పదవీ విరమణ తర్వాత రెగ్యులర్‌గా ఆదాయం పొందేందుకు ఉన్న పెట్టుబడి మార్గాలు

సీనియర్ సిటిజన్లకు జీతం ఆదాయం ఉండదు కాబట్టి నెలవారీగా క్రమమైన ఆదాయం వచ్చేట్లు ఏర్పాటు చేసుకోవడం అవసరం

Updated : 19 Jan 2022 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీనియర్ సిటిజన్లకు జీతం, ఆదాయం ఉండదు కాబట్టి నెలవారీగా క్రమమైన ఆదాయం వచ్చేట్లు ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఇందుకోసం పెట్టుబ‌డులు పెట్టాలి. అయితే వయసు రీత్యా రిస్క్ తీసుకునే సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి రాబడితో పాటు పెట్టుబడులకు భద్రత కూడా ముఖ్యమే. అందువల్ల న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉన్న పెట్టబడులు ఎంచుకోవాలి. అలాగే క్ర‌మ‌మైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు, సులభంగా నిర్వహించగలిగేలా పెట్టుబ‌డులు ఉండాలి. అలాంటి మార్గాల‌ను ఇప్పుడు చూద్దాం.. 

1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు: బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడులు సురక్షితంగా ఉండటంతో పాటు కచ్చితమైన రాబడిని అందిస్తాయి. పదవీ విరమణ కోసం డబ్బు దాచుకోవాలనుకుంటున్న వారికి ఇది సరైన ఆప్షన్. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వేరు వేరు బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు కొంచెం అధికంగా వ‌డ్డీ రేట్లు ఆఫ‌ర్ చేస్తున్నాయి బ్యాంకులు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు పోస్టాఫీస్, బ్యాంకింగేతర సంస్థలు కూడా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్ చేస్తాయి. అయితే కార్పొరేట్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రాబడిపై ఎలాంటి హామీ ఉండదు.

2. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్: సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో పెట్టుబడులు కేవలం 60 ఏళ్ల తర్వాతనే ప్రారంభించాలి. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పదవీ విరమణ తీసుకున్నవారు 55 సంవత్సరాల నుంచే ప్రారంభించొచ్చు. ఒకరు లేదా ఉమ్మడిగా ఈ ఖాతాలో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. సెక్షన్ 80సీ కింద దీనిపై పన్ను మినహాయింపులు లభిస్తాయి. ప్ర‌స్తుత వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.

3. పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్: ప్రస్తుత వడ్డీ రేటు 6.60 శాతం. దీనికి మెచ్యూరిటీ గడువు 5 సంవత్సరాలు. వ్యక్తిగత ఖాతాలో అయితే గరిష్ఠంగా రూ.4.50 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే రూ.9 లక్షలు పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే రాబడిపై పన్ను రేట్లు వర్తిస్తాయి.

4. నెలవారీ ఆదాయ ప్రణాళికలు: ఎంఐపీ పెట్టుబడులు ఎక్కువగా డెట్ ఫండ్లలోకి చేరతాయి. పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు పదవీ విరమణ పొందేవారికి ఇది సరైన ఆప్షన్. రిస్క్ తక్కువగా ఉండటంతో పాటు లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా డివిడెండ్లను అందిస్తుంది. ఎవరైతే తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితంగా దాచుకొని నెలవారీగా కొంత ఆదాయం పొందాలనుకుంటున్నారో వారికి ఇది సరైన మార్గం. 

5. ఈక్విటీ పెట్టుబడులు: రిటైర్మెంట్ కోసం ప్రణాళిక వేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా లేదా నేరుగా ఈక్విటీలలో పెట్టుబడులు పెట్టొచ్చు. మొదటిసారిగా మదుపు చేసేవారు మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టడం మేలు. రిస్క్ తీసుకునే శాతాన్ని బట్టి ఈక్విటీ కేటాయింపులు ఉంటాయి. అయితే 20 నుంచి 25 శాతం వరకు పదవీ విరమణ నిధిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెడితే లాభాలను పొందొచ్చు.

6. మ్యూచువల్ ఫండ్లు: మ్యూచువల్ ఫండ్లు.. నిపుణుల నిర్వహణలో ఉండటంతో ఇవి చాలా సురక్షితమైనవిగా చెప్పుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగతంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని (ఎస్‌డబ్ల్యూపీ) ఎంచుకుంటే గడువు పెరిగిన కొద్దీ ఆదాయం పెరుగుతూ వస్తుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు అధిక ద్రవ్యోల్బణాన్ని కూడా తట్టుకొని దీర్ఘకాలానికి మంచి లాభాలను అందిస్తాయి. ఎస్‌డబ్ల్యూపీలో వాయిదాల పద్ధతిలో డిపాజిట్ చేస్తుండాలి. పదవీ విరమణ తర్వాత కార్పస్ లో నుంచి నెలవారీ విత్‌డ్రా చేసుకోవాలి.

7. పీపీఎఫ్: పీపీఎఫ్ పెట్టుబడులపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. అసలు, వడ్డీ రెండింటిపై పన్ను ఆదా చేసుకోవచ్చు. వార్షికంగా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో గరిష్ఠంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఖాతా నిర్వహణ కోసం వార్షికంగా కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులలోనూ పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. కాలపరిమితి పూర్తయిన అనంతరం కూడా 5 ఏళ్ల చొప్పున ఖాతాను కొనసాగించొచ్చు.

8. పన్ను రహిత బాండ్లు: మార్కెట్లో చాలా పన్ను రహిత బాండ్లు అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ నిధి కోసం పొదుపు చేస్తున్నవారికి కచ్చితమైన రాబడితో పాటు, పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే ఇందులో లిక్విడిటీ సదుపాయం తక్కవగా ఉంటుంది. లాక్-ఇన్ పీరియడ్ కాలం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఏదైనా అత్యవసర సమయంలో నిధిని తీసుకోవడం కష్టతరమవుతుంది. దీనిలో పెట్టుబడులకు కొంత ఆలోచించాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

9. జాతీయ పింఛను విధానం: ఉద్యోగులు పదవీ విరమణ వరకు ఇందులో పెట్టుబడులు చేస్తే ఆ తర్వాత రెగ్యులర్‌గా పెన్షన్ పొందేందుకు వీలుంటుంది. పదవీ విరమణ సమయంలో ఉద్యోగులు 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగతా 40 శాతాన్ని యాన్యుటీగా ఉపయోగిస్తారు. మంచి రాబడితో పెన్షన్ పొందగలరు. దీనిపై సెక్షన్ 80C కాకుండా మరో రూ. 50 వేల వరకు అదనంగా పన్ను మినహాయింపు ఉంటుంది.

10. యాన్యుటీ ప్లాన్లు: యాన్యుటీ ప్లాన్లు దీర్ఘకాలానికి సరిపడేవి. దీనిపై పన్ను వర్తిస్తుంది. ఇందులో ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించకుండా, రెగ్యులర్ చెల్లింపులకు అవకాశముంటుంది. యాన్యుటీ ప్లాన్లు రెండు రకాలు. డిఫర్డ్ యాన్యుటీ, ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్లు. డిఫర్డ్ యాన్యుటీలో ఒకేసారి ఎక్కవ మొత్తంలో లేదా రెగ్యులర్‌గా డిపాజిట్ చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన తర్వాత లేదా మెచ్యూరిటీ తర్వాత పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. ఇమ్మీడియట్ యాన్యుటీ ప్లాన్లలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పెట్టుబడులు పెట్టొచ్చు. పెన్షన్ కూడా అప్పటి నుంచే వస్తుంది. మదుపు చేసిన మొత్తంపై ఆధారపడి పెన్షన్ లభిస్తుంది. అయితే, చాలా వరకు ఇలాంటి ప్లాన్లలో అధిక చార్జీలు వసూలు చేస్తారు. కాబట్టి రాబడి తగ్గిపోతుంది. వీటి నుంచి దూరంగా ఉండడం మేలు. యాన్యుటీ ప్లాన్లు ఎంచుకునే ముందే అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని