ముందుగా ఆమోదించిన వ్య‌క్తిగ‌త రుణాలు గురించి తెలుసా?

మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారెవ‌రికైనా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణాల‌ను మంజూరు చేసేందుకు సుముఖంగా ఉంటాయి

Published : 11 Jan 2021 17:19 IST

చాలా బ్యాంకులు వారి ఖాతాదారులకు కాల్ చేసి, కనీస డాక్యుమెంటేషన్ అవ‌స‌రం లేని, బ్యాంకుకు రావాల్సిన‌ ప‌నిలేకుండా, వేగంగా ముందుగా ఆమోదించిన వ్య‌క్తి గ‌త రుణాల‌ను మీకు అందించడానికి బ్యాంకు సిద్ధంగా ఉందని, మిమ్మ‌ల్ని అభినందిస్తూ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి మీకు వందలాది ఎస్ఎమ్ఎస్‌లు లేదా కాల్స్ వ‌స్తుంటాయి. అస‌లు ముందుగా ఆమోదించబడిన వ్యక్తిగత రుణం అంటే ఏమిటి? ఇది తీసుకోవడం మంచిదేనా? తెలుసుకుందాం.

ముందుగా ఆమోదించిన రుణం అంటే ఏమిటి?
ఒకవేళ రుణదాత మీకు కాల్ చేసి, ముందుగా ఆమోదించిన రుణం లేదా తక్షణ ఆమోదం పొందిన రుణానికి మీరు అర్హులని చెప్పారంటే, దాని అర్ధం వారు మీ ప్రొఫైల్ సమాచారం అనగా మీ ఆదాయం, అప్పటి వరకు మీ చెల్లింపుల చరిత్ర, మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ / క్రెడిట్లు, మీ సిబిల్ స్కోర్ తో పాటు అనేక ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని, మీకు ముందుగా ఆమోదించిన రుణాన్ని ఆఫర్ చేస్తున్నార‌ని అర్థం. ముందుగా ఆమోదించిన రుణాల‌కు చాలా వ‌ర‌కు సెక్యూరిటీ ఉండదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారెవ‌రికైనా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ లేదా ఫిన్‌టెక్ లెండ‌ర్లు రుణాల‌ను మంజూరు చేస్తారు.

ఒకవేళ మీరు ఇలాంటి కాల్స్ ను పొందినట్లైతే, మీ అవసరాన్ని బట్టి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీరు ఫోన్ కాల్ ను పొందినంత మాత్రాన ఖచ్చితంగా రుణాన్ని పొందుతారని చెప్పలేము. మీరు కేవలం మొదటి తనిఖీని మాత్రమే పూర్తి చేసినట్లు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముందుగా ఆమోదించిన రుణం ఒక సమయ పరిమితితో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీరు రుణం తీసుకున్నట్లైతే, దానిని కేవలం కొన్ని నెలల (సాధారణంగా 6 నెలలు) సమయంలోగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీరు ముందుగానే ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ రుణాలు కూడా ఇత‌ర రుణాల మాదిరిగానే ఉంటాయి. అయితే ఈ రుణాల కోసం బ్యాంకులు స్వ‌యంగా మిమ్మ‌ల్ని సంప్ర‌దిస్తాయి.

అర్హ‌త‌:
దీర్ఘ‌కాలం పాటు బ్యాంకుతో సంబంధాలు కొన‌సాగించ‌డం, మంచి క్రెడిట్ స్కోరు, బ్యాంకు బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణ‌, పొదుపు చ‌రిత్ర‌, మంచి ఆదాయం, తిరిగి చెల్లించ‌డంలో ఉత్త‌మ‌ రికార్డు వంటివి ముందుస్తు రుణాల‌ను ఆమోదించేందుకు కావ‌ల‌సిన అర్హ‌తలు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అర్హ‌త‌ను ప‌రిశీలిస్తారు.

కావ‌ల‌సిన ప‌త్రాలు:
సాధార‌ణంగా బ్యాంకులు, వారి ఖాతాదారుల‌కు ముందుగా ఆమోదించిన రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తాయి. అందువ‌ల్ల చాలా త‌క్కువ లేదా అస‌లు ఎలాంటి డాక్యుమెంటేష‌న్ లేకుండా రుణాల‌ను మంజూరు చేస్తాయి. ఒక‌వేళ మీరు బ్యాంకు ఖాతాదారుడు కాక‌పోతే రుణదాత మీ 6 నెల‌ల బ్యాంకు స్టేట్‌మెంట్లు, 3 నెల‌ల శాల‌రీ స్లిప్‌లు, అడ్ర‌స్ ప్రూఫ్ కోసం ఆధార్‌, పాన్ వంటి ఐడీ ప్రూఫ్‌ల‌ను తీసుకుంటారు.

ముందుగా ఆమోదించిన రుణాల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు:

ప్రాసెసింగ్ సమయం తక్కువ:
ముందుగా ఆమోదించిన రుణానికి ప్రాసెసింగ్ సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రుణాన్ని ముందుగానే ఆమోదించారు కాబట్టి. ఇలాంటి రుణాల విషయంలో, మీ ప్రాథమిక వివరాలు రుణదాత వద్ద ఉంటాయి కాబట్టి చాలావరకు తనిఖీలు ముందుగానే పూర్తి అవుతాయి. మీరు కేవలం వారు అడిగిన అన్ని రకాల పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. దీని వలన మొత్తం ప్రాసెసింగ్ సమయం తగ్గడంతో పాటు ప్రక్రియ వేగంగా జరుగుతాయి.

తక్కువ వడ్డీ రేట్లకే రుణం పొందే అవకాశం :
అనేక సందర్భాల్లో, ముందుగా ఆమోదం పొందిన రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే అందిస్తారు. ఎందుకంటే మంచి క్రెడిట్ చరిత్ర లేదా ఒక స్థిరమైన నగదు ల‌భ్య‌త‌ కలిగిన వారికి మాత్రమే ముందుగా ఆమోదం పొందిన రుణాలను అందిస్తాయి. అలాంటి వారు డీఫాల్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాన్ని అందిస్తాయి.

రుణం ఎందుకోసం తెలుప‌వ‌ల‌సిన ప‌నిలేదు :
మీ వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌కు నిధులు ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. దేనికి ఎంత మొత్తం వ‌చ్చిస్తున్నార‌నేది తెలుప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

తిరిగి చెల్లించేందుకు కావ‌ల‌సిన స‌మ‌యం:
ముందుగా ఆమోదించిన రుణాల‌ను తిరిగి చెల్లించేందుకు కావ‌ల‌సిన స‌మ‌యాన్ని రుణ గ్ర‌హీత ఎంపిక చేసుకోవ‌చ్చు. చాలా బ్యాంకులు తిరిగి చెల్లించేందుకు 12 నెల‌ల నుంచి 60 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యాన్ని ఇస్తాయి.

ద‌ర‌ఖాస్తు చేయ‌డం ఎలా?
ఆఫ‌ర్ వ‌చ్చిన వారు, బ్యాంకు ప్ర‌తినిధిని సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన ఫార్మాలిటీల‌ను పూర్తి చేసిన అనంత‌రం నిధులు నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జ‌మ చేస్తారు.

ఆన్‌లైన్‌లోనూ ద‌ర‌ఖాస్తు చేస్తుకోవ‌చ్చు:

1.ముందుగా మీ నెట్ బ్యాంకింగ్ ఖాతాకు లాగ్ఇన్ అవ్వాలి.
2.రుణ విభాగంలోని ‘ప్రీ అప్రూవుడ్ లోన్స్‌’ను ఎంపిక చేసుకోవాలి.
3.‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి.
4.పాప్ అప్ విండోలో మీరు తీసుకునే రుణ ర‌కాన్ని ఎంపిక చేసుకుని ‘అప్లై నౌ’ పై క్లిక్ చేయాలి.
5.ఫార‌మ్‌ను ఫిల్ చేయాలి.
గుర్తించుకోవాల్సిన అంశాలు:

సాధార‌ణంగా బ్యాంకులు త‌మంత‌ట‌తాముగా రుణాలు ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే ముందుగా ఆమోదించిన రుణాలు అందుబాటులో ఉంటాయి. అందువ‌ల్ల నిర్థిష్ట స‌మ‌యం వ‌ర‌కు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. ఆ స‌మ‌యంలోనే వినియోగ‌దారుడు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముందుస్తు చెల్లింపుల‌కు, ముందుస్తు ముగింపుల‌కు చార్జీలు వ‌ర్తిస్తాయి.
జిరో ప్రాసెసింగ్ ఫీజుతో మంజూరు చేయ‌వ‌ల‌సిందిగా కోర‌వ‌చ్చు. బ్యాంకులు అందించే వ‌డ్డీ రేట్లు, వివిధ అంశాల‌ను ప‌రిశీలించి రుణం తీసుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని