Budget 2023 : మోదీజీ.. 5 ట్రిలియన్‌ డాలర్ల కలలో కీలక భాగస్వామిని మరవొద్దు..!

భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల కల సాకారం కావాలంటే మహిళాశక్తి తోడ్పాటు తప్పని సరి. ఈ నేపథ్యంలో మహిళలను ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు ఈ బడ్జెట్‌లో ఏం చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 28 Jan 2023 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: జనాభాలో సగం మహిళలే ఉంటారు. కానీ, భారత్‌లో కట్టుబాట్ల కారణంగా వీరిలో చాలా మంది ఉద్యోగాలు చేయరు. ఇది ఒక రకంగా ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో మహిళల వాటా చాలా ఎక్కువగా ఉంటోంది. 2015 నాటి లెక్కల ప్రకారం చైనా, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో అత్యధికంగా మహిళలు జీడీపీలో 41 శాతం సమకూరుస్తున్నారు. ఉత్తర అమెరికాలో కూడా 40 శాతం వాటా వీరిదే. ప్రపంచ జీడీపీ సగటులో కూడా 37 శాతం మహిళల నుంచే వస్తోంది. కానీ, భారత్‌లో ఆ వాటా దాదాపు 17-18 శాతం వరకు మాత్రమే ఉందంటే ఎంత వెనుకబడిందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లో చాలా మంది మహిళలు మంచి విద్యాభ్యాసం చేసి కూడా ఇంటికే పరిమితమైపోతారు. చాలా మందికి ఉద్యోగాలు చేయాలని ఉన్నా.. పని వాతావరణాల్లో సమస్యలు, వేతనాలు తక్కువగా ఉండటం వంటి పలు రకాల కారణాలతో వీరు ఉద్యోగాల వైపు ఎక్కువగా మొగ్గుచూపరు. 2021-22 ఎకనామిక్‌ సర్వే ప్రకారం భారత్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల కల సాకారం కావాలంటే మహిళా శక్తిని భారత్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకోగలగాలి. 2016లో మెకెన్సీ నివేదిక ప్రకారం మహిళల భాగస్వామ్యం పెరిగితే ఆ ఏడాది జీడీపీకి తేలిగ్గా మరో 700 బిలియన్‌ డాలర్లు చేరేవి. జీడీపీలో అతివల ప్రాధాన్యం తెలుసుకోవడానికి ఇదొక్కటి చాలు. ఆర్థిక మంత్రి కూడా మహిళే కావడంతో ఈ సారి బడ్జెట్‌లో అతివల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోంటారనే ఆశలు ఉన్నాయి.

నిధుల పెంపు కీలకం..

మహిళలు ఎవరిపై ఆధారపడకుండా జీవించాలంటే.. విద్యా, వైద్యం, సామాజిక భద్రత చాలా అవసరం. ప్రభుత్వం ఇప్పటికే ‘బేటీ బచావ్‌, బేటీ పడావ్‌’, ‘జాతీయ గ్రామీణ జీవనోపాధి’ లాంటి పథకాలు నిర్వహిస్తోంది. వీటికి నిధులను పెంచితే ఎక్కువ మంది మహిళలకు ఇవి చేరుకునే అవకాశం ఉంటుంది.

2005-06 నుంచి కేంద్రం జెండర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతోంది. దీనిని రెండు భాగాలుగా విభజించింది. మొదటి భాగంలో మహిళలకు సంబంధించిన పథకాలు, 100 శాతం మహిళల అభివృద్ధికి చేసిన కేటాయింపులే ఉంటాయి. రెండో భాగంలో వివిధ పథకాల్లో కనీసం 30 శాతం మహిళల స్వయం సమృద్ధికి చేసే కేటయింపులు ఉంటాయి.

దాదాపు 17 ఏళ్లుగా జీడీపీతో పోలిస్తే జెండర్‌ బడ్జెట్‌ కేటయింపుల శాతం పెరగడం లేదు. ఇది ఎప్పుడూ బడ్జెట్‌ మొత్తం వ్యయంలో 5 శాతం కంటే తక్కువే ఉంటోంది. ఇక జీడీపీతో పోలిస్తే 1శాతం కన్నా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత కేటాయింపులు దారణంగా పడిపోయాయి. దీంతోపాటు కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో మహిళల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2020లో బడ్జెట్‌ వ్యయాల్లో జెండర్‌ బడ్జెట్‌ కేటాయింపులు 4.72 శాతం కాగా.. 2021-22లో 4.3 శాతానికి తగ్గింది.

2023 బడ్జెట్‌లో ఏం కోరుకుంటున్నారు..

మహిళల కోసం చేపట్టిన స్కీంలకు ప్రభుత్వ కేటాయింపులు గణనీయంగా పెరగాలి. ప్రస్తుతం జెండర్‌ బడ్జెట్‌ పరిధి 80 శాతం వాటాను 10 పథకాలు మాత్రమే ఆక్రమించాయి. ఈ బడ్జెట్‌లో పథకాల సంఖ్య మరింత పెరిగాలి. దీంతోపాటు శ్రామిక మహిళల సంఖ్య ఆధారంగా కేటాయింపులు ఉండాలి.

  కేవలం మహిళలకు సంబంధించిన పథకాల్లో కేటాయింపులు పెంచితే చాలదు. అన్ని పథకాల్లో కూడా మహిళల వాటా పెరిగేట్లు చూడాలి.

ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో మహిళల స్టార్టప్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటయించడం వారిని వ్యాపార రంగంలో బలోపేతం చేస్తుంది.

మహిళలకు ఆస్తిపై యాజమాన్య హక్కులను ప్రోత్సహించేలా పన్ను రాయితీలు ఇవ్వాలి. ఇది వారిలో ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచుతుంది.

మహిళలు నిర్వహించే సంస్థలకు సులువుగా రుణాలు వచ్చేలా పథకాలను ప్రవేశ పెట్టాల్సి ఉంది. దీంతోపాటు పన్ను రాయితీలు కల్పిస్తే.. మహిళా వ్యాపారవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

  ప్రధాన మంత్రి మాతృ వందన యోజనను మరింత బలోపేతం చేయాలి. ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేసేలా ప్రోత్సహించేందుకు ‘ఛైల్డ్‌కేర్‌’ను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలకు మొగ్గు చూపకపోడానికి ప్రధాన కారణాల్లో శిశు సంరక్షణ కూడా ఒకటి. నాణ్యమైన శిశు సంరక్షణ కేంద్రాలు అందుబాటులోకి వస్తే మహిళలు ఉద్యోగాన్ని, కుటుంబాన్ని సమతౌల్యం చేసుకోగలరు.

వితంతు మహిళకు అవసరమైన పింఛను పథకాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని