5G auction: స్పెక్ట్రమ్‌ కోసం ₹1.49 లక్షల కోట్ల బిడ్లు.. మూడో రోజూ కొనసాగనున్న వేలం

5G auction: దేశంలో వేగవంతమైన టెలికాం సేవల కోసం ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం ప్రక్రియ మూడో రోజూ కొనసాగనుంది.

Published : 27 Jul 2022 21:19 IST

దిల్లీ: దేశంలో వేగవంతమైన టెలికాం సేవల కోసం ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం (5G spectrum auction) ప్రక్రియ మూడో రోజూ కొనసాగనుంది. రెండో రోజైన బుధవారం వేలం ముగిసే సమయానికి 9 రౌండ్ల బిడ్లు పూర్తయినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మొత్తం రూ.1.49 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. వేలంలో మంచి పోటీ ఉందని, వేలానికి ఉంచిన అన్ని బ్యాండ్లకూ బిడ్లు దాఖలయ్యాయని చెప్పారు. మంగళవారం 4 రౌండ్లు బిడ్లు జరగ్గా.. బుధవారం ఐదు రౌండ్లు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ముకేశ్‌ అంబానీకి చెందిన జియోతో పాటు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ డేటా నెట్‌వర్క్స్‌, సునీల్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌లు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మంగళవారం రూ. 1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి. ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ దక్కించకుంటున్నందన్న విషయం వేలం పూర్తయ్యాకే తెలుస్తుంది. అయితే, రూ.80,100 కోట్లతో ఎక్కువ స్పెక్ట్రమ్‌ను జియో దక్కించుకునే అవకాశం ఉందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. రూ.45 వేల కోట్లతో ఎయిర్‌టెల్‌ 1800 MHz, 2100 MHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. వొడాఫోన్‌ ఐడియా రూ.18,400 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ.900 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకుంటుందని పేర్కొంది.

రూ 4.3 లక్షల కోట్ల విలువైన 72 GHz స్పెక్ట్రమ్‌ను కేంద్రం ఈ సారి వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. వేలం పూర్తయ్యాక స్పెక్ట్రమ్‌ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇ-హెల్త్‌, కనెక్టెడ్‌ వెహికల్స్‌, మెరుగైన ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ, మెటావర్స్‌ అనుభవాలు, అధునాతన మొబైల్‌ క్లౌడ్‌ గేమింగ్‌ వంటివి అందుబాటులోకి వస్తాయి.


5జీ కథనాలు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని