Health Insurance: హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో సరైన కవరేజీ లేదా? ఈ 5 రైడర్లు జత చేయండి..

Health Insurance: ఆరోగ్య బీమాతో పాటు ఎలాంటి రైడ‌ర్ల‌ను తీసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Updated : 23 Mar 2022 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రం. అందుకే దీన్ని అద‌న‌పు ఖ‌ర్చులా కాకుండా మ‌న భ‌విష్య‌త్‌ కోసం మ‌నం చేసే పెట్టుబ‌డిలా మాత్ర‌మే భావించాల‌ని నిపుణులు చెబుతుంటారు. మ‌న‌లో చాలా మందికి ఆరోగ్య బీమా గురించి తెలుసు. వివిధ కార‌ణాల‌తో భ‌విష్య‌త్‌లో వైద్య చికిత్స‌లు అవ‌స‌ర‌మై ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తే.. ఆర్థికంగా భ‌రోసాను ఇస్తుంది. ప్ర‌స్తుతం మార్కెట్లో అనేక ర‌కాల బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాథ‌మిక‌ పాల‌సీలు ప‌రిమితితో కూడిన బీమా హామీని మాత్ర‌మే అందిస్తాయి. కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలను, ప్రమాదాలను పాలసీ పరిధి నుంచి మినహాయిస్తాయి. ఇది తెలియక.. ఆరోగ్య బీమా ఉంద‌ని ధీమాగా ఉంటారు. స‌మ‌యం వ‌చ్చేస‌రికి బీమా కవరేజీ చేయ‌క‌పోతే బాధప‌డుతుంటారు. ఇలాంటి పరిమితులను అధిగమించేందుకు కాస్త ప్రీమియం ఎక్కువైనా సరే ఆరోగ్య బీమా పాలసీతో పాటు అదనపు రైడర్లను తీసుకుంటే మేలు.

తీవ్ర అనారోగ్య సమస్యలైన గుండె జబ్బు, క్యాన్సర్, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వంటి వాటికి వర్తించే విధంగా బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియంతో రైడర్లను రూపొందించాయి. ఇందులో ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల కోసం రూపొందించిన రైడ‌ర్లూ ఉన్నాయి. మ‌న అవ‌స‌రాల‌ను కుటుంబ ఆరోగ్య చ‌రిత్ర‌ను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమాతో త‌గిన రైడ‌ర్ల‌ను తీసుకుంటే అద‌న‌పు బీమా హామీ ల‌భిస్తుంది. అస‌లు ఆరోగ్య బీమాతో పాటు ఎలాంటి రైడ‌ర్ల‌ను తీసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య బీమా పాలసీలో అందుబాటులో ఉన్న 5 ముఖ్య రైడర్లు

1. హాస్పిట‌ల్ క్యాష్ రైడ‌ర్‌: ఆరోగ్య బీమాలో ముఖ్య‌మైన రైడ‌ర్ ఇది. చికిత్స కోసం ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు వైద్యప‌ర‌మైన ఖ‌ర్చులే కాకుండా కొన్ని ఇత‌ర ఖ‌ర్చులు కూడా ఉంటాయి. అటువంటి సంద‌ర్భంలో ఈ రైడ‌ర్ సాయపడుతుంది. ఏ అవ‌స‌రం కోస‌మైనా ఈ మొత్తాన్ని వినియోగించుకోవ‌చ్చు. ముందుగా నిర్దేశించిన మొత్తం, ముందుగా నిర్దేశించిన రోజుల‌కు ఏ రోజుకు ఆ రోజు చెల్లిస్తారు.

2. గ‌ది అద్దె చెల్లించే రైడ‌ర్లు: సాధార‌ణ ఆరోగ్య బీమా ప్లాన్‌లో సాధార‌ణ లేదా సెమీ ప్రైవేట్ గ‌దుల‌కు మాత్ర‌మే చెల్లింపులు చేసేలా లేదా గ‌ది అద్దెలో ఒక ప‌రిమితి వ‌ర‌కు మాత్ర‌మే చెల్లించేలా నిబంధ‌న‌లు ఉంటాయి. గ‌ది అద్దె చెల్లింపు రైడ‌ర్ తీసుకుంటే, ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చిన‌ప్పుడు అందుబాటులో ఉన్న ఏ కేటగిరీలోనైనా రూమ్‌ను తీసుకోవచ్చు. గ‌ది అద్దె మ‌రింత పెంచి ఇవ్వ‌డం లేదా పూర్తి అద్దె బీమా సంస్థ చెల్లించెలా రైడ‌ర్లు ప‌నిచేస్తాయి.

3. మెటర్నిటీ రైడర్‌: ఒక‌వేళ మీరు భ‌విష్య‌త్తులో పిల్ల‌ల కోసం ప్లాన్ చేస్తుంటే ఈ రైడ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా పాలసీలు డెలివరీ ఖర్చులను క‌వర్‌ చేయ‌వు. కాబ‌ట్టి పాల‌సీ తీసుకునే ముందే మీ పాల‌సీ ఈ ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేస్తుందో లేదో చూసుకోవాలి. ఒక‌వేళ క‌వ‌ర్ చేయ‌కపోతే ఈ రైడ‌ర్‌ను ఎంచుకోవ‌చ్చు. ఇందులో డెలివరీకి అయ్యే ఖర్చు, శిశువు ఆరోగ్య సమస్యలతో పుట్టినప్పుడయ్యే వైద్య, సంరక్షణకు అయ్యే ఖర్చులను చెల్లిస్తాయి. అయితే వీటికి ఆరోగ్య బీమా పాలసీలలో మాదిరే 24 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.

4. ప్రమాద బీమా రైడర్: పాల‌సీ స‌మ‌యంలో పాల‌సీదారుడు అనుకోని ప్రమాదం బారిన‌ ప‌డి ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చుల‌ను ఈ రైడర్ క‌వ‌ర్ చేస్తుంది. ఒక‌వేళ ఆ వ్య‌క్తి ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే సాధార‌ణ బీమా క‌వ‌రేజ్‌కి అద‌నంగా ఈ మొత్తాన్ని సంస్థ చెల్లిస్తుంది. ఒక‌వేళ ప్ర‌మాదం వ‌ల్ల శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డితే (పాక్షిక లేదా పూర్తి) ప‌రిహారాన్ని చెల్లిస్తారు. నామ‌మాత్ర‌పు ప్రీమియంతోనే మీ బీమా పాల‌సీకి ఈ రైడ‌ర్‌ను జ‌త‌చేయొచ్చు.

5. క్రిటికల్ ఇల్‌నెస్‌ బెన్ఫిట్ రైడర్: ఆరోగ్య బీమాకు అద‌నంగా క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌ను తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం. ప్ర‌స్తుతం ఉన్న జీవ‌న శైలిలో వ‌య‌సుతో సంబంధం లేకుండా చాలా మంది.. తీవ్ర అనారోగ్యాల‌ (మూత్ర‌పిండాల వైఫ‌ల్యం, గుండె నొప్పి, క్యాన్స‌ర్‌, అవ‌య‌వ మార్పిడి వంటివి) బారిన‌ ప‌డుతున్నారు. వీటికి అయ్యే ఖ‌ర్చు చాలా ఎక్కువ‌. బీమా ఉంటే త‌ప్ప ఆ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డం సామాన్యుడికి సాధ్యం కాదు. ఇలాంటి తీవ్ర అనారోగ్యాల‌ను క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్‌ క‌వ‌ర్ చేస్తుంది. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బీమా సంస్థ‌లు ఈ రైడ‌ర్‌ను అందిస్తున్నాయి.

చివ‌రిగా: రైడర్లు ప్రధాన ఆరోగ్య బీమా పాలసీతో అదనపు బీమా ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. ప్రధాన పాలసీ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే రైడర్ ప్రయోజనాలు పొందే వీలుంటుంది. ప్రధాన పాలసీని సరైన సమయానికి పునరుద్ధరించుకోవడం తప్పనిసరి. రైడర్లలో కొన్ని జీవితాంతం పునరుద్దరించుకునే వీలు కలిగినవి ఉండగా మరికొన్ని కొంత నిర్ణీత వయసు వరకే ఆ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. పెద్ద వయసు వారు సాధ్యమైనంత వరకూ ఎక్కువ కవరేజీ ఉన్న వాటిని తీసుకుంటే మంచిది. కొన్ని రైడర్లకు సాధారణ పాలసీలలో ఉన్నట్టు వెయిటింగ్ పీరియడ్ సైతం ఉంటుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఉత్తమ రైడ‌ర్ల‌ను ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని