IT Notice: ఇలాంటి నగదు లావాదేవీలు జరిపితే.. ఐటీ నోటీసులొస్తాయ్‌ 

నగదు లావాదేవీల గురించి ఆదాయపు పన్ను శాఖ దృష్టిసారించింది  

Updated : 25 Sep 2021 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రజల నగదు లావాదేవీలను త‌గ్గించడానికి ఆదాయపు పన్ను శాఖ, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు, బ్రోకరేజీలు లాంటి వివిధ పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లు నిబంధనలను కఠినతరం చేశాయి. నగదు లావాదేవీలకు నిర్దిష్ట పరిమితులు విధించాయి. ఈ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. 

ఆదాయపు పన్ను నోటీసు పంపే అవ‌కాశమున్న టాప్ 5 నగదు లావాదేవీలివే...

💰 పొదుపు / క‌రెంట్ ఖాతా...

ఒక వ్యక్తికి, పొదుపు ఖాతాలో నగదు డిపాజిట్ పరిమితి ₹లక్ష‌.  పొదుపు ఖాతాలో ల‌క్ష రూపాయలల‌కు మించి జమ చేస్తే, ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపొచ్చు. అదేవిధంగా, కరెంట్ ఖాతాదారులకు, పరిమితి ₹50 లక్షలు. ఈ పరిమితిని ఉల్లంఘించినప్పుడూ ఆదాయపు పన్ను నోటీసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

💰 క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు...

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేటప్పుడు ₹లక్ష పరిమితిని మించకూడదు. క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులో ఈ నగదు పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నోటీసుకు స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది.

💰 బ్యాంక్ ఎఫ్‌డీ (ఫిక్స్‌డ్ డిపాజిట్)...

బ్యాంక్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో నగదు డిపాజిట్  ₹10 లక్షలకు మించకూడదు. బ్యాంక్ డిపాజిటర్ ఒకరి బ్యాంక్ ఎఫ్‌డీ ఖాతాలో అంత‌కుమించి నగదు డిపాజిట్ చేయకూడ‌దు.

💰 మ్యూచువల్ ఫండ్ / స్టాక్ మార్కెట్ / బాండ్ / డిబెంచర్...

పైన తెలిపిన పెట్టుబడుల నుంచి పొందిన నగదుని బ్యాంకు ఖాతా లో వేసి అందులో నుంచి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు... రూ. 10 లక్షలకు మించి పెట్టుబడి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఈ పరిమితిని మించితే ఆదాయపు పన్ను విభాగం... మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను తనిఖీ చేస్తుంది.

💰 రియల్ ఎస్టేట్... 

ఒక ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు, రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ పరిమితికి మించి నగదు లావాదేవీలు ఉంటే  ఆదాయపు పన్ను శాఖకు స‌మాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అంత‌కు మించి న‌గ‌దు లావాదేవీలు చేయ‌డాన్ని ఐటీ శాఖ ప్రోత్స‌హించ‌దు.

ఈ నిబంధనల నేపథ్యంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న సాంకేతిక‌త‌తో ప‌రిమితికి మించి చేసే లావాదేవీల వివ‌రాలు సుల‌భంగా తెలిసిపోతాయనే విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని