Banking: 2022 నుంచి బ్యాంకింగ్ సేవ‌ల‌లో వ‌చ్చే ఈ 3 మార్పులు గ‌మ‌నించండి!

ప‌రిమితికి మించి చేసే ఏటీఎమ్‌ లావాదేవీల‌పై విధించే ఛార్జీలు వ‌చ్చే ఏడాది నుంచి పెరిగే అవ‌కాశ‌ముంది.

Published : 28 Dec 2021 14:12 IST

కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నాం. ఏటీఎమ్ ఛార్జీల ద‌గ్గ‌ర నుంచి బ్యాంకు లాక‌ర్ల వ‌ర‌కు 2022 జ‌న‌వ‌రి నుంచి అమ‌లులోకి రానున్న కొత్త రూల్స్‌ని తెల‌సుకుంటే.. లావాదేవీలను స‌రైన విధంగా ప్లాన్ చేసుకోవ‌చ్చు. 

బ్యాంకుల‌దే భాద్య‌త‌..
జ‌న‌వ‌రి 2022 నుంచి బ్యాంకు త‌ప్పిదం కార‌ణంగా లాకర్‌ పాడైతే.. బ్యాంకులే భాద్య‌త వ‌హించాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌ల‌ను తీసుకొచ్చింది.  లాకర్ ఉన్న భవనం కూలిపోయినా, అగ్ని ప్ర‌మాదం, దొంగతనం జ‌రిగినా, బ్యాంక్ ఉద్యోగి మోసం చేయ‌డం వ‌ల్ల లాక‌ర్‌లో భ‌ద్ర‌ప‌రిచిన వ‌స్తువులు పోయినా, బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద నుంచి వ‌సూలు చేసిన వార్షిక లాక‌ర్ అద్దెకు 100 రెట్ల‌కు స‌మాన‌మైన మొత్తాన్ని న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల్సి ఉంటుంది.  అందువ‌ల్ల లాక‌ర్ల సెక్యూరిటీ విష‌యంలో బ్యాంకులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హారించాలి.  అయితే ప్ర‌కృతి వైప‌రిత్యాలు కారణంగా అంటే.. భూకంపాలు, వ‌ర‌ద‌లు, తుఫానులు, పిడుగుల కారణంగా నష్టపోయినప్పుడు, అలాగే వినియోగ దారుని కార‌ణంగా న‌ష్టం వాటిల్లిన‌ప్పుడు బ్యాంకులు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. 

లాక‌ర్ తీసుకునేవారు లాక‌ర్ అద్దె ఛార్జీలను సకాలంలో చెల్లించాలి. కొత్త నిబంధ‌న‌ల ప్రకారం లాకర్లను కేటాయించేట‌ప్పుడు కొత్త కస్టమర్ల నుంచి ట‌ర్మ్ డిపాజిట్‌ను పొంద‌డానికి ‘ఆర్‌బీఐ’ బ్యాంకులకు అనుమతిచ్చింది. అయితే  ప్ర‌స్తుతం ఉన్న లాక‌ర్ హోల్డ‌ర్ల‌కు, ఖాతాలో స‌రిప‌డినంత బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న వారికి ఇది త‌ప్ప‌నిస‌రికాదు. 

ఏటీఎమ్ ఛార్జీల పెంపు..
ప‌రిమితికి మించి చేసే లావాదేవీల‌పై విధించే ఛార్జీలు వ‌చ్చే ఏడాది నుంచి పెరిగే అవ‌కాశ‌ముంది. ఏటీఎమ్‌ల వ‌ద్ద నెల‌వారిగా బ్యాంకులు అందిస్తున్న‌ ఉచిత ప‌రిమితికి మించి చేసే న‌గ‌దు, న‌గ‌దుర‌హిత లావాదేవీలకు విధించే ఛార్జీలను జ‌న‌వ‌రి, 2022 నుంచి పెంచేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది జూన్‌లో అనుమితించింది.  న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌, బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఏటీఎమ్ పిన్ మార్చ‌డం, మినీ స్టేట్‌మెంట్ అభ్య‌ర్థ‌న‌, ఏటీఎమ్ ద్వారా అదే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ తెర‌వ‌డం వంటి లావాదేవీల‌ను మెట్రో, నాన్-మెట్రో న‌గ‌రాల‌లోని ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల వ‌ద్ద వ‌రుస‌గా 3,5 సార్లు ఉచిత లావాదేవీలు చేయ‌వ‌చ్చు. అయితే వ‌చ్చే నెల నుంచి ప్రతి అదనపు లావాదేవీకి సవరించిన రుసుము రూ. 21+జీఎస్‌టీ చెల్లించాలి. 

ఇండియా పోస్ట్ పేమెంట్ ఛార్జీలు..
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్.. డిపాజిట్‌, విత్‌డ్రా సేవ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఉచితంగా అందించింది. అయితే ప‌రిమితికి మించి చేసే లావాదేవీల‌పై జ‌న‌వ‌రి 1,2022 నుంచి ఛార్జీలు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు.. ప్రతి నెల 4 లావాదేవీల వ‌ర‌కు ఉచితంగా చేసుకోవ‌చ్చు. ఆ తర్వాత చేసే ప్ర‌తీ విత్ డ్రాకి..దాని విలువలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 ఛార్జ్‌ చేయనుంది. ఈ ఖాతాదారులకు డిపాజిట్ సేవ‌ల‌ను మాత్రం పూర్తి ఉచితంగా అందించనుంది. 

ఇతర పొదుపు, కరెంట్ ఖాతాదారులకు మాత్రం డిపాజిట్ల‌పైనా ఛార్జీలు వ‌ర్తిస్తాయి. నెల‌కు  రూ. 10వేల వ‌ర‌కు ఉచితంగా న‌గ‌దు డిపాజిట్ చేయ‌వ‌చ్చు. కానీ రూ. 10 వేల‌కు మించిన డిపాజిట్ల‌పై 0.50 శాతం లేదా క‌నీసం రూ. 25 ఛార్జీలు వ‌ర్తిస్తాయి. అలాగే  నెలకు రూ.25వేల వరకు విత్‌డ్రా చేసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత విత్‌డ్రా చేసుకునే మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 వరకు  చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని