క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేయ‌ని 10 అంశాలు 

క్రెడిట్ స్కోరు అంటే తెలియని కొత్త ప‌ద‌మేం కాదు. సంపాదించేవాళ్లు ఎప్పుడో ఒక‌సారి అవ‌స‌రానికి అప్పు చేస్తూనే ఉంటారు, తీరుస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోరును అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తాయని అంటారు..........

Updated : 16 Jan 2021 21:03 IST

క్రెడిట్ స్కోరు అంటే తెలియని కొత్త ప‌ద‌మేం కాదు. సంపాదించేవాళ్లు ఎప్పుడో ఒక‌సారి అవ‌స‌రానికి అప్పు చేస్తూనే ఉంటారు, తీరుస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ స్కోరును అనేక అంశాలు ప్ర‌భావితం చేస్తాయని అంటారు. అందుకే త‌క్కువ స్కోరులో ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఫ‌లితంగా భ‌విష్య‌త్‌లో రుణాల మంజూరు తిర‌స్క‌ర‌ణ‌కు గురికాకుండా చూసుకోవ‌చ్చు. ఐతే కొన్ని అంశాలు క్రెడిట్ స్కోరును ఏమాత్రం ప్ర‌భావం చేయ‌వు. వాటివ‌ల్ల ఎక్క‌డ స్కోరు త‌గ్గుతుందోననే చింత అవ‌స‌రం లేదు. అలాంటి ఓ 10 అంశాలను తెలుసుకుందామా!

* ఆదాయం - ఇది అన్నింటికంటే అపోహ. ఎంత ఎక్కువ ఆదాయం ఉంటే అంత మంచి క్రెడిట్ స్కోరు ఉంటుంద‌ని భావిస్తారు. అధిక ఆదాయం వ‌ల్ల అధిక క్రెడిట్ స్కోరు రారు. అప్పుల‌ను ఎలా నిర్వ‌హిస్తారు? వాటిని క్ర‌మంగా ఎలా చెల్లిస్తార‌న్న‌దానిపైనే ఈ స్కోరు ఆధార‌ప‌డి ఉంటుంది. త‌క్కువ ఆదాయం పొందేవారు సైతం ఎక్కువ క్రెడిట్ స్కోరును సాధించ‌వ‌చ్చు. ఇదంతా స‌రైన స‌మ‌యంలో బ‌కాయిల‌ను తీర్చ‌డం వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. అధిక ఆదాయం కేవ‌లం ఎక్కువ రుణ ప‌రిమితికి అర్హ‌త తెచ్చిపెట్ట‌గ‌ల‌దు.

* విద్యార్హ‌త‌ - ఎక్కువ క్వాలిఫికేష‌న్ ఉన్న వ్య‌క్తుల‌కు స్కోరు ఎక్కువ‌గా ఉంటుంద‌ని భ్ర‌మ‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. ఐఐఎం, ఐఐటీలు లేదా విదేశీ విశ్వ‌విద్యాల‌యాల్లో చ‌దివిన వారికి ఎక్కువ క్రెడిట్ స్కోరు ఉంటుందంటే పొర‌బ‌డిన‌ట్టే. ఎక్కువ విద్యార్హ‌త ఉన్న‌ప్ప‌టికీ కొన్ని వాయిదాల‌ను చెల్లించ‌క డీఫాల్ట్ అయితే మాత్రం రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే.

* వివాహ‌ హోదా - వివాహ‌మైన త‌ర్వాత భాగ‌స్వాములిద్ద‌రి క్రెడిట్ స్కోర్ల‌ను క‌లిపి చూస్తార‌ని అర్థంకాదు. ఎవ‌రి స్కోరు వారికే ఉంటుంది. వివాహం అయ్యాక మహిళల పేర్ల‌లో మార్పు ఉంటే ఈ విష‌యాన్ని సంబంధిత వ‌ర్గాల‌కు తెలియ‌ప‌రిస్తే అందుకు త‌గిన‌ట్టు కొత్త క్రెడిట్ రుణ చ‌రిత్ర కొత్త పేరుతో న‌మోద‌వుతుంది.

* క్రెడిట్ నివేదిక తెలుసుకోవ‌డం ద్వారా.. రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేసిన‌ప్పుడు రుణ‌దాత క్రెడిట్ నివేదికను తిర‌గేస్తే అది హార్డ్ ఎంక్వ‌యిరీగా ప‌రిగ‌ణిస్తారు. ఇది స్కోరు లెక్క‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ఐతే స్వ‌యంగా మ‌న‌మే క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకుంటే గ‌నుక ఎలాంటి ప్ర‌భావ‌మూ ఉండ‌దు. అప్పుడ‌ప్పుడూ సిబిల్ స్కోరును ప‌రిశీలిస్తూ ఉండ‌డం మంచిది. ఏవైనా తేడాలుంటే చ‌ర్య‌లు తీసుకునేందుకు అవ‌కాశ‌ముంటుంది.

*  డెబిట్ కార్డు లావాదేవీలు - క్రెడిట్ కార్డు బిల్లింగ్, చెల్లింపులు క్రెడిట్ నివేదిక‌లో న‌మోద‌వుతాయి. డెబిట్ కార్డులు నేరుగా బ్యాంకు పొదుపు ఖాతాతో అనుసంధాన‌మై ఉంటాయి. డెబిట్ కార్డుతో త‌క్ష‌ణం ఖాతాలోంచి డ‌బ్బు తీసుకోవ‌చ్చు. అదే క్రెడిట్ కార్డును ఉప‌యోగిస్తే తాత్కాలిక రుణం ల‌భించిన‌ట్ట‌వుతుంది. దీన్ని ఎంత కాలంలోగా తీరుస్తార‌నేది గ‌మ‌నిస్తారు. అదే డెబిట్ కార్డు లావాదేవీల‌తో నివేదిక‌ను రూపొందించ‌లేరు. అందుకే వీటిని స్కోరు గ‌ణ‌న‌లో ప‌రిగ‌ణించ‌రు. బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు - బ్యాంకులు రుణాల‌తో పాటు అనేక బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందిస్తుంటాయి.

*  పొదుపు ఖాతాలో లావాదేవీలు నెర‌ప‌డం, రుణ ఖాతాలో లావాదేవీల్లో ఒక‌దానితో మ‌రొక‌దానికి సంబంధ‌మే లేదు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పొదుపు ఖాతా నిర్వ‌హ‌ణ‌, డిపాజిట్ల‌పై వ‌డ్డీ చెల్లింపులు లాంటివేవీ సిబిల్ స్కోరును ప్రభావితం చేయ‌లేవు. క్రెడిట్ కార్డుల సంఖ్య‌ - క్రెడిట్ కార్డు ప‌రిమితిలో ఎంత మేర‌కు వాడుతున్నాం? తిరిగి ఎంత వ్య‌వ‌ధి లోపు చెల్లిస్తున్నాం? అనేదాన్ని బ‌ట్టే క్రెడిట్ స్కోరు లెక్కిస్తారు.

*  స్కోరు లెక్కింపుపై క్రెడిట్ కార్డుల సంఖ్య ప్ర‌భావం ఉండ‌బోదు. ఒక‌టికి మించి క్రెడిట్ కార్డులున్నంత మాత్రాన స్కోరు అమాంతం పెరిగిపోదు.. అలాగ‌ని త‌గ్గిపోదు. ఒక్క కార్డును క్ర‌మంగా వాడి దాని బిల్లులు స‌కాలంలో చెల్లించినా ఒక్క‌టే.. 5 కార్డుల‌తో ఇలా చేసినా ఒక్క‌టే. క్రెడిట్ వినియోగం 25 నుంచి 30శాతం ఉండేలా చూసుకోవాలి.

*  ప‌న్ను చెల్లింపు రికార్డులు - ప్ర‌త్య‌క్ష ప‌న్నులైనా, ప‌రోక్ష ప‌న్నులైనా స‌రైన స‌మ‌యంలో చెల్లించ‌డం బాధ్య‌త‌గా భావించాలి. ఐతే ఈ చెల్లింపులు క్రెడిట్ రేటింగ్‌పైన ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌వు. ఏదైనా బ్యాంకులో రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తే గ‌డ‌చిన కొన్నేళ్ల ప‌న్ను రిట‌ర్నుల ప‌త్రాలు సమ‌ర్పించ‌మ‌ని అడ‌గ‌వ‌చ్చు. ఐతే స్కోరు లెక్కింపు కోసం ప‌రిగ‌ణించ‌రు. రుణ ద‌ర‌ఖాస్తును స్వీక‌రించాలా, ర‌ద్దు చేయాలా అన్న‌ది బ్యాంకు విచ‌క్ష‌ణ పైన ఆధార‌ప‌డి ఉంటుంది.

* నిరుద్యోగిగా ఉండ‌డం - మంజూరు చేయాల్సిన రుణ మొత్తం వ్య‌క్తి ఆదాయాన్ని బ‌ట్టి ఉంటుంది. ఇది క్రెడిట్ స్కోరు పైన ప్ర‌భావం చూపించ‌దు. కొన్ని రోజులు నిరుద్యోగిగా ఉండ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరులో మార్పులు ఉండ‌క‌పోవ‌చ్చు.

*  ఇత‌ర బిల్లులు లేదా అద్దె చెల్లింపు - ఇత‌ర దేశాల్లో వ్య‌క్తి చెల్లించే యుటిలిటీ బిల్లులు, అద్దెల‌ను కూడా ప‌రిగ‌ణించి క్రెడిట్ స్కోరును లెక్కిస్తారు. ఇది ఎక్కువ‌గా రుణాల‌తో న‌డిచే ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన దేశాల్లో క‌నిపిస్తుంది. రుణం మంజూరు చేసేవాళ్లు స‌కాలంలో బిల్లులు, అద్దె చెల్లిస్తున్నార‌నే విష‌యంపై ఓ క‌న్నేసి ఉంచుతారు. ఈ ర‌క‌మైన విధానం మ‌న దేశంలో ఇంకా రాలేదు.

ఈ పైన పేర్కొన్న అంశాలేవీ క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేయ‌వు. కాబ‌ట్టి వీటి గురించి చింతించాల్సిన అవ‌స‌రం లేదు. క్రెడిట్ స్కోరును అప్పుడ‌ప్పుడు ప‌రిశీలిస్తూ ఉండ‌టం మంచిది. బ‌కాయి ప‌డ‌కుండా రుణాలను స‌రైన స‌మ‌యంలో తీర్చ‌డమూ ముఖ్యమే. ఇది క్రెడిట్ స్కోరును మెరుగుప‌ర్చుకోవ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని