ఈఏడాది వేతనాల్లో 6.4% వృద్ధి!

ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో వేతనాలు సగటున 6.4 శాతం (ప్రతి రూ.1000కి రూ.64) మేర పెరిగే అవకాశం ఉందని ఓ సర్వే అంచనా వేసింది. 2020లో వేతనాలు సగటున 5.9 శాతమే పెరిగాయి. ‘కొవిడ్‌-19 సంక్షోభం

Published : 12 Feb 2021 00:47 IST

విల్స్‌ టవర్స్‌ వాట్సన్‌ అంచనా

దిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో భారత్‌లో వేతనాలు సగటున 6.4 శాతం (ప్రతి రూ.1000కి రూ.64) మేర పెరిగే అవకాశం ఉందని ఓ సర్వే అంచనా వేసింది. 2020లో వేతనాలు సగటున 5.9 శాతమే పెరిగాయి. ‘కొవిడ్‌-19 సంక్షోభం సృష్టించిన పరిణామాల ప్రభావం నుంచి బయటపడేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాపారాలూ పుంజుకుంటున్నాయి. వేతన పెంపు రూపంలోకి కూడా ఇది మారాల్సి ఉంద’ని విల్స్‌ టవర్స్‌ వాట్సన్‌ ఇండియా కన్సల్టింగ్‌ హెడ్‌ (ట్యాలెంట్‌, రివార్డ్స్‌) రాజుల్‌ మాథుర్‌ తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే పారితోషిక కేటాయింపులను కంపెనీలు తగ్గించుకున్నప్పటికీ.. కీలక, అధిక నైపుణ్యం ఉన్న వాళ్లను చేజారిపోకుండా కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2021లోనూ పనితీరు, వ్యాపార ఉత్పత్తి ఆధారంగా వేతనాలు చెల్లించడం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. 2020 అక్టోబరు- నవంబరులో విల్స్‌ టవర్స్‌ వాట్సన్‌ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 130 దేశాలకు చెందిన 18,000 మంది వెల్లడించిన అభిప్రాయాలు ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఆ వివరాలు ఇలా..
* కంపెనీలు వేతనాల పెంపు నిమిత్తం కేటాయించిన బడ్జెట్‌లో సగటున 20.6 శాతం వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లకే కేటాయిస్తున్నాయి. దేశంలోని మొత్తం ఉద్యోగుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లు 10.3 శాతం వరకు ఉంటుందని నివేదిక తెలిపింది. ఉదాహరణకు సాధారణ పనితీరు కనబర్చిన ఉద్యోగికి రూ.1, ఓ మోస్తరుగా మెరుగైన ప్రదర్శన కనబర్చిన వాళ్లకు రూ.1.25 కేటాయిస్తే.. అత్యుత్తమ పనితీరు కనబర్చిన వాళ్లకు రూ.2.35 కంపెనీలు కేటాయించాయని పేర్కొంది.
* ఎగ్జిక్యూటివ్‌ స్థాయి అధికారులకు 2021లో సగటున 7 శాతం మేర వేతన పెంపు ఉండొచ్చని, కిందటేడాది నమోదైన 7.1 శాతం వేతన వృద్ధితో పోలిస్తే ఇది తక్కువేనని నివేదిక తెలిపింది. మధ్య స్థాయి ఉద్యోగులు, వృత్తి నిపుణులు, ఇతర సిబ్బందికి 2020లో 7.5 శాతం వేతనాలు పెరగ్గా, 2021లో 7.3 శాతమే వేతనాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
* 20201లో భారత్‌లో సగటున 6.4 శాతం వేతనాలు పెరిగే అవకాశం ఉండగా.. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోని కీలక దేశాలైన ఇండోనేసియాలో 6.5%, చైనాలో 6%, ఫిలిప్పీన్స్‌లో 5%; సింగపూర్‌లో 3.5%, హాంగ్‌కాంగ్‌లో 3% మేర వేతనాల వృద్ధికి ఆస్కారం ఉంది.
* సర్వేలో పాల్గొన్న భారతీయ కంపెనీల్లో 37 శాతం కంపెనీలు రాబోయే 12 నెలల్లో వ్యాపారాదాయాలపై ఆశావహ దృక్పథంతో ఉన్నాయి. అయితే నియామకాలు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. 10 శాతం కంపెనీలు నియామకాలను చేపట్టే యోచనలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. గత త్రైమాసికంలో ఇలాంటి ప్రణాళికలో ఉన్న కంపెనీల సంఖ్య 14 శాతం వరకు ఉండటం గమనార్హం.
* సాంకేతికత, ఔషధ, వినియోగ వస్తువులు, రిటైల్‌ రంగాల్లో సగటున వేతనాలు 8 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక సేవల విభాగంలో 7%; బీపీఓ రంగంలో 6%, ఇంధన రంగంలో 4.6 శాతం మేర వేతనాల పెరగొచ్చని నివేదిక తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని