EPFO: డిసెంబ‌రు 2021లో 14.6 ల‌క్ష‌ల చందాదారుల చేరిక‌

డిసెంబ‌రు నెల‌లో 14.6 ల‌క్ష‌ల మంది చందాదారులు ఈపీఎఫ్‌లో చేరార‌ని  కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 

Updated : 21 Feb 2022 15:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో 2021 డిసెంబ‌రు నెల‌లో 14.6 ల‌క్ష‌ల మంది చందాదారులు చేరార‌ని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఈ సంఖ్య అంత‌కు ముందు డిసెంబ‌రు నెల‌లో చేరిన చందాదారుల‌ (12.54 ల‌క్ష‌లు)తో పోలిస్తే 16.4 శాతం అధికమ‌ని పేర్కొంది.

కార్మిక మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన స్టేట్‌మెంట్ ప్రకారం 2021, న‌వంబ‌రుతో పోల్చి చూస్తే చందాదారుల సంఖ్య‌ 2021 డిసెంబ‌రు నెల‌లో 19.98శాతం పెరిగింది. 14.60 ల‌క్ష‌ల మంది చందాదారుల‌లో 9.11 ల‌క్ష‌ల మంది ఈపీఎఫ్ఓ & ఎమ్‌పీ చ‌ట్టం, 1952 కింద మొద‌టిసారి న‌మోదు చేసుకున్న వారే. ఈపీఎఫ్ఓలో తిరిగి చేరిన స‌భ్యులు దాదాపు 5.49 ల‌క్ష‌ల మంది. వీరు మునుప‌టి పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని ప్ర‌స్తుత ఖాతాకు బ‌దిలీ చేసుకుని ఈపీఎఫ్ఓ ఖాతాను కొన‌సాగిస్తున్న‌వారు. 

తాజా గ‌ణాంకాల ప్రకారం 2021 డిసెంబ‌రులో న‌మోదు చేసుకున్న స‌భ్యుల‌లో 22-25 సంవత్సరాల మ‌ధ్య‌ వయస్సు గలవారు అత్య‌ధికంగా 3.87 లక్షల మంది ఉండ‌గా, 18-21 సంవత్సరాల వయస్సు గల వారు కూడా దాదాపు 2.97 లక్షల మంది ఉన్నారు. డిసెంబర్ 2021లో 18-25 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉన్న‌వారి వాటా 46.89 శాతంగా ఉంది. 

ఈపీఎఫ్ఓ.. ఉద్యోగుల ప‌ద‌వీవిర‌మ‌ణ‌పై ప్రావిడెంట్ ఫండ్‌, పెన్ష‌న్ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఒక‌వేళ చందాదారుడు అకాల మ‌ర‌ణం చెందితే కుటుంబ స‌భ్యుల‌కు పింఛను, బీమా స‌దుపాయాల‌ను అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని