ఈ కారు కావాలంటే.. బుక్‌ చేసి 4 ఏళ్లు ఆగాల్సిందే!

టయోటా నుంచి వస్తోన్న ఎల్‌సీ 300 కారు కోసం కనీసం నాలుగేళ్లు వేచి చూడాల్సిందే. ఎందుకంటే...

Updated : 22 Jan 2022 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో లైసెన్స్‌రాజ్‌ అమల్లో ఉన్న రోజుల్లో స్కూటర్‌ను బుక్‌ చేసిన తర్వాత అది రావడానికి దాదాపు 10 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వచ్చేదని పెద్దలు చెబుతుండేవారు. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. కొనాలన్న ఆలోచన వచ్చిన గంటల్లో బండి ఇంట్లో వచ్చి వాలిపోతోంది. అయితే, టయోటా నుంచి వస్తున్న ఓ ప్రీమియం కారు కోసం మాత్రం మళ్లీ లైసెన్స్‌రాజ్‌ నాటి రోజుల తరహాలో ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని మరీ పదేళ్లు కాదు గానీ ఓ నాలుగేళ్ల నిరీక్షణైతే తప్పడం లేదు.

టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ 300 మోడల్‌ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ కారు కావాలనుకున్నవారు బుక్‌ చేసుకున్న తర్వాత నాలుగేళ్ల పాటు వేచి చూడక తప్పదని టయోటా ప్రకటించింది. అందుకు క్షమాపణలు కూడా చెప్పింది. సెమీ కండక్టర్ల కొరతే అందుకు కారణమని వివరణ ఇచ్చింది. నాలుగేళ్ల వ్యవధిని తగ్గించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇతర మార్కెట్లలో ఎల్‌సీ300 విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో 2022 మూడో త్రైమాసికంలో విడుదలయ్యే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ, 2023 చివరి వరకు గానీ ఇది అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఎల్‌సీ300ను అత్యాధునిక సాంకేతికతతో, అధిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకే కారు తయారీలో భారీ ఎత్తున సెమీకండర్ల అవసరం ఏర్పడింది. తీరా వాటి కొరత తలెత్తడంతో ఉత్పత్తిలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.

ఎల్‌సీ300  ఫీచర్లు...

ల్యాండ్ క్రూయిజర్ 300ను టీఎన్‌జీఏ ప్లాట్‌ఫారాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఆన్-రోడ్ డైనమిక్స్ విషయానికి వస్తే తేలికగా, చురుకుగా, స్థిరంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఎల్‌సీ200తో పోలిస్తే దీని బరువు 200 కిలోలు తక్కువగా ఉంటుంది. అలాగే 10 శాతం తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇంజిన్‌ పరంగా చూస్తే రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 3.5 లీటర్‌, ట్విన్‌ టర్బో ఛార్జ్‌డ్‌ వీ5 ఆయిల్‌ బర్నర్‌ ఇంజిన్‌.. 650 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 415 పీఎస్‌ శక్తిని విడుదల చేస్తుంది. ఇక 3.3 లీటర్‌ ట్విన్‌ టర్బో వీ6 డీజిల్‌ ఇంజిన్‌ 700 ఎన్‌ఎం టార్క్‌ వద్ద 309 పీఎస్‌ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండింట్లో 10-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్ అందుబాటులో ఉంది. 

ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, పానరోమిక్‌ సన్‌రూఫ్‌, హీటెడ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, రంగుల మల్టీ ఇన్ఫో డిస్‌ప్లే, పవర్డ్‌ టెయిల్‌గేట్‌, కీలెస్‌ ఎంట్రీ, పవర్‌ బటన్‌ స్టార్ట్‌ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. మల్టిపుల్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, లేన్‌ కీపింగ్‌ అసిస్ట్‌, ప్రీ-కొలిజన్‌ సిస్టం, ఎమర్జెన్సీ స్టీరింగ్‌, క్రాష్‌ అవైడెన్స్‌ ఫంక్షన్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. నిస్సాన్‌ పాట్రోల్‌, మెర్సిడెజ్ బెంజ్‌ జీఎస్‌, బీఎండబ్ల్యూ ఎక్స్‌7, రేంజ్‌రోవర్‌ వంటి కార్లకు ఇది పోటీ ఇవ్వనుంది. భారత్‌లో దీని ధర రూ.కోటిన్నరకు పైనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని