Published : 27 Dec 2021 14:53 IST

Financial Tasks: ఇంకా 4 రోజులే గడువు.. 31లోపు ఈ పనులు పూర్తి చేయండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాత ఏడాదికి బాయ్‌ చెప్పి.. కొత్త ఏడాదికి హాయ్‌ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. 2021వ సంవత్సరం క్యాలెండర్‌ తీసేసి 2022వ సంవత్సరం క్యాలెండర్‌ పెట్టుకోవాల్సిన టైమ్‌ దగ్గరపడింది. అందుకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఆర్థిక విష‌యాల‌కు సంబంధించి ఈ లోపు పూర్తిచేయాల్సిన కొన్ని ముఖ్య‌మైన ప‌నులు ఉన్నాయి. డిసెంబర్‌ 31లోగా ఈ పనులు పూర్తి చేయడంలో విఫలమైతే ఆర్థికంగా కొంత నష్టపోయే ప్రమాదం ఉంది. అవేంటో చూసేయండి..

1. ఐటీఆర్ ఫైలింగ్‌: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు గ‌డ‌వు డిసెంబ‌రు 31తో ముగియనుంది. అంటే ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు మ‌రో నాలుగు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. కొవిడ్‌-19, అలాగే కొత్త ఆదాయ‌పు పోర్టల్‌లో వ‌చ్చిన సాంకేతిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఐటీ రిట‌ర్నుల దాఖ‌లు గ‌డువును కేంద్రం పలుమార్లు పొడిగించింది. మరోసారి గ‌డువు పొడిగించ‌కపోవ‌చ్చు. కాబ‌ట్టి ఈ గ‌డువులోపు ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయాలి. లేదంటే, ప‌న్ను చెల్లింపుదారులు రూ.5 వేలు పెనాల్టీగా చెల్లించాల్సి వ‌స్తుంది.

2. లైఫ్ స‌ర్టిఫికెట్‌: పెన్ష‌న‌ర్లు జీవ‌న ధ్రువీకరణ (లైఫ్ స‌ర్టిఫికెట్‌)ను స‌మ‌ర్పించాల్సిన గ‌డువు ద‌గ్గ‌ర పడుతోంది. ఏటా నవంబర్‌ 30లోపు ప్ర‌భుత్వ ఫించ‌నుదారులు వారి జీవ‌న ప్రమాణ పత్రాన్ని స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే, ఈ సారి గ‌డవు తేదీ డిసెంబ‌ర్‌ 31 వ‌ర‌కు పెంచారు. ఇప్పుటి వ‌ర‌కు లైఫ్ స‌ర్టిఫికెట్‌ స‌మ‌ర్పించ‌ని పెన్ష‌న్‌దారులు మ‌రో నాలుగు రోజుల్లో స‌మ‌ర్పించాలి. అప్పుడే ఎలాంటి అవాంత‌రాలూ లేకుండా పెన్ష‌న్ పొందొచ్చు. బ్యాంకు, పోస్టాఫీసుకు వెళ్లి భౌతికంగా గానీ, డోర్ స్టెప్ విధానంలో ఇంటి వ‌ద్ద గానీ, విశిష్ట ముఖ గుర్తింపు విధానంలో ఆన్‌లైన్‌ ద్వారా గానీ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించొచ్చు.

3. ఆధార్, పీఎఫ్ లింక్‌: ఈపీఫ్ ఖాతాకు, ఆధార్‌ను అనుసంధానించడాన్ని ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్‌ (ఈపీఎఫ్ఓ) త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇందుకోసం డిసెంబ‌రు 31, 2021 వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. ఆధార్‌తో అనుసంధానించ‌ని ఖాతాల‌కు ఈసీఆర్ దాఖ‌లు చేయ‌లేరు కాబ‌ట్టి సంస్థ కాంట్రీబ్యూష‌న్ నిలిచిపోకుండా ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానించడం తప్పనిసరి. ఆధార్ వెరిఫికేష‌న్ పూర్తయిన అన్ని ఈపీఎఫ్ ఖాతాల‌కు యూఏఎన్‌ (యూనివ‌ర్సల్ అకౌంట్‌ నంబ‌ర్‌) పొందాల‌ని ఈపీఎఫ్‌వో.. సంస్థ య‌జ‌మానులను ఆదేశించింది.

4. ఈపీఎఎఫ్‌వో ఈ-నామినేష‌న్ దాఖ‌లు: ఈపీఎఫ్‌వో చందాదారులు డిసెంబ‌రు 31లోపు ‘ఈ-నామినేష‌న్’ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్‌ కింద బీమా ప్ర‌యోజ‌నాన్ని పొందాల‌న్నా, చందాదారులు ఆన్‌లైన్‌లో పెన్ష‌న్ క్లెయిమ్ న‌మోదు చేయాల‌న్నా ఈ-నామినేష‌న్ త‌ప్ప‌నిస‌రి. ఎంప్లాయీస్ డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్ర‌స్తుతం ఈపీఎఫ్‌ స‌భ్యుల‌ కుటుంబాల‌కు గ‌రిష్ఠంగా రూ.7 ల‌క్ష‌ల బీమా హామీ ల‌భిస్తోంది. ఈపీఎఫ్‌ సభ్యుడు ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్టయితే, కుటుంబ స‌భ్యుల‌కు ఈ ప‌థ‌కం కింద బీమా ప్ర‌యోజ‌నం అందుతుంది. ఈ ప్ర‌యోజ‌నాల‌ను పొందాలంటే ఈపీఎఫ్‌వో చందాదారులు గడువు తేదీలోగా ‘ఈ-నామినేష‌న్’ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

5. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల‌ కేవైసీ: డీమ్యాట్‌, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ పూర్తి చేసేందుకు సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డిసెంబ‌రు 31 వ‌ర‌కు గ‌డువు పొడిగించింది. మ‌రో నాలుగు రోజుల్లో ఈ గ‌డువు ముగిస్తుంది. డీమ్యాట్ ఖాతా లావాదేవీల్లో ఎలాంటి అవాంత‌రాలూ రాకుండా ఖాతాదారులు గ‌డువు తేదీలోపు కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాలి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని