ATM: లావాదేవీలపై అదనపు భారం..!

వచ్చే జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీపై

Published : 18 Jul 2021 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వచ్చే జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) ఇటీవల బ్యాంకులకు అనుమతిచ్చింది.  బ్యాంకులు ప్రస్తుతం వినియోగదారుల నుంచి ఒక్కో అదనపు లావాదేవీకి 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు, నిర్వహించేందుకు వ్యయాలు పెరగడం, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజులు పెరిగిన నేపథ్యంలో సాధారణ ఖర్చులకు గానూ ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఇటీవల ఆర్బీఐ తెలిపింది. దీంతో పెంచిన ఛార్జీల ప్రకారం 2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది.  సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ప్రతి నెలా 5 ఉచిత లావాదావీలు(ఆర్థిక, ఆర్థికేతర కలిపి) నిర్వహించుకోవడాన్ని కొనసాగించడం వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి 3, ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తారు.

ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్థికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు ఛార్జీ పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై ప్రస్తుత ఛార్జీలు 2014 ఆగస్టు, ఇంటర్‌ఛేంజ్‌ ఫీజుల వసూలు 2012 ఆగస్టు నుంచి అమలవుతున్నాయి. అప్పటి నుంచి ఈ ఛార్జీలను పెంచలేదు. గత మార్చి 31న చూస్తే బ్యాంకుల కార్యాలయాల ప్రాంగణాల పరిధిలో 1,15,605, ఇతర ప్రాంతాల్లో 97,970 ఏటీఎం కేంద్రాలున్నాయి. సుమారు 90 కోట్ల డెబిట్‌ కార్డులు వాడుకలో ఉన్నాయి.

అటు ఎస్‌బీఐ ఏటీఎం, బ్యాంకు బ్రాంచిల ద్వారా చేసే నగదు విత్‌డ్రాలపై సవరించిన సేవా రుసుములు 2021 జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంకు, బీఎస్‌బీడీ ఖాతాదారులకు కూడా ఈ రుసుములు వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఒక నెలలో బ్యాంకు బ్రాంచి, ఏటీఎం వద్ద కలిపి నాలుగు ఉచిత నగదు లావాదేవీలకు మించి చేసే ఉపసంహరణలపై రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి చేసే ఒక్కో కొత్త నగదు విత్‌డ్రా లావాదేవీకి రూ.15 సహా అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని