ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు ఆధార్ ఆధారిత ఇ-కేవేసీ ఉప‌యోగించ‌ద‌లిస్తే కొన్ని విష‌యాల‌ను గుర్తుంచుకోవ‌డం మంచిది.

Published : 20 Dec 2020 13:17 IST

పాల‌సీ కొనుగోలు చేసేవారి వివ‌రాలు ధ్రువీక‌రించుకునేందుకు ఆధార్ ను ఇ-కేవైసీగా ఉప‌యోగించ‌డాన్నిభార‌తీయ బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) స‌మ‌ర్థించింది. ఈ విష‌య‌మై బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏఐ మ‌రోసారి స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

వినియోగదారు స‌మ్మ‌తిస్తేనే ఆధార్‌ను ఇ-కేవైసీగా వినియోగించాల్సిందిగా ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ సారి ఏదైనా పాల‌సీ కొనుగోలు చేసే ముందు ఇ-కేవైసీ ఆధారిత ఆధార్‌ను ఇవ్వ‌దల్చుకుంటే ఈ విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకోగ‌ల‌రు…

జీవిత బీమా కోసం కేవైసీ

జీవిత బీమా నియంత్ర‌ణ సూత్రాల ప్ర‌కారం పాల‌సీ ఇచ్చేవారు విధిగా వినియోగ‌దారుల వ‌ద్ద నుంచి విధిగా కేవైసీని పొందాల్సి ఉంటుంది. నేరుగా పాల‌సీని కొనుగోలు చేసేట‌ప్పుడు కేవైసీ వివ‌రాల‌ను ముందుగానే వినియోగ‌దారులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ఆన్‌లైన్ లాంటి ఇత‌ర విధానాల్లో పాల‌సీ అందుకున్న 15రోజుల్లోగా కేవైసీ ప‌త్రాల‌ను బీమా సంస్థ‌కు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

సాధార‌ణ బీమా కోస‌మైతే…

ఆరోగ్య బీమా, వాహ‌న‌, గృహ బీమా లాంటి సాధార‌ణ బీమాల విష‌యంలో క్లెయింల కోసం ద‌ర‌ఖాస్తు చేసినప్పుడు కేవైసీ ప‌త్రాల‌ను ప‌రిశీలించాల్సిందిగా బీమా సంస్థ‌ల‌కు ఐఆర్‌డీఏఐ నిబంధ‌న‌ల్లో పేర్కొంది. అయితే రూ.ల‌క్ష పైన చేసే క్లెయింల‌కే కేవైసీ ధ్రువీక‌రించాల‌ని నిబంధ‌న‌ల్లో పేర్కొన్నారు.

ఓటీపీ వ‌స్తుంది…

ఆధార్ ప్రాధికార సంస్థ అయిన యూఐడీఏఐ ఆధార్ వివ‌రాల‌ను ధ్రువీక‌రించేందుకు అవ‌కాశాలున్న మార్గాల‌ను ఆధార్ చ‌ట్టం, 2016లో పేర్కొంది. దీని ప్ర‌కారం ఆధార్ ఉన్న వ్య‌క్తి రిజిస్ట‌ర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. ఈ ఓటీపీని న‌మోదుచేస్తేనే ఏదైనా ధ్రువీక‌ర‌ణ ప్ర‌క్రియ ముందుకెళుతుంది. దీన్ని బ‌ట్టి వినియోగ‌దారుడు ఓటీపీ ఇవ్వ‌క‌పోతే ధ్రువీక‌ర‌ణ ప్ర‌క్రియ నిలిచిపోతుంది. దీని వ‌ల్ల ఇత‌రులెవ్వ‌రూ మీ వివ‌రాలు సులువుగా ఇచ్చేందుకు వీలుండ‌దు.

వేలిముద్ర‌ల ఆధారంగా…

మ‌రో మార్గం ప్ర‌కారం వినియోగ‌దారుడు త‌న బ‌యోమెట్రిక్ వివ‌రాలను గుర్తింపు ధ్రువీక‌ర‌ణ‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్క‌డ వేలిముద్ర న‌మూనాల‌ను ఇచ్చిన‌ట్ట‌యితే వ్య‌క్తి వివ‌రాలు ధ్రువీక‌రించిన‌ట్ట‌వుతుంది. ఈ విధానం వ‌ల్ల కూడా మ‌న వివ‌రాల‌ను ఇత‌రులు అక్ర‌మంగా ఉప‌యోగించ‌కుండా వీల్లేకుండా చేస్తుంది.

వినియోగ‌దారు స‌మ్మ‌తి మేర‌కే…

బీమా నియంత్ర‌ణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఆధార్‌ను ఇ-కేవైసీగా ఉప‌యోగించడాన్నే వినియోగ‌దారు స‌మ్మ‌తి మేర‌కే చేయాల్సిందిగా పేర్కొవ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన విష‌యం.

ఆధార్ ఒక్క‌టే చాలు…

ఆధార్ ఇ-కేవైసీ ధ్రువీక‌ర‌ణ‌ను ఎప్ప‌టినుంచో అనుమ‌తిస్తున్నా… ఇప్పుడు తాజాగా బీమా నియంత్ర‌ణ సంస్థ మాత్రం పాల‌సీ కొనుగోలుకు ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంద‌ని… పాల‌సీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసేందుకు ఇది స‌రిపోతుంద‌ని పేర్కొన‌డం విశేషం.

ఫొటో స‌రిగా లేక‌పోతే…?

దీని వ‌ల్ల పాల‌సీ కొనుగోలు చేయాల‌నుకునేవారు … ఆధార్ ఒక్క‌టే ఇస్తే స‌రిపోతుంది. గుర్తింపు, పుట్టిన తేదీ, చిరునామా గుర్తింపు ప‌త్రాల‌ను ప్ర‌త్యేకంగా ఇవ్వ‌న‌క్క‌ర్లేదు. అయితే ఆధార్ కార్డులో ఫొటో స‌రిగా లేకున్నా… పేరులో ఏమైనా పొర‌పాట్లు ఉన్నా మ‌రో గుర్తింపు కార్డును అడిగే అవ‌కాశం ఉంది. ఇ-కేవైసీగా ఆధార్‌ను ఉప‌యోగించాల‌నుకుంటే మాత్రం ఆధార్ వివ‌రాలు అన్నీ స‌రిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవ‌డం మంచిది. ఒక వేళ ఆధార్ వివ‌రాల్లో మార్పులు చేయ‌ద‌లిస్తే ఈ క‌థ‌నాన్ని చ‌ద‌వ‌గ‌ల‌రు.
ఆధార్ లో మార్పుల‌కు మూడు మార్గాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని