Nasscom: 2023లో కొత్తగా 480 డీప్‌టెక్‌ అంకురాలు: నాస్కామ్‌

గత ఏడాది మన దేశంలో కొత్తగా 480 డీప్‌టెక్‌ అంకురాలు (కృత్రిమ మేధ, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, బయోటెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర సాంకేతికలకు సంబంధించినవి) పుట్టుకొచ్చాయని టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ నివేదిక వెల్లడించింది.

Published : 23 Jun 2024 03:24 IST

దిల్లీ: గత ఏడాది మన దేశంలో కొత్తగా 480 డీప్‌టెక్‌ అంకురాలు (కృత్రిమ మేధ, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, బయోటెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర సాంకేతికలకు సంబంధించినవి) పుట్టుకొచ్చాయని టెక్నాలజీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్‌ సంస్థ జిన్నోవ్‌తో కలిసి నాస్కామ్‌ ఈ నివేదికను రూపొందించింది. ఈ అంకురాలకు ఫండింగ్‌ వింటర్‌ (నిధులు తగ్గడం) అతి పెద్ద సవాలుగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇండియాస్‌ డీప్‌టెక్‌ డాన్‌: ఫోర్జింగ్‌ అహేడ్‌’ పేరుతో రూపొందించిన నివేదికలో నిధుల కొరతతో పాటు ప్రతిభావంతుల్ని ఆకర్షించడం, ఉద్యోగుల తొలగింపు, అంతర్జాతీయ విస్తరణ వంటి ప్రధాన సవాళ్లను ప్రస్తావించింది. ప్రస్తుతం మన దేశంలో 3600కు పైగా డీప్‌టెక్‌ అంకురాలు ఉన్నాయని, ఇందులో గత ఏడాదే 480 జతయ్యాయని నాస్కామ్‌ నివేదిక తెలిపింది. 2022లో కొత్తగా పుట్టుకొచ్చిన డీప్‌టెక్‌ అంకురాలతో పోలిస్తే ఇవి దాదాపు రెట్టింపు ఉన్నాయని పేర్కొంది. భారతీయ డీప్‌టెక్‌ అంకురాలు గత 5 ఏళ్లలో 10 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్లు) నిధుల్ని సమీకరించాయని వెల్లడించింది. 2023లో 850 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,055 కోట్లు) నిధుల్ని రాబట్టాయి. 2022లో సమీకరించిన 3.7 బి.డాలర్ల (సుమారు  రూ.30,700 కోట్లు)తో పోలిస్తే ఇవి 77 శాతం తక్కువ. 2022తో పోలిస్తే గత ఏడాది ఒప్పందాలు కూడా 25 శాతం మేర తగ్గాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని