
Adani ports: ‘ముంద్రా’ ఎఫెక్ట్.. అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం
దిల్లీ: దేశవ్యాప్తంగా పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ పోర్ట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ దేశాలకు సంబంధించిన సరకు రవాణాను తమ టెర్మినళ్ల నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇటీవల గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పెద్దఎత్తున డ్రగ్స్పట్టుబడిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.
‘‘ఇరాన్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల సరకులు కలిగిన కంటైనర్ల ఎగుమతులు, దిగుమతులు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నుంచి నిలిపివేస్తున్నాం. నవంబర్ 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది’’ అని అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో పేర్కొంది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఏపీ సెజ్) నిర్వహించే అన్నీ టెర్మినల్స్‌కు, ఏపీ సెజ్ పోర్టుల్లోని థర్డ్‌పార్టీ టెర్మినళ్లకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని, తర్వాతి నోటీసు ఇచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని పేర్కొంది.
సెప్టెంబర్‌లో అఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరుకున్న సుమారు 3వేల కిలోల హెరాయిన్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పోర్టును అదానీ గ్రూప్ నిర్వహిస్తుండడంతో ఆ గ్రూప్‌పై పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం కూడా ఉండడంతో తెలుగునాట సంచలనంగా మారింది. తాజాగా ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది.