నవంబరులో 9.33 లక్షల కొత్త ఉద్యోగాలు

దేశంలోని సంఘటిత రంగంలో గత నవంబరులో 9.33 లక్షల కొత్త ఉద్యోగాలు లభించాయని,  కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ).....

Published : 26 Jan 2021 01:24 IST

దిల్లీ: దేశంలోని సంఘటిత రంగంలో గత నవంబరులో 9.33 లక్షల కొత్త ఉద్యోగాలు లభించాయని,  కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకంలో వీరంతా చేరారని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) తెలిపింది. 2019 నవంబరులో లభించిన కొత్త ఉద్యోగాలు 11.99 లక్షలతో పోలిస్తే ఈసారి తగ్గాయి. లాక్‌డౌన్‌ తరవాత కొత్త ఉద్యోగాలు పెరిగాయని  ఎన్‌ఎస్‌ఓ నివేదిక తెలిపింది.  ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వద్ద నికర కొత్త నమోదులు గత అక్టోబరులో 10.56 లక్షలు ఉండగా, నవంబరులో 10.10 లక్షలకు తగ్గినట్లు నివేదిక తెలిపింది.


అప్పీల్‌కు వెళ్లను.. జైలు శిక్ష అనుభవిస్తా

శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌

సియోల్‌: వ్యాపార ప్రయోజనాల నిమిత్తం దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలికి లంచం ఇచ్చారనే ఆరోపణలపై రెండున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ సియోల్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, అప్పీల్‌కు వెళ్లకూడదని శామ్‌సంగ్‌ వారసుడు, వైస్‌ ఛైర్మన్‌ లీ జియో-యాంగ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే లీ కష్టాలు ఇంకా పూర్తిగా తొలగలేదు. 2015లో శామ్‌సంగ్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థల విలీనానికి సంబంధించి షేర ధరల్లో అవకతకవలు, ఆడిట్‌ ఉల్లంఘనకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపైనా ఆయన విడిగా విచారణ ఎదుర్కోనున్నారు. శామ్‌సంగ్‌ సామ్రాజ్యంపై తన పట్టు మరింతగా పెంచుకునేందుకు ఈ ఒప్పందం లీకి ఉపయోగపడింది. అక్రమ పద్ధతిలో లీ కుటుంబం లబ్ధి పొందుతోందంటూ ఈ ఒప్పందాన్ని వాటాదార్లు వ్యతిరేకించినా, లీ మాత్రం ప్రభుత్వ అండ తీసుకున్నట్లుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే లీ కోర్టు కేసుల వ్యవహారాలపై శామ్‌సంగ్‌ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు.


ఆంధ్రా బ్యాంకు శాఖలతో ఐటీ అనుసంధానం పూర్తి

యూనియన్‌ బ్యాంక్‌

ముంబయి: ఆంధ్రా బ్యాంక్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ఆ బ్యాంకుకు చెందిన అన్ని శాఖలతో ఐటీ అనుసంధానాన్ని పూర్తి చేసినట్లు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గతేడాది నవంబరులో కార్పొరేషన్‌ బ్యాంక్‌ శాఖలతో ఐటీ అనుసంధానాన్ని యూనియన్‌ బ్యాంక్‌ పూర్తి చేసింది. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ల విలీనం 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ అనుసంధానంతో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ వినియోగదారులు తమ కోర్‌ బ్యాంకింగ్‌ సొల్యూషన్‌కు (సీబీఎస్‌) మారారని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.  ప్రస్తుతమున్న ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, చెక్‌లను మార్చి 31, 2021 వరకు ఉపయోగించుకోవచ్చని బ్యాంకు తెలిపింది.

బడ్జెట్‌లో పలు వస్తువులపై కస్టమ్స్‌ సుంకం సవరింపు

దిల్లీ: ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌లో పలు వస్తువులపై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రభుత్వం సవరించే అవకాశం ఉంది. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఫర్నీచర్‌ ముడిపదార్థాలు, కాపర్‌ తుక్కు, కొన్ని రసాయనాలు, టెలికాం పరికరాలు, రబ్బర్‌ ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కట్‌, పాలిష్‌ చేసిన వజ్రాలు, రబ్బర్‌ వస్తువులు, తోళ్ల దుస్తులు, టెలికాం పరికరాలు, కార్పెట్‌ వంటి 20కి పైగా వస్తువులపై దిగుమతి సుంకాన్ని తగ్గించొచ్చని, ఫర్నీచర్‌, కాపర్‌ తయారీలో వాడే ముడివస్తువులు వంటివాటిపై కస్టమ్స్‌ సుంకాన్ని తొలగించే అవకాశం ఉందని తెలిపారు. ముడివస్తువుల ధరలు అధికంగా ఉండటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు అధికంగా ఉన్నాయని, అందువల్లే చైనా, వియత్నాం వంటి దేశాలు ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు వివరించారు. ఫ్రిడ్జ్‌, వాషింగ్‌ మెషీన్‌, క్లాత్స్‌ డ్రైయర్‌ వంటి వాటిపై సుంకం పెంచే యోచన ఉన్నట్లు తెలుస్తోంది.


సంక్షిప్తంగా

* గతేడాది భారత్‌లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 13 శాతం పెరిగాయి. డిజిటల్‌ రంగంలో పెట్టుబడులకు విదేశీ పెట్టుబడిదార్లలో ఆసక్తి పెరగడం ఇందుకు కారణం. కరోనా మహమ్మారి ప్రభావంతో బ్రిటన్‌, అమెరికా, రష్యాలో ఎఫ్‌డీఐ తగ్గినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
* హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు చివరి రోజున 26.66 రెట్ల స్పందన లభించింది.  ఇష్యూలో భాగంగా 1,56,20,948 షేర్లు జారీ చేయనుండగా, 41,64,36,944 షేర్లకు బిడ్‌లు దాఖలయ్యాయి.
* మౌలిక రంగంలో పెట్టుబడులు పుంజుకునేలా చేసేందుకు వచ్చే బడ్జెట్లో ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌సీఎల్‌)కు రూ.5,000 కోట్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది.
* 2030 కల్లా సహజవావాయువుతో నడిచే వాహనాల సంఖ్యకు మించి విద్యుత్‌ వాహనాలు ఉంటాయని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది.  
* ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఆరు మ్యూచువల్‌ ఫండ్‌ల రద్దుకు సంబంధించి ఇ-ఓటింగ్‌ ప్రక్రియపై అభ్యంతరాలు, యూనిట్‌హోల్డర్లకు డబ్బుల పంపిణీ అంశాలపై ఫిబ్రవరి 1న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
* ముంబయి- అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ (బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌) కోసం 28 ఉక్కు బ్రిడ్జ్‌ల ఫ్యాబ్రికేషన్‌ నిమిత్తం రూ.1390 కోట్ల కాంట్రాక్టును ఎల్‌ అండ్‌ టీ, జపాన్‌ ఐహెచ్‌ఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సిస్టమ్స్‌ కన్సార్షియం దక్కించుకుందని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని