క్రెడిట్ కార్డును ర‌ద్దు చేయాల‌నుకుంటున్నారా?ఈ 6 విష‌యాలు గుర్తుంచుకోండి! 

10 ఏళ్లకు మించి ఉపయోగిస్తున్న క్రెడిట్‌ కార్డులను రద్దు చేసుకోకపోవడమే మంచిది.

Published : 06 Dec 2021 15:51 IST

క్రెడిట్ కార్డుల వ‌ల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. స‌రిగ్గా వినియోగించ‌క‌పోతే జ‌రిగే న‌ష్టాలు ఎక్కువే. ప్ర‌స్తుతం క్రెడిట్‌కార్డులు చాలా సుల‌భంగా ల‌భిస్తున్నాయి. దీంతో నాలుగైదు కార్డుల‌ను నిర్వ‌హించే వారు చాలా మందే ఉన్నారు. అయితే అతిగా చేస్తుండడం, వార్షిక రుసుములు ఎక్కువ కావ‌డం, బ‌హుళ‌ కార్డుల వ‌ల్ల బిల్లుల‌ను ట్రాక్ చేయ‌లేక‌పోవ‌డం, నిర్వ‌హ‌ణ లోపాలు వంటి ప‌లు కారణాల‌తో కార్డుల‌ను ర‌ద్దు చేస్తున్నారు కూడా. కార్డు వెన‌క్కి ఇచ్చేసేందుకు నిర్ణ‌యించుకుంటే..మీ వ‌ద్ద ఉన్న క్రెడిట్ కార్డుల‌లో ఏ కార్డు ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల త‌క్కువ న‌ష్టం,/ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉంటుందో తెలుసుకుని స‌రైన విధంగా ర‌ద్దు చేయాలి. 

1. పూర్తి బ‌కాయిలు చెల్లించండి:
క్రెడిట్ కార్డును ర‌ద్దు చేసే ముందు..సంబంధిత‌ అన్ని బిల్లుల‌ను పూర్తిగా చెల్లించాలి. ఒక్క రూపాయి బ‌కాయి ఉన్నా, అది మీ కార్డు వివ‌రాల్లో ప్ర‌తిబింబిస్తూనే ఉంటుంది. బ‌కాయి ఉన్న మొత్తంపై వ‌డ్డీలు, పెనాల్టీ చార్జీలు ప‌డుతూనే ఉంటాయి. పూర్తిగా చెల్లించ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరుపై ప్ర‌భావం ప‌డ‌దు. లిక్విడిటీ స‌మ‌స్య కార‌ణంగా చెల్లింపులు చేయ‌లేక‌పోతే బ్యాంకు స‌హాయంతో వేరొక‌ క్రెడిట్ కార్డుకి చెల్లించాల్సిన బ‌కాయిల‌ను బ‌దిలీ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించండి. 

2. సూచ‌న‌లు ర‌ద్దు చేయండి:
వినియోగ వ‌స్తువుల కొనుగోలు బిల్లులు ఈఎమ్ఐల రూపంలోకి మార్చుకునేవారు ఈఎమ్ఐ చెల్లింపుల‌కు, ఆహా, అమెజాన్ ప్రైమ్ వంటి ఫ్లాట్‌ఫామ్‌ల‌ స‌భ్యత్వాన్ని పొందేందుకు, ఇలా ప‌లు ర‌కాలుగా క్రెడిట్ కార్డుల‌ను వాడుతున్నారు. బిల్లు చెల్లింపుల‌కు స్టాండ‌ర్డ్ సూచ‌న‌ల‌ను ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు ర‌ద్దు చేయాల‌నుకుంటే.. ఇలాంటి చెల్లింపులు స్వ‌యంచాల‌కంగా ఆగ‌వు. కార్డు జారీ సంస్థ నుంచి నో-డ్యూ స‌ర్టిఫికేట్ లేదా వ్రాత‌పూర్వ‌క నిర్ధార‌ణ పొందితే గానీ స‌రైన విధంగా ర‌ద్దు చేసిన‌ట్లు కాదు. ఒక‌వేళ స‌రిగ్గా ర‌ద్దు చేయ‌క‌పోతే, నెల‌వారి బిల్లుల చెల్లింపు కొన‌సాగుతూనే ఉంటాయి. అది మీకు తెలియ‌క పెనాల్టీలు ప‌డుతూనే ఉంటాయి. త‌ద్వారా క్రెడిట్ స్కోరు ప్ర‌భావితం అవుతుంది. 

3. కొత్త కార్డును ర‌ద్దు చేయ‌డం మంచిది:
మీకు ఒక‌టి కంటే ఎక్కువ కార్డులు ఉన్న‌ప్పుడు చివ‌రిగా లేదా కొత్త‌గా తీసుకున్న కార్డు ర‌ద్దు చేసుకోవ‌డం మంచిది. క్రెడిట్ కార్డు వ‌య‌సు కూడా క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేస్తుంది. పాత క్రెడిట్‌ కార్డు ఉన్నప్పుడు.. దాని బిల్లుల చెల్లింపుల చరిత్ర అధికంగా ఉంటుంది. వాటిని క్రమం తప్పకుండా చెల్లిస్తే.. మీ రుణ చరిత్రపై ఒక అవగాహనకు వ‌చ్చి.. బాధ్యతాయుత‌మైన వినియోగ‌దారునిగా మిమ్మ‌ల్ని గుర్తిస్తాయి రుణ సంస్థ‌లు. అందుకే, 10 ఏళ్లకు మించి ఉపయోగిస్తున్న కార్డులను రద్దు చేసుకోకపోవడమే మంచిది. ఒక‌వేళ మీరు పాత క్రెడిట్ కార్డుని ర‌ద్దు చేస్తుంటే.. క్రెటిట్ స్కోరుపై దాని ప‌ర్య‌వ‌సానాల‌ను తెలుసుకోవాలి. 

4. రుణ వినియోగ నిష్ప‌త్తి పెర‌గొచ్చు:
క్రెడిట్‌ కార్డును రద్దు చేస్తున్నామంటే దాని అర్థం క్రెడిట్‌ ఖాతాను మూసేస్తున్నట్లే. మీకు అందుబాటులో ఉన్న రుణ మొత్తం తగ్గిపోతుంది. అలాగే ఇతర కార్డుల్లో ఉన్న రుణ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది. ఉదాహరణకు మీ దగ్గర నాలుగు క్రెడిట్‌ కార్డులున్నాయనుకుందాం. ఒక్కోదాని పరిమితి రూ. 50 వేలు. మీరు నెలకు ఈ కార్డులన్నింటిలో కలిపి రూ. 50,000 ఖర్చు చేస్తారనుకుందాం. అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 25 శాతం. ఒకవేళ మీరు ఇందులో ఒక కార్డును వెనక్కి ఇచ్చేస్తే అప్పుడు మీ రుణ వినియోగ నిష్పత్తి 33 శాతానికి చేరుకుంటుంది. మీ రుణ వినియోగ నిష్పత్తి 30 శాతం కన్నా మించితే.. మీరు అప్పులపై అధికంగా ఆధారపడతారని బ్యాంకులు భావిస్తాయి. దీంతోపాటు మీ రుణ వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు క్రెడిట్‌ స్కోరూ తగ్గుతుంది. 

5. రుణం కోసం ప్లాన్ చేస్తుంటే:
గృహ రుణం వంటి దీర్ఘ‌కాలిక రుణాల మంజూరులో క్రెడిట్ స్కోరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒక‌వేళ‌ మీరు గృహ‌రుణం, విద్యారుణం వంటి దీర్ఘ‌కాలిక రుణాల కోసం ప్లాన్ చేస్తుంటే ప్ర‌స్తుతం ఉన్న క్రెడిట్ కార్డును రద్దు చేయ‌డం వ‌ల్ల క్రెడిట్ స్కోరు త‌గ్గే అవ‌కాశం ఉంది. దీంతో  అత్యుత్త‌మ వ‌డ్డీ రేట్ల‌తో రుణం పొందే అవ‌కాశం కోల్పోవ‌చ్చు. అందువ‌ల్ల త్వ‌ర‌లోనే రుణం తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్న వారు కార్డును ర‌ద్దు చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది. 

6. రివార్డు పాయింట్లు ముందే రీడీమ్ చేసుకోండి:
క్రెడిట్ కార్డును ఉప‌యోగించి చేసే చెల్లింపుల‌పై రివార్డు పాయింట్లను అందిస్తాయి కార్డు జారీ సంస్థ‌లు. ఈ రివార్డు పాయింట్ల‌తో క్యాష్ బ్యాక్‌లు, డిస్కౌంట్లు, కూపన్‌లు మొదలైన వాటిని పొంద‌చ్చు. కార్డు ర‌ద్దు స‌మ‌యంలో చాలా మంది వీటి గురించి మ‌ర్చిపోతుంటారు. కాబట్టి, మీ క్రెడిట్ కార్డ్‌ని ర‌ద్దు చేసే ముందు, మీ ప్రస్తుత రివార్డు పాయిట్ల‌ను రీడీమ్ చేసినట్లు నిర్ధారించుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని