P2P Lending: పీ2పీలో పెట్టుబ‌డులు మంచిదేనా? 

పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ముందుగా రుణగ్ర‌హీత‌ల ప్రాథ‌మిక వివ‌రాలు, క్రెడిట్ చ‌రిత్ర‌ను వెరిఫై చేస్తాయి.

Updated : 24 Aug 2021 17:22 IST

క్రెడ్‌, భార‌త్‌పే వంటి కొన్ని ఫిన్‌టెక్ సంస్థ‌లు పీర్‌-టు-పీర్‌(పీ2పీ) మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. ఫిన్‌టెక్ స్టార్టప్ క్రెడ్ తాజాగా క్రెడ్ మింట్ పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిలో రూ.ల‌క్ష నుంచి మొద‌లుకుని రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్టొచ్చని, దాదాపు 9 శాతం రాబ‌డి ఉంటుద‌ని సంస్థ తెలుపుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు పీర్‌-టు-పీర్ లెండింగ్ అంటే ఏంటి?లాభ‌న‌ష్టాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం!

పీర్ టూ పీర్ లెండింగ్ అంటే ఏంటి

ఒక‌రి నుంచి మ‌రొక‌రు అప్పుగా డ‌బ్బు తీసుకోవ‌డాన్నే సంక్షిప్తంగా పీ2పీ లెండింగ్ అంటారు. అంటే రుణ గ్ర‌హీత‌లను రుణదాత‌లను ఒకే వేదిక‌పైకి తీసుకురావ‌డం. ఇవి బ్యాంకులు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్ల మాదిరిగా పనిచేయవు. ఇందులో రుణదాత మీ వంటి వ్యక్తులు కావచ్చు లేదా ఆర్థిక సంస్థలు కావచ్చు. ఫెయిర్ సెంట్, ఐ 2ఐ ఫండింగ్, పీర్లాండ్ వంటి పీ2పీ సంస్థలకు ఆర్థికేతర బ్యాంకింగ్ సంస్థల లైసెన్సు ఉంది. పీ2పీ ప్లాట్‌ఫామ్‌లు ముందుగా రుణగ్ర‌హీత‌ల ప్రాథ‌మిక వివ‌రాలు, క్రెడిట్ చ‌రిత్ర‌ను వెరిఫై చేస్తాయి. అలాగే ఏ రుణ‌గ్ర‌హీత‌కు డబ్బు ఇవ్వాలో రుణ‌దాత‌లు ఎంపిక చేసుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. రుణ‌గ్ర‌హీత‌ల క్రెడిట్ చ‌రిత్ర ఆధారంగా రిస్క్ ప్రొఫైల్‌ను అంచ‌నా వేసి రిస్క్ బ‌కెట్‌లుగా వర్గీక‌రించి రుణ‌దాత‌లకు స‌హాయ‌ప‌డ‌తాయి.

ఎలా పనిచేస్తుంది?

మీరు భారతీయులైతే ఈ వేదిక ద్వారా రుణం తీసుకోవచ్చు. ఇందుకుగానూ మీ పేరు, చిరునామా, కాంటాక్ట్ నెంబర్, పుట్టిన తేది, జెండర్, తీసుకోవాలనుకుంటున్న రుణం మొత్తం, ఉద్యోగం, ఆదాయం, పాన్ నెం. వంటి పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఈ వేదికను ఉపయోగించి వ్యక్తిగత రుణం లేదా వ్యాపారానికి రుణం తీసుకోవచ్చు. వడ్డీ రేటు 8.95 శాతం నుంచి 30శాతం వరకు ఉంటుంది. ఇలాంటి వేదిక‌ల ద్వారా ఇచ్చే రుణాలు దాదాపు చిన్న మొత్తంలోనే ఉంటాయి. చాలా వ‌ర‌కు రుణాలు రూ.1 ల‌క్ష‌కు దిగువ‌నే ఉంటాయి. ఆర్‌బీఐ నియ‌మాల ప్ర‌కారం పెట్టుబ‌డిదారులు ఒక రుణ‌గ్ర‌హీత‌కు రూ.50వేల‌కు మించి రుణం ఇవ్వ‌కూడదు. అలాగే ఒక రుణ‌గ్ర‌హీత రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం తీసుకోకూడ‌దు. సాధారణంగా వ్యాపారం, గృహ మరమ్మతులు, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు రుణం పొందొచ్చు.

ఆర్‌బీఐ నియంత్ర‌ణ‌లో ఉంటాయా?

అవున‌నే చెప్పాలి.  2017లో ఆర్‌బీఐ పీ2పీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. ఈ నియ‌మాల ప్ర‌కారం పీ2పీ వేదిక‌లు ఆర్‌బీఐ వ‌ద్ద న‌మోదు చేసుకోవాలి. క‌నీసం రూ.2కోట్ల నికర విలువ క‌లిగి ఉండాలి. రుణ‌గ్ర‌హీత‌లు, లావాదేవీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని క్రెడిట్ స‌మాచార సంస్థ‌లకు త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాలి. అప్పు ఇచ్చే వ్య‌క్తి అన్ని పీ2పీ ఫ్లాట్‌ఫామ్‌లు ద్వారా ఇచ్చే రుణం రూ.50 ల‌క్ష‌ల‌కు మించ‌కూడ‌దు. పెట్టుబ‌డిదారుడు రూ.10 ల‌క్ష‌ల కంటే ఎక్కువ మొత్తాన్ని అప్పు ఇస్తే, పీ2పీ ఫ్లాట్‌ఫామ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్‌కి రూ.50 లక్ష‌ల నిక‌ర విలువ ధ్రువపత్రాన్ని స‌మ‌ర్పించాలి. అలాగే, రుణ కాలపరిమితి 36 నెల‌ల‌కు మించ‌కూడ‌దు.

ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా రాబ‌డి ఎలా ఉంటుంది?

ఈ వేదికల ద్వారా రుణాలు ఇచ్చే మ‌దుప‌ర్లు గ‌రిష్ఠంగా వార్షిక రాబ‌డి రేటు 12-36 శాతం వ‌ర‌కూ పొందే అవ‌కాశ‌ముంటుంది. అయితే ఇక్క‌డ న‌ష్ట‌భ‌యం చాలా అధికంగా ఉంటుంది. వ‌చ్చే రాబ‌డి పెరిగే కొద్దీ నష్టభయం కూడా పెరుగుతుంది. ఈ వెబ్‌సైట్లు లేదా యాప్‌లు రుణ‌దాత‌ల‌కు త‌మ రుణాల‌ను ఒకరికే కాకుండా వివిధ వ్య‌క్తుల‌కు అందించేలా సూచిస్తారు. దీని ద్వారా వైవిధ్య‌త పెరిగి న‌ష్ట‌భ‌యం త‌గ్గుతుంది.

రాబ‌డిపై ఎంత ప‌న్ను వ‌ర్తిస్తుంది?

వ‌డ్డీ ఆదాయం 'ఇతర ఆదాయం' మార్గం కింద ప‌రిగ‌ణించి శ్లాబ్‌ రేటు ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు. ప‌న్ను చెల్లించ‌క ముందు 12 శాతం రాబ‌డి పొందితే.. 30శాతం ప‌న్ను శ్లాబ్‌ కింద‌కి వ‌చ్చే వారికి ప‌న్ను, సెస్ అనంత‌ర రాబ‌డి 8.25 శాతం ఉంటుంది. అయితే బ్యాంకు మాదిరిగా పీ2పీ వేదిక‌లు వ‌డ్డీ ఆదాయంపై టీడీఎస్ డిడ‌క్ట్ చేయ‌వు. రుణ‌దాత‌గా ప‌న్ను లెక్కించి, స్వీయ అంచ‌నా ప‌న్ను చెల్లించాలి. సాధార‌ణంగా వ‌డ్డీపై ‘అక్రూవల్’ సిస్టమ్ కింద పన్ను విధిస్తారు. కాబట్టి ప‌న్ను చెల్లింపుల‌కు మీ బ్యాంకు ఖాతాలో వ‌డ్డీ మొత్తం జ‌మ‌కాన‌వ‌స‌రం లేదు.

రాబ‌డికి హామీ ఉండ‌దు..

ఈ వేదిక‌ల ద్వారా రుణం ఇచ్చి వ‌డ్డీ పొందాల‌నుకునే వారు గుర్తుంచుకోవాల్సింది వీటిలో డ‌బ్బు తిరిగి చెల్లించే దానిపై హామీ ఉండ‌దు. ఈ లెండిగ్ యాప్లు స‌ర్వీసు మాత్ర‌మే అందిస్తాయి. కానీ ఇత‌ర ఆర్థికప‌ర‌మైన అంశాల‌కు చ‌ట్ట‌ప‌రంగా భాద్య‌త వ‌హించ‌వు. ఈ యాప్‌లు వినియోగించే ముందు పూర్తి వివ‌రాలు తెలుసుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని