APY: 2021-22లో ఇప్ప‌టి వ‌ర‌కు 65 ల‌క్ష‌ల స‌భ్యుల‌ చేరిక

ఏపీవై స‌భ్యులు 60 ఏళ్లు నిండిన త‌రువాత, వారు ఎంచుకున్న స్లాబ్ ప్ర‌కారం రూ. 1000 నుంచి రూ. 5000 వ‌ర‌కు  నెల‌వారి క‌నీస పెన్ష‌న్ పొందుతారు. 

Published : 06 Jan 2022 11:25 IST


ప్ర‌భుత్వ క‌నీస పెన్ష‌న్ హామీ ప‌థ‌కం అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో చేరే వారి సంఖ్య భారిగా పెరిగింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22)లో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌థ‌కంలో చేరిన చందాదారుల సంఖ్య 65 ల‌క్ష‌లు దాటింద‌ని పెన్ష‌న్ రెగ్యులేట‌రీ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అథారిటి (పీఎఫ్ఆర్‌డీఏ) తెలిపింది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగింపుకు, అంటే మార్చి 31 నాటికి ఈ ప‌థ‌కంలో చేరే వారి సంఖ్య కోటికి చేరుతుంద‌ని పీఎఫ్ఆర్‌డీఏ ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఈ ప‌థ‌కాన్ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మే 9, 2015లో ప్రారంభించగా ఇప్ప‌టి వ‌ర‌కు 3.68 కోట్ల మంది ఈ ప‌థ‌కంలో స‌భ్యుల‌య్యారు. ఈ ప‌థ‌కం ప‌రిధిలోని ఆస్తుల విలువ దాదాపు రూ. 20వేల కోట్ల‌కు చేరింది. మీరు ఈ ప‌థ‌కంలో చేరాల‌నుకుంటున్నారా?అయితే అర్హ‌త, ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకోండి. 

అటల్ పెన్షన్ యోజన పథకం.. ప్ర‌యోజ‌నాలు..

వయస్సు, అర్హత:

వ్యక్తి వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వారికి 60 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పటి నుంచి పెన్షన్ చెల్లిస్తారు. ఒక‌వేళ చందాదారుడు మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త‌కు అంద‌జేస్తారు. ఇద్ద‌రూ మ‌ర‌ణిస్తే నామినీకి ఈ పెన్ష‌న్ మొత్తాన్ని అందిస్తారు.

చెల్లించాల్సిన కనీస మొత్తం:

ఈ పథకంలో చేరాలనుకునే వారు చెల్లించాల్సిన మొత్తం రూ. 42 నుంచి రూ. 210 మధ్య ఉంటుంది. ఇది చందాదారుడి పథకంలో చేరిన సమయంలో అతని వయస్సు, పెన్షన్ స్లాబ్ ఆధారంగా మారుతూ ఉంటుంది. అలాగే చెల్లించాల్సిన మొత్తం ప్రతినెలా చందాదారుడి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా డెబిట్ అవుతుంది. చందాదారుడు ప్రతి నెలా, మూడు నెలలకోసారి లేదా ఆరు నెలలకోసారి చెల్లించే ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతను నెలకు రూ. 1000 పెన్షన్ పొందడానికి ప్రతి నెలా రూ. 42 చెల్లించాల్సి ఉంటుంది.

పథకం ప్రయోజనాలు:

ముందుగా నిర్దేశించిన స్లాబ్ ప్రకారం చందాదారులు ఈ పథకం కింద నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 వరకు పెన్షన్ పొందగలరు. ఉదాహరణకు ఒక చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతను 60 సంవత్సరాల తరవాత నెలకు రూ. 5000 పెన్షన్ పొందడానికి ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది. అదే 40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 60 సంవత్సరాల తరవాత నెలకు రూ. 5000 పెన్షన్ పొందడానికి ప్రతి నెలా రూ. 1454 చెల్లించాల్సి ఉంటుంది. ఎంత చిన్న వయస్సులో ఈ పథకంలో చేరితే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఆదాయ పన్ను ప్రయోజనాలు: 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ మాదిరిగానే ఈ పెన్షన్ పథకం కింద చెల్లించే మొత్తానికి కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద చెల్లించిన మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) ఆదాయ పన్ను మినహాయింపు ప్రకారం ప్రస్తుత పరిమితి రూ. 50,000 గా ఉంది.

పథకంలో చేరడం, నిష్క్రమించడం ఎలా:

ఈ పథకంలో చేరాలనుకునే వారికి ఏదైనా బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసు లో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. అటల్ పెన్షన్ యోజన చందాదారులు కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే 60 సంవత్సరాల వయస్సులోపు పథకం నుంచి ముందస్తు నిష్క్రమణ అయ్యే అవకాశం ఉంది. మరణం/న‌యం కాని వ్యాధులు సోకిన సందర్భాల్లో మాత్రమే ముందస్తు నిష్క్రమణకు అనుమతిస్తారు.

ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం..
* ముందుగా ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ ఖాతాకు లాగిన్ అవ్వాలి.

* ‘ఇ-స‌ర్వీసెస్’ ఆప్ష‌న్‌లో అందుబాటులో ఉన్న ‘సోష‌ల్ సెక్యూరిటీ స్కీమ్స్‌’పై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది.

* ఇక్క‌డ ‘అట‌ల్ పెన్స‌న్ యోజ‌న’ను ఎంపిక చేసుకోవాలి.

* ఏపీవై అనుసంధానించే పొదుపు ఖాతా నంబర్‌ను ఎంచుకుని స‌బ్మిట్ చేయాలి. 

* స‌బ్మిట్ చేసిన త‌రువాత క‌స్ట‌మ‌ర్ ఐడెంటిఫేకేష‌న్‌ (సీఐఎఫ్‌) నంబర్‌ను సెల‌క్ట్ చేసుకునే ఆప్ష‌న్ వ‌స్తుంది.

* సిస్ట‌మ్ జ‌న‌రేట్ చేసిన సీఐఎఫ్ నంబర్‌ను సెల‌క్ట్ చేయాలి.

* స్క్రీన్‌పై క‌నిపించే ఇ-ఫారాన్ని పూర్తి చేయాలి.

* వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను పూర్తి చేసిన తర్వాత, నామినీ వివ‌రాల‌ను పూర్తిచేయాలి.

* పెన్ష‌న్ మొత్తం, నెల‌వారీగా, త్రైమాసికంగా, వార్షికంగా.. మీకు కావల‌సిన కాంట్రీబ్యూషన్ పిరియ‌డ్‌.. మొద‌లైన వివ‌రాలు ఇవ్వాలి.

* ఫారం స‌బ్మిట్ చేసి, ఎక్‌నాలెడ్జ్‌మెంట్ ర‌శీదు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

ఈ పధకం ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇతరులకు ఇది సరికాకపోవచ్చు. మంచి పెన్షన్, పదవీ విరమణ నిధి కోసం ఎన్పీఎస్ లాంటి పధకాలను పరిశీలించవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని