57% పెరిగిన బ్యాంకు ఖాతాదారుల ఫిర్యాదులు: ఆర్‌బీఐ

గతేడాది జూన్‌ 30తో ముగిసిన ఏడాది సమయంలో బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించి ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదులు 57 శాతం పెరిగి 3.08 లక్షలకు చేరాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది. 

Updated : 22 Aug 2022 17:13 IST

ముంబయి: గతేడాది జూన్‌ 30తో ముగిసిన ఏడాది సమయంలో బ్యాంకింగ్‌ సేవలకు సంబంధించి ఖాతాదారులు ఇచ్చిన ఫిర్యాదులు 57 శాతం పెరిగి 3.08 లక్షలకు చేరాయని రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) వెల్లడించింది.  ఇందులో ఏటీఎం సేవలు లేదా డెబిట్‌ కార్డులకు సంబంధించి ఫిర్యాదులు అయిదోవంతు ఉన్నాయని అంబుడ్స్‌మన్‌ పథకాలపై వెలువరించిన వార్షిక నివేదికలో పేర్కొంది. తర్వాత మొబైల్‌, ఎలక్ట్రానిక్‌ బ్యాంకింగ్‌ (13.38 శాతం) సేవలకు సంబంధించి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. మూడో స్థానంలో ఫెయిర్‌ ప్రాక్టీసస్‌ కోడ్‌ (ఎఫ్‌పీసీ) పాటించకపోడానికి సంబంధించిన కేసులున్నాయి. క్రెడిట్‌ కార్డులు, నిబంధనల అమలు, సమాచారం ఇవ్వకుండా ఛార్జీల విధింపు, రుణాలు, అడ్వాన్సులకు సంబంధించి బ్యాంకింగ్‌ చట్టం, స్టాండర్డ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఎస్‌బీఐ) నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు పెరిగాయని ఆర్‌బీఐ తెలిపింది. డైరెక్ట్‌ సేల్స్‌ ఏజెంట్‌ లేదా రికవరీ ఏజెంట్లపై ఫిర్యాదులు 2018-19లో 629 రాగా, గతేడాది 1406కు పెరిగాయి. ఇక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీలు)పై అంబుడ్స్‌మన్‌కు అందిన ఫిర్యాదులు 386 శాతం పెరిగి 19,432కు చేరాయి. ఎస్‌బీఐ, జాతీయ బ్యాంకులపై వచ్చిన ఫిర్యాదులు 61.90 శాతం నుంచి 59.65 శాతానికి తగ్గగా, ప్రైవేట్‌ బ్యాంకులపై ఫిర్యాదులు పెరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని