Tesla Hijack: టెస్లా హైజాక్‌‌.. 19 ఏళ్ల కుర్రాడి సవాల్!

జర్మనీ చెందిన ఓ యువ పరిశోధకుడు టెస్లా కారులో లోపం కనిపెట్టాడు. కారుని హ్యాక్‌ చేయగలమని నిరూపించాడు...

Updated : 18 Jan 2022 16:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజురోజుకీ మనిషి జీవితంలో ఇంటర్నెట్‌ భాగమైపోతోంది. ఇంట్లోని ఫ్రిజ్‌, ఏసీ, తలుపుల దగ్గరి నుంచి కార్ల వరకు అన్నింటినీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌తోనే ఆపరేట్‌ చేసే రోజులు వచ్చేశాయి. ఈ క్రమంలోనే డ్రైవర్‌ రహిత వాహనాలూ పురుడుపోసుకుంటున్నాయి. అయితే, ఇంటర్నెట్‌తో పాటు హ్యాకింగ్ వంటి సైబర్ ముప్పు తోడుగా రావడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇంటర్నెట్‌కి అనుసంధానమై ఉన్న ఓ అటానమస్‌ కారుని హ్యాక్‌ చేస్తే.. ముప్పు ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించలేం! ఇప్పుడు ఈ చర్చే ఆన్‌లైన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. దానికి కారణం జర్మనీకి చెందిన ఓ యువ పరిశోధకుడు టెస్లా (Tesla) కారులో కనిపెట్టిన లోపమే!

అనుకోకుండా...

జర్మనీకి చెందిన 19 ఏళ్ల డేవిడ్‌ కొలంబో సైబర్‌ సెక్యూరిటీ (Cybersecurity) పరిశోధకుడు. ఓ ఫ్రెంచ్‌ కంపెనీకి సెక్యూరిటీ ఆడిట్‌ నిర్వహిస్తున్న సమయంలో ఓ అసాధారణ లోపాన్ని గుర్తించాడు. కంపెనీ నెట్‌వర్క్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ వాడుతున్న టెస్లా కారు వివరాలన్నీ బయటపడ్డాయి. కారు ఏ సమయంలో ఎక్కడ ఉంది? వంటి డేటాను డేవిడ్‌ గుర్తించాడు. దీనిపై మరింత లోతుగా పరిశోధించడంతో ఇదే ప్రోగ్రాంపై నడుస్తున్న ఇతర టెస్లా కార్ల యజమానులకు కొన్ని కమాండ్స్‌ కూడా విజయవంతంగా పంపగలిగాడు. ఈ లోపాన్ని ఆసరాగా చేసుకొని కారుకు సంబంధించిన కొన్ని ఫంక్షన్లను హైజాక్‌ చేయగలిగాడు. కారు డోర్లను తెరవడం, మూయడం, మ్యూజిక్‌ ఆన్‌ చేయడం, సెక్యూరిటీ ఫీచర్లను ఆఫ్‌ చేయడం వంటి ఫీచర్లను అధీనంలోకి తీసుకొన్నాడు. అయితే, కారు స్టీరింగ్‌, బ్రేకింగ్‌ సహా ఇతర ఆపరేషన్లను మాత్రం కంట్రోల్‌ చేయలేకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని డేవిడ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపాడు.

అధీనంలోకి 20 కార్లు... 

టెస్లా మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. అయితే, తనకు కంపెనీ వ్యక్తిగతంగా మెయిల్‌ పంపిందని డేవిడ్‌ వెల్లడించాడు. విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొన్నట్లు వెల్లడించాడు. అలాగే తాను కనిపెట్టిన లోపాలన్నింటినీ వారితో పంచుకున్నట్లు పేర్కొన్నాడు. అమెరికా జాతీయ రహదారులు, ట్రాఫిక్‌ భద్రతా విభాగం అధికార ప్రతినిధి సైతం ఈ విషయంపై స్పందించారు. దీనిపై టెస్లాతో చర్చించామని.. తమ సైబర్‌ సెక్యూరిటీ బృందం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లోని 20 టెస్లా కార్లను తాను నియంత్రించినట్లు డేవిడ్‌ పేర్కొన్నాడు. జర్మనీ, ఐర్లాండ్‌, అమెరికాలో ముగ్గురు టెస్లా యజమానులనూ తాను కాంటాక్ట్‌ చేయగలిగినట్లు తెలిపాడు. కారు హారన్‌ను మోగించనున్నట్లు వారికి ముందే చెప్పి .. చేసి చూపించాడు. తద్వారా వారి కారులోని లోపాల్ని తెలియజేశానన్నాడు. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్ల రూపంలో తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపాడు. కారు నడిపే యజమానులను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ పనిచేసినట్లు వివరించాడు. తాను కాకుండా ఇంకెవరో దీన్ని చెడుకు వాడుకుంటే ఫలితం మరోలా ఉంటుందని హెచ్చరించాడు!

ఇది తొలిసారేం కాదు...

ఇలా కార్లలో సైబర్ భద్రతా లోపాలు బయటపడటం ఇదే తొలిసారి కాదు. ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసిన వాహనాలను హ్యాక్‌ చేయొచ్చని 2015లోనే నిరూపితమైంది. ఓ ఇద్దరు పరిశోధకులు ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేసిన ‘జీప్‌ చెరోకి’ని నియంత్రించి చూపించారు. అమెరికా రోడ్లపై ఓ జర్నలిస్టు గంటకు 70 మైళ్ల వేగంతో వెళుతున్న చెరోకీ ఇంజిన్‌ను ఆఫ్‌ చేయగలిగారు. ఇంటర్నెట్‌కు అనుసంధానం చేసిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌లోని లోపాన్ని వాడుకొన్నట్లు వివరించారు. దీంతో ఆ వాహన తయారీ సంస్థ 1.4 మిలియన్ల కార్లు, ట్రక్కులను రీకాల్‌ చేసింది. ఇది జరిగిన కొంత కాలానికే టెస్లా ‘మోడల్‌-ఎస్‌’లోని సాఫ్ట్‌వేర్‌ లోపంతో మరో ఇద్దరు పరిశోధకులు ఇంజిన్‌ను ఆఫ్‌ చేయగలిగారు. తర్వాత టెస్లా వారితో కలిసి పనిచేసి లోపాన్ని సవరించింది. ఇలా అనేక సందర్భాల్లో వాహనాల్లో ఉన్న సైబర్ లోపాలను పరిశోధకులు ఎత్తి చూపారు.

టెస్లా ఎఫ్‌ఎస్‌డీ కార్లు...

టెస్లా నుంచి వస్తున్న ప్రతి కొత్త కారులో ఆటోపైలట్‌ ఆప్షన్‌ ఉందని సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) చెబుతున్నారు. అంటే డ్రైవర్‌ తన చేతుల్ని స్టీరింగ్‌పై ఉంచినప్పటికీ.. అన్ని పనుల్ని తాను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ను అనుసరించడం, ఏదైనా వాహనం అడ్డొచ్చినప్పుడు బ్రేకులు వేయడం వంటి పనులు సెన్సార్లు, కెమెరాల సాయంతో కారు దానికదే నిర్వహిస్తుంది. దీన్ని లెవెల్‌-2 అటానమస్‌ అంటారు. అయితే, ఇందులో డ్రైవర్‌ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఏ సమయంలోనైనా కారుని నియంత్రణలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అదే లెవెల్‌-3 దాటితే.. కారు ప్రయాణంలో అసలు డ్రైవర్‌ జోక్యం అవసరం లేదని అర్థం. అయితే, 2020 తర్వాత వచ్చిన కార్లన్నింటినీ ఫుల్లీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ (FSD)గా మార్చొచ్చని మస్క్‌ చెబుతున్నారు. అందుకోసం ప్రత్యేక కిట్‌ను కొని అమర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కిట్‌ ప్రయోగ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, నిపుణులు మాత్రం ఇది పూర్తి ఎఫ్‌ఎస్‌డీ కాదని చెబుతున్నారు. ఇది కూడా లెవెల్‌-2 అటానమస్ కిందకే వస్తుందంటున్నారు. ఏదేమైనా.. పూర్తి అటానమస్‌ కార్లు హ్యాకయితే పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు డేవిడ్‌ కొలంబో లేవనెత్తుతున్న ప్రశ్న!

ఎవరీ డేవిడ్‌ కొలంబో...

డేవిడ్‌ కొలంబోకు 13 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లికి రొమ్ముక్యాన్సర్‌ వచ్చింది. తర్వాత సంవత్సరమే ఆమె మరణించారు. దీని నుంచి బయటపడడానికి డేవిడ్‌ కోడింగ్‌లో నిమగ్నమయ్యాడు. తర్వాత స్కూల్‌పైన కూడా ఆసక్తి పోయింది. వారానికి కేవలం రెండు రోజులు మాత్రమే స్కూల్‌కు వెళ్లేలా తన తండ్రి సాయంతో ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకున్నాడు. మిగిలిన సమయమంతా కోడింగ్‌లోనే గడిపేవాడు. అలా సైబర్‌ సెక్యూరిటీలో నైపుణ్యం సాధించాడు. కొలంబో టెక్నాలజీ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ‘‘కంపెనీలను సైబర్‌ ముప్పు నుంచి కాపాడాలనుకుంటున్న నాకు లాటిన్‌, సాహిత్యం వంటి విషయాలెందుకు? అనిపించింది. అందుకే స్కూల్‌కి వెళ్లడం తగ్గించా’’ అని కొలంబో ఓ సందర్భంలో చెప్పాడు. సాఫ్ట్‌వేర్‌లో లోపాల్ని కనిపెట్టే అనేక పోటీల్లో తాను పాల్గొన్నట్లు వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని