మీ ఆధార్ తాళంచెవి మీ చేతుల్లోనే!

ఇటీవ‌లి కాలంలో సంక్షేమ‌ ప‌థ‌కాల‌కు, కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ తీసుకునేందుకు ఆఖ‌రుకు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం....

Published : 16 Dec 2020 10:21 IST

ఆధార్ వివ‌రాల‌ను మ‌రింత సుర‌క్షితంగా ఉంచుకునే లాక్ చేసే విధానాన్నితెలుసుకుందాం. 

ఇటీవ‌లి కాలంలో సంక్షేమ‌ ప‌థ‌కాల‌కు, కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ తీసుకునేందుకు ఆఖ‌రుకు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఇదిలా కొన‌సాగుతుండ‌గానే కొన్ని వ‌ర్గాల నుంచి అభ్యంత‌రాలు వెలువెత్తాయి. ఆధార్ స‌హాయంతో ప‌లు చోట్ల బ‌యోమెట్రిక్ వివ‌రాలు వెల్ల‌డించాల్సి రావ‌డంతో త‌మ‌ వ్య‌క్తిగ‌త స‌మాచారం ఎంత మేర‌కు సుర‌క్షితంగా ఉంద‌నేది ప్ర‌జ‌ల్లో ప్ర‌శ్నార్థ‌క‌మైంది. గ‌తంలోనూ కొన్ని సంద‌ర్భాల్లో ఆధార్ సంఖ్య‌లు బ‌హిర్గ‌త‌మైన‌ట్టు వార్త‌లు వ్యాపించాయి. మీ ఆధార్ వివ‌రాలను మ‌రింత‌ సుర‌క్షితంగా ఉంచుకోవాల‌ని భావిస్తే ఈ క‌థ‌నం మీకోస‌మే…

లాక్ చేసుకునే స‌దుపాయం

ఆధార్‌లోని బ‌యోమెట్రిక్ స‌మాచారాన్ని ఇత‌రులు యాక్సెస్ చేయ‌కుండా లాక్ చేసుకునే స‌దుపాయం ఉంద‌న్న విష‌యం మీకు తెలుసా? ఇలా చేయ‌డం వ‌ల్ల మీ వేలిముద్ర‌ల‌ను, ఐరిస్ స్కాన్ మీతో స‌హా ఇత‌రులెవ్వ‌రూ యాక్సెస్ చేసేందుకు వీలుండ‌దు. ఇలాంటి ఆస‌క్తిక‌ర విశేషాల గురించి మ‌రింత స‌మాచారం తెలుసుకుందాం…

ఈ-కేవైసీ కోసం బ‌యోమెట్రిక్స్‌

ఆధార్ కోసం ఎన్‌రోల్ చేసుకునే స‌మ‌యంలో బ‌యోమెట్రిక్స్ (వేలిముద్ర‌లు, ఐరిస్ స్కాన్ న‌మూనాలు) వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. భార‌త విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఈ వివ‌రాల‌న్నీ నిక్షిప్తం చేస్తుంది. మీ ఖాతాదారును తెలుసుకోండి (కేవైసీ) వివ‌రాలైన పేరు, పుట్టిన తేదీ, చిరునామా లాంటి కీల‌క స‌మాచారం ఈ సంస్థ వ‌ద్ద నిక్షిప్త‌మై ఉంటుంది. ఆధార్ అనుసంధానిత ఈ కేవేసీ విధానాన్ని అనేక సేవ‌ల‌కు ఉప‌యోగించ‌డం ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువై పోయింది. బ్యాంకు ఖాతాను ప్రారంభించేందుకు, కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ పొందేందుకు ఈ-కేవైసీ విధానాన్నే పాటిస్తున్నారు.

కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ ఉదాహ‌ర‌ణ‌

ఉదాహ‌ర‌ణ‌కు కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ తీసుకునే స‌మ‌యంలో మొద‌ట మీ ఆధార్ నెంబ‌రును టెలికాం ప్ర‌తినిధికి తెలియ‌జేస్తారు. అత‌డు నెంబ‌రును ఆధార్ ధ్రువీక‌ర‌ణ వ్య‌వ‌స్థ‌లో న‌మోదుచేస్తాడు. మీకై మీరే కేవైసీ వివ‌రాల‌ను స‌మ‌ర్పిస్తున్నార‌న్న విష‌యాన్ని ధ్రువీక‌రించేందుకు వేలిముద్ర‌ల‌ను న‌మోదుచేయిస్తారు. మీ వేలిముద్ర‌ల స‌మాచారం, ఆధార్ నంబ‌రు, ఆధార్ వివ‌రాలు స‌రిపోయినప్పుడు మాత్ర‌మే మీకు కొత్త మొబైల్ క‌నెక్ష‌న్ ఇస్తారు. ఈ-కేవైసీ విధానం వ‌ల్ల కేవైసీ డాక్యుమెంట్ల‌ను విడిగా ఇవ్వాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. త‌ద్వారా మీరిచ్చిన డాక్యుమెంట్ల‌ను జిరాక్స్ తీసి ఇత‌రులు దుర్వినియోగం చేసే ప్ర‌మాదం కొంత వ‌ర‌కు నిరోధించ‌గ‌లిగారు.

నివారించేందుకు చ‌ర్య‌లు

ఇంత ప‌క‌డ్బందీగా ప్ర‌ణాళిక వేసినా, వేలిముద్ర‌ల‌ను దుర్వినియోగం చేయ‌డ‌మో, న‌క‌లు సృష్టించ‌డ‌మో చేస్తూనే ఉన్నారు. దీన్ని నివారించేందుకు యూఐడీఏఐ సంస్థ మ‌రింత సుర‌క్షిత‌మైన విధానాన్ని తీసుకొచ్చింది. బ‌యోమెట్రిక్ వివ‌రాల‌ను లాక్ చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పించింది. మీ అనుమ‌తి లేకుండా ఇత‌రులెవ్వ‌రూ ఈ స‌మాచారాన్ని యాక్సెస్ చేసుకోకుండా ఈ విధానం స‌హ‌క‌రిస్తుంది. అంతేకాదు, మీ వేలిముద్ర‌ల‌ను కూడా ఎవ‌రూ న‌క‌లు చేసేందుకు వీలు ఉండ‌దు.

బ‌యోమెట్రిక్ వివ‌రాలకు తాళం

బ‌యోమెట్రిక్ వివ‌రాలను కావాల్సిన‌ప్పుడు లాక్ లేదా అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. అయితే ఈ స‌దుపాయం కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే కుదురుతుంది. ఇలా చేసేందుకు…

  • ఆధార్ వెబ్‌సైట్‌లోని హోమ్ పేజీలోకి వెళ్లాలి.
  • లాక్‌/ అన్ లాక్ బ‌యోమెట్రిక్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు ఇలాంటి పేజీ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.
  • Lock.jpg

ఆధార్ సంఖ్య‌తోపాటు సెక్యూరిటీ కోడ్‌ను న‌మోదుచేయాలి. మొబైల్ నంబ‌రుకు వ‌చ్చే వ‌న్ టైమ్ పాస్‌వ‌ర్డ్ (ఓటీపీ)తో సెక్యూరిటీ కోడ్‌ను సృష్టించుకోవాలి. ఈ సెక్యూరిటీ కోడ్‌, ఆధార్ సంఖ్య‌ను న‌మోదుచేయ‌డం ద్వారా బ‌యోమెట్రిక్ వివ‌రాల‌కు లాక్‌/ అన‌్లాక్ చేయ‌వ‌చ్చు.

ఒక‌సారి లాక్ చేస్తే…

ఒక సారి బ‌యోమెట్రిక్ వివ‌రాల‌ను లాక్ చేశాక‌… ఏ విధ‌మైన ఆధార్ ధ్రువీక‌ర‌ణ‌ల‌ను పూర్తి చేయ‌లేరు అన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఆధార్ వివ‌రాలు దుర్వినియోగం కాకుండా ఈ విధానం కాపాడుతుంది. బ‌యోమెట్రిక్ వివ‌రాలు లాక్ చేశాక త‌ర్వాత ఎప్పుడైనా ఆధార్ అనుసంధాన ఈ-కేవైసీ చేయ‌ద‌లిస్తే అప్పుడు ప‌రిస్థితి ఏమిటి? ఇందుకు ప‌రిష్కార‌మూ సులువే. బ‌యోమెట్రిక్ వివ‌రాల‌ను ఆన్‌లైన్ ద్వారా ఏ విధంగా లాక్ చేశారో అదే విధంగా అన్ లాక్ చేయాలి. లాగిన్ అయ్యాక లాక్ లేదా అన్ లాక్ లేదా డిసేబుల్ చేసే ఆప్ష‌న్లు ఉంటాయి.

తాత్కాలికంగా 10 నిమిషాలు

అన్ లాక్ ఆప్ష‌న్ ఎంచుకోవ‌డం ద్వారా తాత్కాలికంగా బ‌యోమెట్రిక్ వివ‌రాలను యాక్సెస్ చేసుకునే అవ‌కాశం దొరుకుతుంది. అయితే 10 నిమిషాల్లోనే ఈ-కేవైసీ ప్ర‌క్రియ ముగించాలి. అన్‌లాక్ చేసిన వివ‌రాలు తిరిగి 10 నిమిషాల్లో వాటంత‌ట అదే లాక్ అయిపోతాయి. ఈ స‌దుపాయాన్ని వినియోగించుకునేందుకు ఎలాంటి క్లిష్ట‌మైన పాస్‌వ‌ర్డ్‌ల‌ను గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కావాల్సింద‌ల్లా ఆధార్ నెంబ‌రు, ఆధార్‌తో రిజిస్ట‌ర్ అయిన మొబైల్ కు యాక్సెస్ క‌లిగి ఉండ‌డం. ఆధార్‌ను లాక్ చేసుకున్నా స‌రే ఆధార్ అనుసంధానిత ధ్రువీక‌ర‌ణ‌ను, ఓటీపీ అనుసంధాన ధ్రువీక‌ర‌ణ‌ను పూర్తిచేయ‌వ‌చ్చు. బ‌యోమెట్రిక్ వివ‌రాల‌ను లాక్ చేసినంత మాత్రాన ఓటీపీలు రావ‌డం ఆగిపోవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని