Adani Wilmar IPO: ఐపీఓకి అదానీ కంపెనీ.. కనీసం ఎంత పెట్టుబడి పెట్టాలంటే?

ఫార్చూన్‌ బ్రాండుపై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ధరల శ్రేణిని రూ.218-230 మధ్య నిర్ణయించారు.....

Published : 21 Jan 2022 13:56 IST

దిల్లీ: ఫార్చూన్‌ బ్రాండ్‌పై వంట నూనెలు విక్రయించే అదానీ విల్మర్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ఈనెల 27న ప్రారంభమై 31న ముగుస్తుంది. ధరల శ్రేణిని రూ.218-230 మధ్య నిర్ణయించారు. ఇష్యూలో బాగంగా రూ.3,600 కోట్ల విలువైన తాజా షేర్లను అదానీ విల్మర్‌ (Adani Wilmar) విక్రయిస్తుంది. కనీసం 65 షేర్లకు బిడ్‌ వేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం రూ.14,950 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ నిధుల నుంచి రూ.1,900 కోట్లను మూలధన వ్యయాల కోసం, రూ.1,100 కోట్లను రుణాల చెల్లింపుల కోసం, రూ.500 కోట్లను వ్యూహాత్మక కొనుగోళ్లు, పెట్టుబడుల నిమిత్తం అదానీ విల్మర్‌ వినియోగించనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ జనవరి 25న ప్రారంభం కానుంది. రూ.37,195 కోట్ల ఆదాయంతో దేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ కంపెనీల్లో ఒకటిగా అదానీ విల్మర్‌ ఉంది.

తొలుత ప్రతిపాదించిన రూ.4,500 కోట్ల ఇష్యూకు బదులుగా రూ.3,600 కోట్ల ఐపీఓతో అదానీ విల్మర్‌ ఐపీఓకి వస్తోంది. అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్‌; సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌లు చెరిసగం వాటాతో ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థే ఏడబ్ల్యూఎల్‌. ప్రస్తుతం అదానీ గ్రూప్‌నకు చెందిన ఆరు కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదై ఉన్నాయి.

అదానీ విల్మర్‌ 1999లో వ్యవస్థాపితమైంది. బియ్యం, గోధుమ పిండి, మైదాపిండి, రవ్వ, పప్పుధాన్యాలు ఇలా పలు రకాల విభాగాల్లోనూ వ్యాపారాలను ఇది నిర్వహిస్తోంది. 2027 కల్లా దేశంలోనే దిగ్గజ ఆహారపదార్థాల ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG)గా అవతరించాలని కంపెనీ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు