్‌, ఐటీఆర్‌కు సంబంధించి నిబంధనల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులేంటో చూసేయండి...

  • ఎన్‌పీఎస్‌ ఇక వారికీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైతం నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(NPS)లో మదుపు చేసుకోవచ్చు. బేసిక్‌ శాలరీ నుంచి 14 శాతం వరకు ఈ స్కీమ్‌లో మదుపు చేసే వెసులుబాటు ఏప్రిల్‌ 1 నుంచి అందుబాటులోకి వస్తోంది.
  • 75 ఏళ్ల పైబడిన వారికి ఊరట: 75 ఏళ్లు దాటిన వయో వృద్ధులు ఐటీ రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు పొందొచ్చు. పింఛను ఆదాయం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఒకే బ్యాంకు నుంచి పొందే 75 ఏళ్ల పైబడిన వృద్ధులు ఇకపై ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన అవసరం లేదు. పింఛను డిపాజిట్‌ అయ్యే బ్యాంకులోనే వడ్డీ ఆదాయం కూడా ఉంటేనే ఈ మినహాయింపు లభిస్తుంది.
  • తప్పుల సవరణకు అవకాశం: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఏవైనా తప్పులుంటే అప్‌డేట్‌ చేసిన ఐటీఆర్‌ రిటర్నులను ఫైల్‌ చేసుకునే సదుపాయం కొత్త ఏడాదిలో అందుబాటులోకి వస్తోంది. పన్ను మదింపు సంవత్సరం నుంచి రెండేళ్ల పాటు సవరణలకు అవకాశం ఉంటుంది.
  • క్రిప్టోపై పన్ను: క్రిప్టో, డిజిటల్‌ ఆస్తులపై 30 శాతం పన్ను ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. క్రిప్టో కరెన్సీని గిఫ్ట్‌గా ఇచ్చినా ఇదే పన్ను వర్తిస్తుంది. ఒకవేళ వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల్లో నష్టాలు వచ్చినా సర్దుబాటు చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం నిబంధన విధించింది.
  • దీర్ఘకాలిక లాభాలపై కొత్త నిబంధన: దీర్ఘకాలిక మూలధన లాభాలపై కొత్త నిబంధన అమల్లోకి రానుంది. గతంలో కేవలం ఈక్విటీ షేర్ల అమ్మకాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌పై మాత్రమే 15 శాతం సర్‌ఛార్జి విధించేవారు. ఇప్పుడు ఈ పరిమితిని అన్ని ఆస్తులకూ వర్తింపజేశారు.
  • ఈపీఎఫ్‌ మొత్తాలపై పన్ను: ఈపీఎఫ్‌ మొత్తాలపై ఒకటో తేదీ నుంచి నూతన పన్ను విధానం అమల్లోకి రానుంది. ఎవరైనా ఉద్యోగి ఏడాదిలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేస్తే వారి పేరిట ట్యాక్సబుల్‌, నాన్‌ ట్యాక్స్‌బుల్‌ అనే రెండు ఖాతాలు నిర్వహిస్తారు. రూ.2.5 లక్షలు మించిన మొత్తాలను ట్యాక్సబుల్‌ ఖాతాలో జమచేసి వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు.
  • కేవైసీ చేసుకోకుంటే: బ్యాంక్‌ అకౌంట్‌ కలిగిన వ్యక్తిగత వినియోగదారులు కేవైసీ చేసుకోకుంటే ఏప్రిల్‌ 1 నుంచి తమ ఖాతాల్లో నగదు డిపాజిట్‌ లేదా ఉపసంహరణ చేసుకోవడానికి వీలు పడదు.
  • హోమ్‌లోన్‌ డిడక్షన్‌కు నో ఛాన్స్‌: గృహ రుణం ద్వారా మొద‌టిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం- 1960 సెక్షన్‌ 80ఈఈఏ కింద ల‌భించే ప‌న్ను ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి నిలిచిపోనుంది. సరసమైన ధరలో ఇళ్లను కొనుగోలు చేసే వారికి స‌హాయ‌ప‌డేందుకు 2019 బ‌డ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ మిన‌హాయింపును ప్రవేశపెట్టింది. 2022 బ‌డ్జెట్‌లో పొడిగింపునకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు.
  • కొత్త వడ్డీరేట్లు రేపే: ప్రధాన మంత్రి వయ వందన యోజన వడ్డీ రేటును కేంద్రం ఏప్రిల్‌ 1న నిర్ణయించే అవకాశం ఉంది. 2020-21లో ఈ స్కీమ్‌కు 7.4 శాతం వడ్డీని నిర్ణయించారు. అప్పటి నుంచి అదే వడ్డీని కొనసాగిస్తున్నారు.
  • టీడీఎస్‌ కొత్త రూల్‌: రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైన వ్యవసాయేతర స్థిరాస్థి కొనుగోలు విషయంలో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త టీడీఎస్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రూ.50 లక్షల కంటే ఎక్కువ కొనుగోలు చేస్తుంటే 1 శాతం టీడీఎస్‌ మినహాయించి మిగిలినది చెల్లించాలి. గతంలో కొనుగోలుదారు విక్రేతకు చెల్లించే డబ్బుపై పన్ను విధించేవారు.
Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని