Union Budget 2022: గతి ‘మార్చే’ శక్తి: 3 ఏళ్లలో 400 వందేభారత్‌ రైళ్లు

మౌలిక వసతుల సదుపాయాల రంగంలో ముఖ్యమైన రైల్వేల్లో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల కంటే వేగంతో దూసుకెళ్లే వందే భారత్‌ రైళ్లను మరిన్ని తేవాలని నిర్ణయించింది.

Updated : 01 Feb 2022 16:58 IST

బడ్జెట్‌లో మౌలిక వసతులకు కేటాయింపులివే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: మౌలిక వసతుల సదుపాయాల రంగంలో ముఖ్యమైన రైల్వేల్లో కీలక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలు, గంటకు 160 కిలోమీటర్ల కంటే వేగంతో దూసుకెళ్లే వందే భారత్‌ రైళ్లను మరిన్ని తేవాలని నిర్ణయించింది. ఇప్పటికే 100 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నద్ధం కాగా.. రాబోయే మూడేళ్లలో మరో 400 వందే భారత్‌ రైళ్లను తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తీసుకొస్తున్న నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా రహదారులు, రైల్వే, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయనున్నట్లు మంగళవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం 75 ఏళ్ల అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకొంటున్నామని, రాబోయే 25 ఏళ్ల అమృత్‌ కాలంలో సాధించాల్సిన లక్ష్యాల్లో భాగంగా గతి శక్తి కింద చేపట్టబోయే మౌలిక సదుపాయాల గురించి ఆమె ప్రస్తావించారు.

  1. రాబోయే మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్లను తీసుకురావడంతో పాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా 2000 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. 2022-23లో నాలుగు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టబోతున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పోస్టల్‌, రైల్వే నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.
  2. దేశంలో ఇప్పటికే జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరిగినట్లు ఆర్థిక సర్వే పేర్కొనగా.. 2022-23 నాటికి 25వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరగాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో తెలిపారు. రూ.20,000 కోట్లు దీనికి కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, రాబోయే మూడేళ్లలో పీఎం గతిశక్తి పథకం కింద వంద కార్గో టెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.
  3. ప్రధాని మంత్రి ఆవాస్‌ యోజన కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో పట్టణాలు, గ్రామాల్లో కలిపి మొత్తం 80 లక్షల ఇళ్లను పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనికోసం రూ.48వేల కోట్లు కేటాయించనున్నామన్నారు.
  4. ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ‘హర్‌ ఘర్‌ నల్‌ సే జల్‌’ పథకం కింద 8.7 కోట్ల కుటుంబాలకు ట్యాప్‌ నీరు అందుతోంది. కేవలం గత రెండేళ్లలోనే 5.5 కోట్ల కుటుంబాలకు తాగునీటి సదుపాయం కల్పించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 3.8 కోట్ల కుటుంబాలకు నల్లా ద్వారా తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
  5. కొవిడ్‌ మహమ్మారి వల్ల స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. వీరిని దృష్టిలో ఉంచుకుని పీఎం ఈ-విద్య కింద నిర్వహిస్తున్న ‘వన్‌ క్లాస్‌ వన్‌ ఛానల్‌’ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రస్తుతం 12గా ఉన్న ఛానళ్ల సంఖ్యను 200కు పెంచుతున్నట్లు తెలిపారు. దీనివల్ల అన్ని రాష్ట్రాలు 1 నుంచి 12 తరగతుల వారికి తమ ప్రాంతీయ భాషల్లో బోధించేందుకు వీలు కలుగుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
  6. కొండ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం కష్టసాధ్యంతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఆయా చోట్ల పర్వత్‌మాల ప్రాజెక్టు కింద రోప్‌వేల నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పీపీపీ విధానంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కింద అటు కనెక్టివిటీ పెరగడంతో పాటు పర్యాటకం సైతం వృద్ధి చెందుతుందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 60 కిలోమీటర్ల పొడవైన 8 రోప్‌వే ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు.
  7. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. చిరు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. దేశీయంగా వినియోగం పెంచడంతో పాటు జాతీయంగా, అంతర్జాతీయంగా చిరు ధాన్యాలకు గుర్తింపు తీసుకొస్తామన్నారు.
  8. మహిళాభివృద్ధి అవసరాన్ని గుర్తించి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు పథకాలను పునరుద్ధరించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. మహిళా శిశు సంక్షేమం కోసం మిషన్‌ శక్తి; మిషన్‌ వాత్సల్య; సక్షమ్‌ అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 స్కీములు తీసుకొచ్చినట్లు చెప్పారు. సక్షమ్‌ అంగన్‌వాడీ కార్యక్రమం కింద అంగన్‌వాడీల్లో మెరుగైన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని 2 లక్షలకుపైగా అంగన్‌వాడీలను సక్షమ్‌ అంగన్‌వాడీలుగా అభివృద్ధిపరచనున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని