Tax payers: పెరిగిన పన్ను చెల్లింపుదారుల్లో ప్రభుత్వ ఉద్యోగులే అధికం!

Tax payers: మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో గణనీయ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులే ఉంటున్నారు. గత కొన్నేళ్లుగా వీరి వాటా సైతం పెరుగుతోంది.

Published : 28 Mar 2023 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దేశంలో పన్ను చెల్లింపుదారుల (Tax payers) సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా చాలా మంది పన్ను పరిధిలోకి వచ్చారు. దీంతో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే, ప్రైవేటు వ్యక్తులతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య పెరగడం గమనార్హం. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 19 శాతం వీరే ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభకు సమర్పించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం 6.8 కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. ఇందులో 1.3 కోట్ల రిటర్నులు ప్రభుత్వ, ఉద్యోగులే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో 19 శాతం వాటా వీరిదే కావడం గమనార్హం. అంటే ప్రతి ఐదో పన్ను చెల్లింపుదారుడు ప్రభుత్వ ఉద్యోగో, పెన్షనరో కావడం గమనార్హం. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2012-13 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తంగా దాఖలైన రిటర్నుల్లో వీరి వాటా 10 శాతం కాగా.. 2018-19 నాటికి 20 శాతానికి చేరింది.

ఆదాయపు పన్ను నుంచి తప్పించుకోవడానికి వీల్లేకుండా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య  నానాటికీ పెరుగుతోంది. పెద్దమొత్తంలో లావాదేవీలపై దృష్టి సారించడంతో ఇది సాధ్యమవుతోంది. ఈ విధంగా 2013-14 నుంచి చూస్తే మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.4 రెట్లు పెరగ్గా.. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య ఏకంగా 4.5 రెట్లు పెరగడం గమనార్హం. మొత్తం పన్ను చెల్లింపుదారుల్లో వీరి వివరాలను ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. అయితే, అక్రమ ఆదాయాన్ని గుర్తించిన కారణంగా ఎంత మంది పన్ను చెల్లింపుదారులు పన్ను పరిధిలోకి వచ్చారన్న వివరాలను మాత్రం ఇప్పటి వరకు వెలువరించకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని