సాధారణ బీమా రంగంలో 7-9 శాతం వృద్ధి

ఆరోగ్య, వాహన బీమా పాలసీలను అధికంగా తీసుకుంటున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ బీమా రంగ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ)లో 7-9 శాతం వృద్ధి

Published : 09 Jun 2021 01:56 IST

ఇక్రా అంచనా

ముంబయి: ఆరోగ్య, వాహన బీమా పాలసీలను అధికంగా తీసుకుంటున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధారణ బీమా రంగ స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం (జీడీపీఐ)లో 7-9 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీఐ నాలుగు శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలోకి మారడంలో ఆలస్యం చేయడం.. నేరుగా పాలసీదారులను కలవడానికే ప్రాధాన్యం ఇవ్వడం లాంటి వాటితో ఆ సంస్థల వృద్ధి రెండు శాతం తగ్గి, రూ.71,800 కోట్లకు పరిమితమయ్యిందని పేర్కొంది. ప్రైవేటు బీమా సంస్థల ప్రీమియం ఆదాయం 8 శాతం పెరిగి, రూ.1.13లక్షల కోట్లు వసూలయ్యిందని తెలిపింది. మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారు పెరుగుతున్నారు. దీంతోపాటు వాహన బీమా పాలసీలూ అధికంగా అమ్ముడవుతున్నాయి. ఈ రెండు విభాగాల అండతో.. సాధారణ బీమా రంగంలో 7-9 శాతం వృద్ధి నమోదవుతుందని భావిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. నాలుగు ప్రభుత్వ బీమా సంస్థలు, 13 ప్రైవేటు బీమా సంస్థల పనితీరును పరిశీలించిన తరువాత ఈ అంచనాకు వచ్చినట్లు వెల్లడించింది. కరోనా రెండో దశ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ బీమా సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12,400-రూ.13,500 కోట్ల మేరకు నష్టపోయే ఆస్కారం ఉందని పేర్కొంది. చిన్న బీమా సంస్థల్లో విలీనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది.


భారత్‌లోకి టాయ్స్‌ రస్‌ ఉత్పత్తులు
తీసుకురానున్న ఫ్లిప్‌కార్ట్‌ సంయుక్త సంస్థ

దిల్లీ: బొమ్మలు, పిల్లల బ్రాండ్లు టాయ్స్‌ రస్‌, బేబీస్‌ రస్‌ ఉత్పత్తులను భారత్‌లోని ఆన్‌లైన్‌ వినియోగదారుల కోసం తీసుకువస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఇందుకోసం ఏస్‌ టర్టిల్‌తో సంయుక్త సంస్థను ఫ్లిప్‌కార్ట్‌ ఏర్పాటు చేసింది. టాయ్స్‌ రస్‌లో నియంత్రిత వాటా కలిగిన డబ్ల్యూహెచ్‌పీ గ్లోబల్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా టాయ్స్‌ రస్‌, బేబీస్‌ రస్‌ లైసెన్సింగ్‌ హక్కులను సంయుక్త సంస్థ పొందినట్లు వెల్లడించింది. సంయుక్త సంస్థకు సంబంధించిన వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించలేదు. బొమ్మల విభాగంలో గత 70 ఏళ్లుగా టాయ్స్‌ రస్‌ అగ్రగామి స్థానంలో ఉంది. 25కు పైగా దేశాల్లో 900 బ్రాండెడ్‌ స్టోర్లు, ఇ-కామర్స్‌ వ్యాపారాల ద్వారా కంపెనీ 2 బిలియన్‌ డాలర్లకు పైగా వార్షిక అంతర్జాతీయ రిటైల్‌ విక్రయాలను నమోదు చేస్తోంది. వినియోగదారులతో ఫ్లిప్‌కార్ట్‌కు ఉన్న అనుబంధం, ఏస్‌ టర్టిల్‌ వినూత్న టెక్నాలజీలు సంయుక్త సంస్థకు దోహదపడతాయని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని