5G auction: 5జీ దిశగా అడుగులు.. మే నెలలో వేలం షురూ!

5G spectrum auction: 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ మే నెలలో నిర్వహించే అవకాశం ఉందని టెలికాం విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

Published : 13 Feb 2022 16:48 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాదే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కేంద్రం ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. మే నెలలో ఈ ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉందని టెలికాం విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు.

వేలం ప్రక్రియకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) మార్చి చివరి నాటికి సిఫార్సులను పంపించనుందని టెలికాం కార్యదర్శి కె రాజారమణ్‌ తెలిపారు. అక్కడికి ఓ నెల రోజులు మిగిలిన ప్రక్రియకు సమయం పడుతుందని చెప్పారు. అదే సమయంలో వేలం ప్రక్రియకు సంబంధించి ఇతర ప్రక్రియలను టెలికాం విభాగం (DoT) వేగవంతం చేయనుందని వివరించారు. గతంలో ట్రాయ్‌ సిఫార్సులు పంపించిన 60-120 రోజులకు వేలం ప్రక్రియ జరిగేది. ఈ సారి ట్రాయ్‌ నుంచి సిఫార్సులు అందుకున్న రెండు నెలల్లోనే వేలం ప్రక్రియను టెలికాం విభాగం పూర్తిచేయనున్నట్లు రాజా రమణ్‌ వెల్లడించారు.

ప్రక్రియ ఇలా..

స్పెక్ట్రమ్‌ ధర, కేటాయింపు, స్పెక్ట్రమ్‌ బ్లాక్‌ సైజ్‌, పేమెంట్‌ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్ విషయంలో ట్రాయ్‌ నుంచి డాట్‌ సిఫార్సులను ఆహ్వానిస్తుంది. ఆ మేరకు ట్రాయ్‌ టెలికాం పరిశ్రమ, ఇతర భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపి డాట్‌కు ప్రతిపాదనలను పంపిస్తుంది. దీనిపై డాట్‌లోని డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ నిర్ణయం తీసుకుని కేబినెట్‌ ఆమోదానికి పంపిస్తుంది. ఆపై వేలం ప్రక్రియను చేపట్టనున్నారు. వేలం ప్రక్రియ నిర్వహణ బాధ్యతలను ఇప్పటికే MSTCని ఎంపిక చేసినట్లు రాజారమణ్‌ తెలిపారు. 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి అభిప్రాయాలను వెలిబుచ్చాల్సిందిగా ఫిబ్రవరి 15 వరకు ట్రాయ్‌ గడువు ఇచ్చింది. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జీలో వస్తున్న డౌన్‌లోడ్‌ స్పీడ్‌ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ సేవలను పొందే వీలుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని