PPF: పీపీఎఫ్ ఖాతాతో ప్ర‌యోజ‌నాలు

పీపీఎఫ్ పెట్టుబ‌డి 100% రిస్క్‌-ఫ్రీ, ఎందుకంటే ఇది భార‌త ప్ర‌భుత్వ గ్యారంటీగ‌ల చిన్న పొదుపు ప‌థ‌కం.

Updated : 03 Jun 2021 11:50 IST

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా గ‌ల‌వారికి ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు, ఇత‌ర ఆర్థిక ప్ర‌యోజ‌నాలు బాగానే ఉన్నాయి.

పీపీఎఫ్‌లో ఉన్న డ‌బ్బు హామితో ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో, పీపీఎఫ్ ఖాతాదారుడు సంవ‌త్స‌రానికి అతి త‌క్కువ వ‌డ్డీ రేటుతో స్వ‌ల్ప‌కాలిక రుణాన్ని పొంద‌వ‌చ్చు. అధిక రాబ‌డినిచ్చే వాటిలో పీపీఎఫ్ ఒక‌టి. ప్ర‌స్తుత పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1%, రిస్క్‌లేని పెట్టుబ‌డే కాకుండా, దీనికి భార‌త ప్ర‌భుత్వం గ్యారంటీ కూడా ఉంది. పీపీఎఫ్ ఖాతా కేవ‌లం పెట్టుబ‌డి సాధ‌నం మాత్ర‌మే కాదు, ఇది మీ పెట్టుబ‌డి మ‌రియు దాని రాబ‌డిపై ఆదాయ‌పు ప‌న్నును ఆదా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. పీపీఎఫ్ ఖాతా నిబంధ‌న‌ల ప్ర‌కారం, ఆర్థిక సంక్షోభ స‌మ‌యంలో అప‌రిమిత పొడిగింపు సౌక‌ర్యంతో పాటు ఒక‌రి పీపీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా రుణం కూడా పొంద‌వ‌చ్చు. అంతే కాకుండా ఈ క్రింది ప్ర‌యోజ‌నాలున్నాయి.

1) రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ః  పీపీఎఫ్ పెట్టుబ‌డి 100% రిస్క్‌-ఫ్రీ, ఎందుకంటే ఇది భార‌త ప్ర‌భుత్వ గ్యారంటీగ‌ల చిన్న పొదుపు ప‌థ‌కం, ఇది స్టాక్ మార్కెట్ లాభ న‌ష్టాల‌తో ముడిప‌డి లేదు. బ్యాంక్ డిఫాల్ట్ విష‌యంలో, ఒక‌రి పీపీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం 100% సుర‌క్షితంగా ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా బ్యాంక్ ఖాతాదారుల‌కు భార‌త ప్ర‌భుత్వం హామీ ఇచ్చిన రూ. 5 ల‌క్ష‌ల బీమాలో పీపీఎఫ్ బ్యాలెన్స్ చేర్చ‌ప‌డ‌దు. పీపీఎఫ్ పూర్తి బ్యాలెన్స్‌కు ర‌క్ష‌ణ హామీ ఉంటుంది.

2) లోన్‌, పాక్షిక ఉప‌సంహ‌ర‌ణః ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో పీపీఎఫ్ ఖాతాదారుడు నిల్వ బ్యాలెన్స్‌పై సంవ‌త్స‌రానికి కేవలం 1% వ‌డ్డీ రేటుతో స్వ‌ల్ప‌కాలిక రుణాన్ని పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన 3 నుండి 6 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మాత్ర‌మే పీపీఎఫ్ రుణం పొంద‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించిన 6 సంవ‌త్స‌రాల త‌ర్వాత పీపీఎఫ్ బ్యాలెన్స్ నుండి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అర్హ‌త ఉంటుంది.

3) పీపీఎఫ్ పొడిగింపు సౌక‌ర్యంః పీపీఎఫ్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి ఉంది. కానీ, `పీపీఎఫ్ ఖాతా పొడిగింపు ఫారం` స‌మ‌ర్పించ‌డం ద్వారా ఒక‌రి పీపీఎఫ్ ఖాతాను 5 ఏళ్ల కాలానికి పొడిగించ‌వ‌చ్చు. ఇది అప‌రిమిత సంఖ్య‌లో చేయ‌వ‌చ్చు. కాబ‌ట్టి, ఒక‌రి కెరీర్ యొక్క ప్రారంభ ద‌శ‌లో ఈ ఖాతా తెరిచిన ఖాతాదారుడు ఈ పొడిగింపు స‌దుపాయాన్ని ఉప‌యోగించి పీపీఎఫ్ ఖాతాను ప‌ద‌వీ విర‌మ‌ణ ఆధారిత పెట్టుబ‌డి సాధ‌నంగా మార్చుకోవ‌చ్చు.

4) పెట్టుబ‌డి సౌల‌భ్యంః పీపీఎఫ్ ఖాతాదారుడు ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నిష్టంగా రూ. 500, గ‌రిష్టంగా రూ. 1.5 ల‌క్ష‌లు ఈ ఖాతాలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవ‌త్స‌రంలో ఒక‌రి పీపీఎఫ్ ఖాతాలో గ‌రిష్టంగా 12 సార్లు డిపాజిట్ చేయ‌వ‌చ్చు.

5) వ‌డ్డీ పై వ‌డ్డీః పీపీఎఫ్ ఖాతా దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డి. పెట్టుబ‌డిదారునికి అస‌లుపైనే కాకుండా వ‌డ్డీపై వ‌డ్డీ కూడా వ‌స్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని