Diwali crackers: ఈ దీపావళికి ‘ఢాం.. ఢాం’ అంతంతే.. కారణమేంటంటే?

ఈ సారి దీపావళికి టపాసుల ‘ఢాం.. ఢాం’ శబ్దం పరిమితంగానే ఉండనుంది. దేశవ్యాప్తంగా మూడింట రెండొంతుల కుటుంబాలు ఈ సారి టపాసులు కాల్చేందుకు ప్రణాళికలు

Published : 02 Nov 2021 19:00 IST

దిల్లీ: ఈ సారి దీపావళికి టపాసుల ‘ఢాం.. ఢాం’ శబ్దం పరిమితంగానే ఉండనుంది. దేశవ్యాప్తంగా మూడింట రెండొంతుల కుటుంబాలు ఈ సారి టపాసులు కాల్చేందుకు ప్రణాళికలు వేసుకోకపోవడమే ఇందుకు కారణం. పర్యావరణ కాలుష్యం, బాణసంచాపై నిషేధం వంటివి ఇందుకు కారణాలని ఓ సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 371 జిల్లాల్లో సామాజిక మాధ్యమం ‘లోకల్‌ సర్కిల్స్‌’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం 28 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 42 శాతం మంది కుటుంబాలు బాణసంచాపై నిషేధానికి అనుకూలతను వ్యక్తంచేయగా.. 53 శాతం మంది వ్యతిరేకించారు.

దీపావళి రోజున టపాసులు కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యానికి కారణమవ్వడంతో పాటు, పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అనవసరమని భావిస్తున్నట్లు పలు కుటుంబాలు అభిప్రాయం వ్యక్తంచేశాయి. కొవిడ్‌-19 కారణంగా కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మరణించడం, మరికొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ కొవిడ్‌తో బాధపడుతున్న వారు ఉండడం, ఇతర అనారోగ్య కారణాల వల్ల తాము ఈ దీపావళికి దూరంగా ఉంటున్నట్లు సర్వేలో కొందరు తెలిపారు. జీవనోపాధి కోల్పోవడం వల్ల ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నట్లు 2-3 శాతం మంది అభిప్రాయం వెలిబుచ్చడం కొవిడ్‌ మిగిల్చిన సంక్షోభానికి అద్దం పడుతోంది.

ఇక టపాసుల విషయానికొస్తే.. మొత్తంగా మూడింట రెండొంతుల కుటుంబాలు ఈ దీపావళికి టపాసులకు దూరంగా ఉంటున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. ఈ ప్రశ్నకు 9,263 మంది సమాధానం ఇచ్చినట్లు లోకల్‌ సర్కిల్‌ తెలిపింది. 45 శాతం మంది పూర్తిగా ఎలాంటి టపాసులూ కాల్చడం లేదని పేర్కొనగా..  మరో 15 శాతం మంది కేవలం హరిత టపాసులే కాల్చనున్నట్లు తెలిపారు. 11 శాతం మంది కాకరపువ్వొత్తులే తప్ప.. టపాసుల జోలికి పోవడం లేదని పేర్కొన్నారు. మరో ఆరు శాతం మంది బాణసంచా కాలుస్తామని పేర్కొన్నారు. తమ జిల్లా/ నగరంలో బాణసంచాపై నిషేధం విధించడం వల్ల టపాసులు అందుబాటులో లేవని 5 శాతం మంది పేర్కొనగా.. 10 శాతం మంది ఎలాంటి స్పందనా తెలియజేయలేదని లోకల్‌ సర్కిల్స్‌ పేర్కొంది. 

టపాసులపై వెచ్చించడాన్ని అనవసర ఖర్చుగా భావించడమే కాకుండా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నామని తాము భావిస్తున్నట్లు 42 శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. మరో 53 శాతం మంది మాత్రం బాణసంచా మాత్రమే కాలుష్యానికి కారణం కావు కాబట్టి ఆంక్షలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో 63 శాతం మంది పురుషులు పాల్గొనగా.. 37 మంది స్త్రీలు పాల్గొన్నారు. టైర్‌-1 నగరాల నుంచి 41 శాతం మంది, టైర్‌-2 నగరాల నుంచి 33 శాతం మంది, టైర్‌-3, చిన్న పట్టణాల నుంచి 26 శాతం మంది సర్వేలో భాగస్వాములయ్యారని సర్వే నివేదిక వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని