Financial Planning: పిల్ల‌లు పుట్ట‌గానే త‌ల్లిదండ్రులు చేయాల్సిన 10 ముఖ్యమైన పనులు

పిల్ల‌లు పుట్ట‌గానే ప్ర‌తి ఒక్క‌రికీ, ఒక కొత్త జీవితం ప్రారంభ‌మ‌వుతుంది.

Updated : 24 Dec 2021 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలు పుట్టినప్పుడు ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. కొత్త బంధం పెనవేసుకుంటుంది. అదే సమయంలో తల్లిదండ్రులకు కొత్త బాధ్యతలు మొదలవుతాయి. చిన్నారుల భవిష్యత్‌ కోసం ఆలోచనలు ప్రారంభమవుతాయి. అందుకే కొత్తగా బిడ్డకు జన్మినిచ్చిన తల్లిదండ్రులు కొన్ని కర్తవ్యాలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరోగ్యం నుంచి ఆర్థికం వరకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. మీ చిన్నారి భవిష్యత్‌కు మంచి బాటలు వేయాలంటే.. ఈ విషయాల గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!

1. జీవిత బీమా: పిల్ల‌లు పుట్ట‌గానే ప్రతి ఒక్క‌రికీ ఒక కొత్త జీవితం, కొత్త బాధ్యతలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ బాధ్యతను స‌క్ర‌మంగా పూర్తిచేసేందుకు ప్ర‌స్తుత, భ‌విష్య‌త్‌ ఖ‌ర్చుల గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. పిల్ల‌ల‌కు సంబంధించిన ప్ర‌తిదీ ఉత్తమంగా ఉండాల‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటారు. ఇందుకోసం చాలా డ‌బ్బు కావాలి. సాధార‌ణంగా కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో సంపాదించే వ్య‌క్తి వారి పిల్ల‌ల‌కు అన్ని సౌక‌ర్యాల‌ను అందిస్తుంటారు. కానీ కుటుంబ పెద్ద‌కు అనుకోకుండా ఏమైనా జ‌రిగితే, జీవిత బీమా ఈ ఖ‌ర్చుల‌కు కావ‌ల‌సిన మొత్తాన్ని అందిస్తుంది. మీ జీవితంలోకి శిశువు వ‌చ్చిన‌ప్పుడు, మీరు నెర‌వేర్చ‌వ‌ల‌సిన బాధ్యతలు కూడా పెరుగుతాయి. అందువ‌ల్ల మీ మీద ఆధార‌ప‌డిన‌ కుటుంబ స‌భ్యుల సంఖ్య ఆధారంగా వారి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా జీవిత‌బీమాను పెంచుకోవాలి. ఒక‌వేళ ఇప్ప‌టివ‌ర‌కు మీరు జీవిత బీమాను కొనుగోలు చేయ‌క‌పోతే ఇప్ప‌టికిప్పుడే ఒక జీవిత‌బీమా పాల‌సీని తీసుకోండి. అది మీ ప్ర‌స్తుత వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్లు హామీ మొత్తం అందించేలా చూసుకోండి.

2. ఆరోగ్య బీమా కవర్: మీరు ఇప్పటికే ఆరోగ్య బీమా పథకాన్ని (స్వ‌యంగా కొనుగోలు చేసిన లేదా మీరు ప‌నిచేసే సంస్థ ద్వారా) తీసుకుని ఉంటే మీ పిల్లలు జన్మించిన వెంట‌నే వారిని కూడా పాలసీలో భాగం చేయండి. మీకు ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్య బీమా పాల‌సీ లేక‌పోతే ఓ కొత్త పాలసీ తీసుకోండి. అందులో మీ పిల్ల‌లను కూడా చేర్చండి. కొన్ని పాల‌సీలు మీకు కొత్త‌గా పిల్లలు జ‌న్మించిన వెంట‌నే, వాళ్లకు కూడా హామీని అందిస్తాయి. వీటి కోసం ప్ర‌త్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఫామిలీ ఫ్లోటర్ కాకుండా వ్యక్తి గత పాలసీలు ఉన్నట్టయితే మీ పిల్లల పేరు మీద కూడా వ్యక్తిగత పాలసీ తీసుకోవచ్చు.

3. రిక‌రింగ్ డిపాజిట్‌: ప్ర‌స్తుతం పిల్ల‌ల పాఠ‌శాల‌ ఖ‌ర్చులు ఒక సంవ‌త్స‌రానికి రూ.50 వేల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు ఉంటున్నాయి. ప్రీ స్కూలు ఫీజులు కూడా త‌ల్లిదండ్రుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. హైద‌రాబాద్ వంటి మెట్రో న‌గ‌రాల‌లో వార్షికంగా రూ.25 వేలు మొద‌లుకుని రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. మీకు ఇప్పుడు పాప లేదా బాబు జ‌న్మిస్తే.. వచ్చే 2 నుంచి 3 సంవ‌త్స‌రాల్లో మీకు ఈ ఖ‌ర్చులు ఎదుర‌వుతాయి. అందువ‌ల్ల మీరు ఇప్ప‌టి నుంచి అందుకు అయ్యే ఖ‌ర్చులను ఏర్పాటు చేసుకోవ‌ల‌సి ఉంటుంది. ఈ స్వ‌ల్పకాలిక ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు సుల‌భ‌మైన మార్గం బ్యాంకులో రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా తెర‌వ‌డం. ఈ ఖ‌ర్చుల నిమిత్తం మీకు రూ.45 వేలు కావాలి అనుకుంటే ఇందుకుగాను మీకు ఇప్ప‌టి నుంచి 30 నెల‌ల స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి మీరు ఒక రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాను తెరిచి నెల‌కు రూ.1500 డిపాజిట్ చేస్తే మీకు కావ‌ల‌సిన మొత్తం స‌మ‌కూరుతుంది.

4. నామినీ అప్‌డేట్‌: బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువ‌ల్ ఫండ్లు, మీ ఆస్తిలో కొంత భాగానికి కూడా మీ పిల్ల‌ల‌ను నామీనిగా నియ‌మించ‌వ‌చ్చు. ఇంత‌కు ముందే మీరు విల్లు రాసినట్లయితే శిశువు జ‌న్మించిన వెంట‌నే మీరు ఆ విల్లును పునరుద్ధరించొచ్చు. మీ పాప లేదా బాబు పేరును మీరు రాసిన విల్లులో అప్‌డేట్ చేయ‌డం మ‌ర్చిపోతే.. కొన్ని దుర‌దృష్టకరమైన సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు మీ పిల్ల‌లు వారికి చెందాల్సిన సంప‌ద‌ను కోల్పోయే అవ‌కాశం ఉంది. అందువ‌ల్ల పిల్ల‌లు పుట్టిన వెంట‌నే మీ ఆస్తుల‌కు, పెట్టుబ‌డుల‌కు సంబంధించిన నామీని వివ‌రాల‌ను అప్‌డేట్ చేయండి.
5. రిజిస్ట‌ర్డ్ బర్త్ స‌ర్టిఫికేట్‌: మీరు త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన పనుల్లో ఇది కూడా ఒక‌టి. శిశువు జ‌న్మించిన వెంట‌నే జ‌న్మ న‌మోదు ప‌త్రానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. దీనిని న‌మోదు చేసుకోవ‌డం చాలా సులభం. ప్రాసెస్‌ శిశువు పుట్టుక‌తోనే ప్రారంభ‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తు ఫార‌మ్‌ ఆసుప్ర‌తిలోనే పొందొచ్చు. శిశువు పుట్టిన 21 రోజుల్లోపు స్థానిక‌ అధికారుల‌కు అందించాలి.

6. పొదుపు ఖాతా: శిశువు పుట్టిన వెంట‌నే ఒక పొదుపు ఖాతాను తెరవడం మంచిది. ప్ర‌స్తుతం చాలా బ్యాంకులు పిల్ల‌ల‌కు కూడా పొదుపు ఖాతాలు అందిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు: ఐసీఐసీఐ యంగ్ స్టార్స్ పేరుతో పొదుపు ఖాతాను అందిస్తోంది. ఇందులో 1 రోజు నుంచి 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు గ‌ల పిల్లల పేర్ల మీద‌ ఖాతాను తెరువొచ్చు. పాప లేదా బాబు జ‌న్మించిన‌ప్పుడు న‌గ‌దు రూపంగా వ‌చ్చిన బ‌హుమ‌తులను పొదుపు చేసేందుకు, పిల్ల‌ల భ‌విష్య‌త్‌ కోసం మీరు చేసే పెట్టుబ‌డుల‌ను ఖాతాతో లింక్ చేసేందుకు ఈ ఖాతా ఉపయోగపడుతుంది. అలాగే, మీ పిల్లలు వారి జీవిత ప్రారంభం నుంచే బ్యాకింగ్‌, వ్య‌క్తిగ‌త ఫైనాన్స్‌ను నేర్చుకునేందుకు సైతం ఈ ఖాతా పనికొస్తుంది. 

7. దుస్తులు, బొమ్మ‌ల కొనుగోలు: కొత్త‌గా పాప లేదా బాబు జ‌న్మించిన‌ప్పుడు త‌ల్లిదండ్రులు వారికి సాధ్య‌మైనంతలో మంచి దుస్తులు, బొమ్మ‌లు పిల్ల‌ల‌కు ఇవ్వాల‌నుకుంటారు. ఆ ఉత్సాహంతో పిల్ల‌ల‌కు అవ‌స‌రంలేని వాటిని కూడా కొనుగోలు చేస్తుంటారు. పిల్ల‌లు జ‌న్మించిన‌ప్పుడు రోజులో ఎక్కువ శాతం నిద్ర‌పోతుంటారు. అలాగే తొంద‌ర‌గా పెరుగుతుంటారు. వారికి ఖ‌రీదైన దుస్తులు, బొమ్మ‌ల‌తో ప‌ని ఉండ‌దని, పాప పుట్టిన కొన్ని నెల‌లకుగానీ త‌ల్లిదండ్రులకు అర్థంకాదు. మీ బంధువులు, స్నేహితులు.. మీ పిల్ల‌ల‌ను చూసేందుకు వచ్చిన‌ప్పుడు చాలా వ‌స్తువుల‌ను తీసుకువ‌స్తుంటారు. ఈ లోపే మీరు వాటిని కొనుగోలు చేసి ఉండడం వల్ల ఎక్కువ మొత్తం వృథా అవుతుంది. అందుకే పిల్ల‌ల‌కు అవ‌స‌ర‌మైన వ‌స్తువులను నిదానంగా ఆలోచించి కొనుగోలు చేయండి.

8. పిల్ల‌ల ప‌థ‌కాలు: పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్‌ను అందించ‌డం గురించే ఆలోచిస్తూ ఉంటారు త‌ల్లిదండ్రులు. ఇలాంటి స‌మ‌యంలో చాలా మంది ఏజెంట్లు వివిధ ర‌కాలైన పెట్టుబ‌డులను తీసుకోవాలని స‌ల‌హా ఇస్తుంటారు. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్‌ కోసం ఇది మంచి బ‌హుమ‌తి, మీ పిల్ల‌ల జీవితానికి ఇది ఒక మంచి ఆరంభం వంటి మాట‌లతో చాలా మంది బీమా ఏజెంట్లు చైల్డ్ ప్లాన్ల‌ను విక్ర‌యించేందుకు చూస్తుంటారు. ఈ విధ‌మైన ప్లాన్లు త‌ల్లిదండ్రులను ఆక‌ర్షించేందుకు రూపొందిస్తారు. కానీ ఈ ప్లాన్లు క్ర‌మ చెల్లింపుల‌తో బీమా, పెట్టుబ‌డులు స‌మ్మేళ‌నంగా ఉంటాయి. ఇవి యులిప్స్‌, సంప్రదాయ బీమా ప‌థ‌కాల మాదిరిగా ఉంటాయి. బీమా తక్కువ, రాబడి తక్కువ, అలాగే ప్రీమియం కూడా చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ఇలాంటి పథకాల నుంచి దూరంగా ఉండడం మేలు.

9. 24 గంట‌ల‌ వైద్య‌స‌దుపాయాలు: శిశువు జ‌న్మించిన 1 నుంచి 2 సంవ‌త్స‌రాల వ‌ర‌కు వైద్య ఖ‌ర్చులు అధికంగానే ఉంటాయి. వైద్యుడిని ఎక్కువ‌గా సంప్ర‌దించాల్సి వస్తుంది. ఒక్కోసారి అత్య‌వ‌స‌రంగా సంప్ర‌దించాల్సి రావొచ్చు. అందువ‌ల్ల మీరు నివ‌సించే స్థ‌లం నుంచి 5 నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో వైద్యుడు అందుబాటులో ఉండేట్లు చూసుకోవాలి.

10. ఎమ‌ర్జ‌న్సీ కిట్: చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్ర‌దిస్తూ ఉంటే స‌మ‌యం, డ‌బ్బు రెండూ వృథా అవుతాయి. ప్ర‌తిసారీ వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అత్య‌వ‌స‌ర సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని